ఇన్‌చార్జిల పాలన

ABN , First Publish Date - 2021-10-31T06:07:07+05:30 IST

జిల్లాలో విద్యాశాఖ పాలన గాడితప్పింది. పాఠశాలలను పర్యవేక్షించే ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇన్‌చార్జిల పాలన

  1. నాలుగు డిప్యూటీ డీఈవో పోస్టులకు లేరు
  2. 21 ఎంఈవో పోస్టులకు ఇన్‌చార్జిలే గతి
  3. బయోమెట్రిక్‌ హాజరు అమలు ఎక్కడ?


కర్నూలు(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 30: జిల్లాలో విద్యాశాఖ పాలన గాడితప్పింది. పాఠశాలలను పర్యవేక్షించే ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీర్ఘకాలంగా ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో అధికారి రెండు పోస్టులకు మించి ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దీనితో దేనికీ న్యాయం చేయడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. 


నాలుగు డిప్యూటీ డీఈవో పోస్టులు ఖాళీ


జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలోని పోస్టులతోపాటు కర్నూలు, డోన్‌, నంద్యాల, ఆదోని డివిజన్లకు నాలుగు ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి జిల్లాలో ఉప విద్యాశాఖ అధికారుల పోస్టుల కొరత ఉన్నది. జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి కర్నూలు, నంద్యాల, డోన్‌ డివిజన్ల ఉప విద్యాశాఖ అధికారుల పోస్టుల్లో ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆర్‌ఎంఎస్‌ఏ ఏడీగా పని చేస్తున్న ప్రకాష్‌రెడ్డికి ఆదోని డివిజన్‌ ఉప విద్యాశాఖ అధికారి ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. ఇలా ఒక అధికారి మూడు, నాలుగు పోస్టులకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తుండటంతో పాఠశాలల పర్యవేక్షణ కొరవడింది. కార్యాలయాల్లోనే కూర్చొని సంతకాలకే పరిమితమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. 


21 ఎంఈవో పోస్టులు ఖాళీ


జిల్లాలో 54 మండలాలకు 33 మంది మాత్రమే రెగ్యులర్‌ ఎంఈవోలు ఉన్నారు. 21 ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా మంది ఎంఈవోలు రెండు కంటే ఎక్కువ మండలాలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. తుగ్గలి ఎంఈవో మూడు మండలాలకు ఇన్‌చార్జిగా ఉన్నారు. దీన్ని బట్టి పాఠశాలల పర్యవేక్షణ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. వీరికి పాఠశాలల్లో జరిగే మనబడి నాడు-నేడు పనులు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుకలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు పర్యవేక్షణ వంటి పనులకు, జిల్లా కేంద్రంలో జరిగే అధికారుల సమావేశాలకే సమయం సరిపోవడం లేదు. అసలు పాఠశాలలో బోధన ఎలా ఉంది? టీచర్లు ఏం చేస్తున్నారు? అనే దృష్టి పెట్టడానికి వ్యవధి కూడా లేదు. 


అమలుకాని బయోమెట్రిక్‌


ఉపాధ్యాయులు, సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరు వేయాలి. చాలా పాఠశాలల్లో బయోమెట్రిక్‌ డివైజ్‌లు రెండు నెలల నుంచి మొరాయిస్తున్నాయి. ఎప్పుడు బయోమెట్రిక్‌ మీట నొక్కినా సర్వర్‌ డౌన్‌ అని డిస్‌ప్లే చూపిస్తోందని ఉపాధ్యాయులు అంటున్నారు. దీంతో ఉపాధ్యాయులు పాత పద్ధతిలోనే అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారు. బయోమెట్రిక్‌ డివైజ్‌ల్లో సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్ట్టలేషన్‌ సక్రమంగా లేకపోవడం, సిగ్నల్స్‌ చూపించకపోవడం, డివైజ్‌ల్లోని సిమ్‌ల కాలపరిమితి ముగియడం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు టెక్నికల్‌ అసిస్టెంట్లకు గత ఏడాది నుంచి జీతాలు చెల్లించడం లేదు. ఈ సమస్యలన్నీ చక్కబెట్టాల్సిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 


ఉన్న అధికారులతోనే పని చేయిస్తున్నాం


జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. ఉన్న అధికారులతోనే పని చేయించుకోవాల్సి వస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి సర్వీసు రూల్స్‌ వ్యవహారం పెండింగ్‌లో ఉండటంతో పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులు భర్తీ కావడం లేదు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరైతే ఉపేక్షించేదే లేదు. అలాంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. 

- వి.రంగారెడ్డి, డీఈవో

Updated Date - 2021-10-31T06:07:07+05:30 IST