రూలంటే రూలే!

ABN , First Publish Date - 2020-11-11T10:15:52+05:30 IST

రూలంటే రూలే.. అది ఎవరికైనా ఒకటేనని నిరూపించింది జిల్లా రవాణా శాఖ. సంబంధిత ఉద్యోగులే రూల్స్‌ని పాటించకపోతే ఇతరులకెలా చెబుతారు..

రూలంటే రూలే!

ఆంధ్రజ్యోతి, విజయవాడ : రూలంటే రూలే.. అది ఎవరికైనా ఒకటేనని నిరూపించింది జిల్లా రవాణా శాఖ. సంబంధిత ఉద్యోగులే రూల్స్‌ని పాటించకపోతే ఇతరులకెలా చెబుతారు.. అందుకే సాక్షాత్తు రవాణా ఉద్యోగులనే టార్గెట్‌ చేశారు. కార్యాలయం బయట చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో 8 మంది ఉద్యోగులు, 22 మంది ఇతరులు అడ్డంగా బుక్కయ్యారు. రవాణా నిబంధనలను మనవాళ్లు ఎలా పాటిస్తున్నారో తెలుసుకునేందుకు మంగళవారం ఆకస్మికంగా ఒక ప్రత్యేక బృందం రవాణా శాఖ కార్యాలయం బయటే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించింది. ఈ డ్రైవ్‌లో 8 మంది రవాణా శాఖ ఉద్యోగులు నిబంధనలు పాటించకుండా దొరికిపోయారు. వీరితో పాటు కార్యాలయానికి వచ్చిన వారిలో మరో 22 మంది వాహనదారులు కూడా బుక్కయ్యారు.


అయితే ఈపని చేయించింది ఎవరో కాదు! స్వయానా జిల్లా ఉప రవాణాశాఖాధికారి (డీటీసీ) ఎం పురేంద్ర కావటం విశేషం! మంగళవారం రవాణాశాఖ కార్యాలయం బయటే స్పెషల్‌ టీమ్‌ బృందం మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ (ఎంవీఐలు) ఎస్‌ఎస్‌ నాయక్‌, మహమ్మద్‌ అలీ, రాధికా దేవి బయట నిలుచుని ఉన్నారు. మనతోపాటే పనిచేసే ఉద్యోగులే కదాని వారిని లైట్‌ తీసుకుని ఎంచక్కా తమ వాహనాల్లో రయ్‌మంటూ లోపలికి వెళ్లబోయారు.. ఎంవీఐలు వారిని నిలువరించి తనిఖీలు చేయటంతో ఉద్యోగులు ఖిన్నులయ్యారు. 8 మంది ఉద్యోగులు హెల్మెట్‌ లేకుండానే లోపలికి వచ్చేశారు. దీంతో వీరిపై కేసులు నమోదు చేశారు. అయ్యో అదేమిటని ప్రశ్నించినా కేసులు నమోదు చేశారు. వీరితో పాటు కార్యాలయానికి వాహనాల్లో వచ్చిన మరో 22 మంది వాహనదారులపైనా కేసులు నమోదు చేశారు. సొంత ఉద్యోగులు రవాణా శాఖ నిబంధనలు పాటించకపోవటంపై డీటీసీ ఎం పురేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు పాటించకుంటే ఉద్యోగులైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. హెల్మెంట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తే రూ. 1000 జరిమానాతో పాటు, 3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తామన్నారు. రోడ్దు భద్రతా చర్యలను విస్తృతంగా చేపడతామని, ప్రత్యేక బృందాలు ముమ్మర తనిఖీలు చేస్తాయన్నారు.

Updated Date - 2020-11-11T10:15:52+05:30 IST