రూపాయిని రక్షించాల్సింది పాలకులే!

ABN , First Publish Date - 2022-06-02T06:36:52+05:30 IST

అంతర్జాతీయ మారకపు మార్కెట్‌లో భారతదేశ కరెన్సీ రూపాయి విలువ పతనాన్ని చవిచూస్తోంది. క్రమానుగతంగా క్షీణిస్తున్న రూపాయి ఆసియాలోనే అత్యంత భారీగా పతనమైన కరెన్సీగా...

రూపాయిని రక్షించాల్సింది పాలకులే!

అంతర్జాతీయ మారకపు మార్కెట్‌లో భారతదేశ కరెన్సీ రూపాయి విలువ పతనాన్ని చవిచూస్తోంది. క్రమానుగతంగా క్షీణిస్తున్న రూపాయి ఆసియాలోనే అత్యంత భారీగా పతనమైన కరెన్సీగా నిలవడం ఆందోళనకరం.


కరెన్సీ విలువ క్షీణత దేశ ఆర్థిక వ్యవస్థపైన, విస్తృతమైన ప్రజా జీవన ప్రమాణాల స్థాయిపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. అమెరికన్‌ డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ బలహీనపడినప్పుడు డాలర్‌తో మారకం చేసే అన్ని వస్తూత్పత్తులకు, దిగుమతులకు మరింత ఎక్కువ మొత్తంలో రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్స్‌ పెట్టుబడి ద్వారా పొందే లాభాలు వస్తూత్పత్తితో కానీ, ఆ వస్తువులను ఉత్పత్తి చేసే క్రమంలో భాగస్వామ్యం కానీ, వస్తు వాణిజ్యంతో కానీ ప్రత్యక్ష సంబంధం ఉండకపోవడం గమనార్హం. 


పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ వంటి పెట్రోలియం ఉత్పత్తులలో 80%కు పైగా దిగుమతులపై ఆధారపడిన భారత ఆర్థిక వ్యవస్థపై రూపాయి పతన తీవ్రత భారమౌతుంది. ఎలక్ట్రానిక్‌, ఇంజనీరింగ్‌ వస్తువులు, రసాయనాలు, వంట నూనెలు, గృహోపకరణాల ఖరీదు పెరుగుతాయి.


దేశ ప్రజల ప్రయోజనాలు, అవసరాలు, ఆకాంక్షల మేరకు కాకుండా, పెట్టుబడి ప్రపంచీకరణ ముసుగుతో సంపన్న దేశాలకు లాభాలను ఆర్జించి, తరలించేందుకు నిర్దేశించిన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని, విశృంఖలంగా ఆహ్వానించడం, ఆంక్షలు లేకుండా ఆమోదించిన ఫలితమే దేశంలో ఈ కరెన్సీ విలువ క్షీణత తీవ్రతకు మూలకారణం. ప్రపంచవ్యాప్తంగా ఏ పరిణామం వచ్చినా దాని ప్రభావం భారత్‌ మార్కెట్లపై పడుతుంది. ఫలితంగా మార్కెట్‌ పతన ప్రభావం దేశ ఆర్థిక పునాదులను ప్రభావితం చేస్తుంది.


ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో జరిగే కరెన్సీ లావాదేవీల ప్రభావం రోజువారీ మార్కెట్‌లో జరిగే వివిధ అంశాల ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది. పలువురు ఆర్థికవేత్తలు విశ్లేషించినట్లుగా, విశ్వవ్యాపిత గుత్త పెట్టుబడి విస్తరణ దశలో మార్కెట్‌ అంటే కోట్లాది ప్రజల జీవితాలతో, నిత్యం జూదమాడే సెక్యూరిటీలకు, కరెన్సీ, స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలకు వర్తించే మార్కెట్‌ అనే అర్థంగా మారిపోయింది. ప్రజలకు అవసరమైన సరుకులు, ఉత్పత్తులు, సర్వీసులకు సంబంధించిన మార్కెట్‌ పూర్వపక్షమయ్యింది.


స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఏ విధమైన ఆంక్షలు లేకుండా, యథేచ్ఛగా లాభాల స్వీకరణను కొనసాగించడానికి వీలుగా, స్వేచ్ఛగా పెట్టుబడులను తరలించడానికి, ఇతర దేశాల ప్రయోజనాలను విస్మరించి తాము నిర్ణయించుకున్నట్టుగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయడానికి అవకాశం ఇచ్చే ప్రక్రియగా రూపాంతరం చెందింది. అటువంటి ఆంక్షలులేని అంతర్జాతీయ పెట్టుబడిని ఆహ్వానించిన ఫలితంగానే, నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నుండి రోజూ వేలకోట్ల రూపాయలను విదేశీ వ్యవస్థాగత మదుపుదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెష్టర్లు 28.05 బిలియన్‌ డాలర్ల మేరకు దేశీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్న ఫలితంగా విదేశీ మారక ద్రవ్య నిలువలు 635.36 బిలియన్‌ డాలర్ల నుంచి 607.31 బిలియన్‌ డాలర్లకు పడిపోయినాయి.


పెట్టుబడి విశ్వీకరణ పేరుతో నియంత్రణలు లేని విదేశీ పెట్టుబడులను అనుమతించడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూలేని ముప్పును ఎదుర్కొంటోంది. ఇతర దేశాల కరెన్సీ విలువలను నియంత్రించి, డాలర్‌ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తన పట్టును కాపాడుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి చేసే వికృత విన్యాసమే వివిధ దేశాల కరెన్సీల క్షీణతకు ప్రధాన ప్రాతిపదిక. గతంలో కూడా అనేకసార్లు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో భారతదేశ రూపాయి పతనాన్ని నిలువరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ స్వయంగా జోక్యం చేసుకుని ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో అమెరికన్‌ డాలర్లను విక్రయించి, రూపాయి పతనాన్ని నిలువరించిన నేపథ్యం ఈ సందర్భంగా గమనార్హం.


కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ పడిపోయి, ద్రవ్యోల్బణం 8 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరి, ప్రజల కొనుగోలు శక్తి ఆవిరవుతున్నప్పటికీ దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయన్న పాలకుల ప్రసంగాలు నీటిమూటలే. గతంలో ఏషియన్‌ టైగర్లుగా వెలుగువెలిగిన దేశాల కరెన్సీల పతనం, ఆగ్నేయ ఆసియా దేశాలలో వచ్చిన కరెన్సీ సంక్షోభాలకి మూలం, ఎటువంటి ఆంక్షలులేని స్వల్పకాలిక విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ఆయా దేశాలు ఆహ్వానించడమేనన్న అంతర్జాతీయ అనుభవాల గుణపాఠాన్ని విస్మరించలేము.


ఫైనాన్స్‌ క్యాపిటల్‌ విస్తృతి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లుతున్న నష్టం విస్తారమవుతున్న ప్రస్తుత నేపథ్యంలో, విచక్షణా రహితమైన విదేశీ పెట్టుబడులను, ఆంక్షలు లేని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని నియంత్రించేందుకు అవసరమైన నిబంధనలను, ఆంక్షలను రూపొందించుకోవడం దేశ పాలకులకు అనివార్యం.

జి. కిషోర్‌ కుమార్‌

జాయింట్‌ సెక్రటరి

సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌

Updated Date - 2022-06-02T06:36:52+05:30 IST