ltrScrptTheme3

పారదర్శకతకు భయపడే పాలకులు

Oct 15 2021 @ 02:22AM

పారదర్శకత ఏటేటా తగ్గుతోంది. సమాచారం వెల్లడయితే కొంప మునుగుతుందనే భయం నానాటికీ పెరుగుతోంది! సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలు ప్రారంభమై 16 ఏళ్లు అయింది. సమాచార భయానికి, అవినీతిని ఎదిరించిన ఆర్టీఐ కార్యకర్తల ప్రాణాలకు ఏర్పడిన ప్రమాదాలకు కూడా దాదాపు అంతే వయసు.


జార్ఖండ్‌లో అదనపు జిల్లాజడ్జి ఉత్తమ్ ఆనంద్ ఉదయం వాహ్యాళికి వెళ్ళగా ఒక ఆటో ఉద్దేశపూర్వకంగా ఆయనను ఢీకొన్నది. ఆస్పత్రికి తీసుకువెళ్ళేసరికే ఆయన ప్రాణం పోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టు వెంటనే స్పందించి సిబిఐని ఆదేశించడం వల్ల దర్యాప్తులు జరిగాయి. సిసి టీవీ ఫుటేజ్ ప్రకారం జడ్జిని ఆటో కావాలనే ఢీ కొట్టినట్టు తేలింది. రాజకీయ నాయకుల నేరాలపై విచారణ జరిపే సీనియర్ జడ్జికే ఈ పరిస్థితి ఉంటే అవినీతిని వెంటాడే జర్నలిస్టులు, నాయకుల రహస్యాలు వెల్లడించే ఆర్టీఐ కార్యకర్తలు, అక్రమాలను బయటపెట్టే విజిల్ బ్లోయర్‌ల గతి ఏమిటి? 


ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 2011–21 మధ్యకాలంలో 20మంది ఆర్టీఐ కార్యకర్తలను హతమార్చారు. తూర్పు చంపారన్ జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిని నిలదీసిన ఆర్టీఐ కార్యకర్త శశిధర్ మిశ్రాను 2010లో చంపేశారు. సోలార్ దీపాల ఏర్పాటులో గందరగోళాన్ని ఆర్టీఐతో నిరూపించిన శివప్రకాశ్ రాయ్‌పై ఎక్స్‌టార్షన్ కేసు పెట్టి 2008లో 29 రోజులు జైలుపాలు చేశారు. అది తప్పుడు ఫిర్యాదని తేలగానే అతన్ని విడుదల చేశారు. మరి ఆయన అక్రమ నిర్బంధానికి పరిహారం ఇచ్చేదెవరు? ఇది, అవినీతిపరులైన ఉద్యోగుల కుట్ర కాదా? భూ దురాక్రమణలపై 900 ఆర్టీఐ బాణాలు వేసిన బిపిన్ అగ్రవాల్ బలైపోయారు. 2021 సెప్టెంబర్ 23న హర్ సిద్ధి బ్లాక్ కార్యాలయం ముందే పట్టపగలు మోటార్ సైకిల్ మీద వచ్చినవారు తుపాకులతో కాల్చి పారిపోయారు. 2020లో తనపై దాడి జరిగితే భద్రత కోసం బిపిన్ మొరబెట్టుకున్నాడు. ఇలాంటి వారి మొర ఎవరూ వినరు, చనిపోయే దాకా పట్టించుకోరు. చనిపోతే ఆర్టీఐ నిహతుల జాబితాలో ఓ అంకె చేరుతుంది. అంతే. 


సెప్టెంబర్ 7న ప్రవీణ్ ఝా బైక్ మీద వెళ్ళుతుంటే పెద్ద కారుతో ఢీకొట్టారు. ప్రజాపంపిణీ విధానంలో అవినీతి గురించి ఆర్టీఐ సంధించడమే అతడి తప్పు. పిడిఎస్ డీలర్ బంధువే కారుతో చంపారని అన్నారు. నిరుడు బిక్రమ్ జిల్లాలో పెద్ద అధికారులు భాగస్వాములుగా ఉన్న ఇసుక కుంభకోణం గురించి పంకజ్ కుమార్ అనేకానేక ఆర్టీఐ అభ్యర్థనలను దాఖలు చేశాడు. భోజ్‌పూర్, ఔరంగాబాద్, బిక్రమ్ ప్రాంతాల్లో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఎందరో డిఎస్‌పీలు, ఎస్ఐలు, ఇంకొందరు ఇతర అధికారులు వనరులకు మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంతో సస్పెండ్ అయ్యారు. ఇకవారు ఆర్టీఐ కార్యకర్తలను బతకనిస్తారా? నిరుడు ఫిబ్రవరి బెగుసరాయ్‌లో మరో కార్యకర్త శ్యాంసుందర్ కుమార్ బలైపోయాడు. 2018లో జయంత్ కుమార్, రాహుల్ ఝా, రాజేంద్ర సింగ్, వాల్మీకీ యాదవ్, ధర్మేంద్రయాదవ్, భోలాషా ప్రభుత్వం కార్యాలయాల్లో లంచగొండి సమాచారం అడిగినందుకు ప్రాణాలు బలి ఇవ్వాల్సి వచ్చింది. 


ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన తెలంగాణలోని పెద్దపల్లిలో ఇద్దరు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావును, నాగమణిని పట్టపగలు నడిరోడ్డుమీదే కత్తులతో చంపేశారు. పెద్దపల్లి గ్రామంలో అధికారంలో ఉన్న కొందరు పెద్దల అక్రమాల పైన ఆర్టీఐలు, రిట్ పిటిషన్లు వేయడంతోపాటు అడుగడుగునా రహస్య అక్రమాలకు అడ్డుకట్ట వేసిన ఫలితంగానే వారి దారుణహత్య జరిగింది. ఇటుకల బట్టీలలో ఆక్రమాలను ఇతర స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ అనేక ఆర్టీఐలు వేసిన రంజన్ కుమార్ దాస్‌ను ఒడిషాలోని కేంద్రపర జిల్లాలో 2020 ఫిబ్రవరి 1న చంపేశారు. 2019 మే 20న ముంబైలో అక్రమ నిర్మాణాలను వెలికితీసిన ఆర్టీఐ వీరుడు సంజయ్ దూబేని చంపేశారు. ఎంపీలకు కేంద్రం ఏటా ఇచ్చే కోట్లాది రూపాయల కేటాయింపు గందరగోళాల కూపీ లాగినందుకు చిరాగ్ పటేల్‌ను గుజరాత్లోని అహ్మదాబాద్‌లో 2019 మార్చి 16న చంపేశారు. సాంఘిక సంక్షేమ పథకాలలోని లొసుగులను వెల్లడి చేసినందుకు, బలీయమైన రాజకీయ నాయకుడుడి గుట్టు రట్టు చేసినందుకు, అక్రమ నిర్మాణాల గురించి చెప్పినందుకు, వినాయక్ శ్రిశాంత్, భోలా షా, మనోజ్ త్రిపాఠి, రోహిత్ అశోక్ జునావేర్, నాన్జీ భాయ్ సొందర్వా, మృత్యుంజయ్ సింగ్, ముకేశ్ దుబే, మహ్మద్ తహీరుద్దీన్, వెంకటేశ్, సతీశ్ షెట్టి, అరుణ్ సావంత్, విశ్రామ్ లక్ష్మన్ దోడియా, సోలా రంగారావ్, విఠల్ గీతె, దత్తాత్రేయా పాటిల్, గోపాల్ ప్రసాద్, తదితర పౌరులను చంపేశారు. మునిసిపల్ కార్పొరేషన్‌లో నిర్మాణ అక్రమాలు, నరేగా సంక్షేమ పథకాలు, సర్పంచ్ అవినీతి, ఇసుక దోపిడీ, భూమి ఆక్రమణలు, పింఛన్ చెల్లింపు కుంభకోణాలు బయటపెట్టినందుకు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలకు అంతు లేకుండా పోయింది. 


ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో 2013 డిసెంబర్ 13న అనూప్‌సింగ్‌ను ఎత్తుకుపోయి సిగరెట్ కాల్చి మర్మాంగాలపైన వాతలు పెట్టారు. ఇనుపకడ్డీలతో కొట్టారు. చిత్రహింసల తరువాత ఎక్కడో పడేశారు. ఎందరినో ఎత్తుకుపోయి హింసించారు. 


ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని వెల్లడి చేయడం వల్లనే ఈ దాడులూ హత్యలూ జరుగుతున్నాయి. విచిత్రమేమంటే కోవిడ్ లాక్డౌన్ కాలం కూడా ప్రాణాంతకమే. దేశ వ్యాప్తంగా కనీసం పదిమంది ఆర్టీఐ కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నారు. 2005లో ఈ చట్టం వచ్చినప్పటి నుంచి పౌరులలో కొందరు అప్రమత్తులై, అవినీతిపరులను ఓ కంట కనిపెడుతూ వారి రహస్యాలు, చీకటి బతుకులు శోధిస్తూ ఆర్టీఐతో ఇరుకునపెడితే లంచావతారులు తప్పించుకోవడానికి కనీసం 100 మంది ప్రాణాలు తీసారని అంచనా. 


ఆర్టీఐని బ్లాక్‌మెయిల్ సాధనంగా కొందరు వాడుకుంటున్నారని ఒక్కోసారి న్యాయమూర్తులు కూడా యాథాలాపంగా అనేస్తున్నారు. ఆర్టీఐ కార్యకర్తలు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని గగ్గోలు చేసే మహానుభావులు వారి హత్యల గురించి మాట్లాడరు. అసలు బ్లాక్‌మెయిల్ అంటే ఏమిటి? తన అవినీతిని రచ్చకెక్కించకుండా ఉండేందుకు ఇచ్చుకునే డబ్బు. ఆర్టీఐ సమాచారం లాగిన వాడికి డబ్బు ఇచ్చి లోబరుచుకుని తన అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకునే వాడు బ్లాక్‌మెయిల్‌కు గురయినట్టా, ఆర్టిఐ కార్యకర్తకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్టా? ఒకవేళ ఆర్టీఐ కార్యకర్త తనకు తెలిసిన సమాచారాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు డబ్బు అడిగితే అది బ్లాక్‌మెయిల్. అందుకు ఆ అధికారి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి, డబ్బు అడిగిన వ్యక్తిని అరెస్టు చేయించవచ్చు. ఆ పని చేయకపోగా గుట్టుచప్పుడు కాకుండా డబ్బిచ్చి బయటపడతాడు. తరువాత ఆర్టీఐ బ్లాక్‌మెయిలర్లు పెరిగిపోయారనడం పరిపాటి అయింది. ఇటువంటి అవినీతిపరులను కాపాడడానికి ఆర్టీఐ దుర్వినియోగమవుతుందని గొడవ చేస్తారా? తమ అవినీతిని దాచడానికే బ్లాక్‌మెయిల్ వాదం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ కార్యకర్త డబ్బు తీసుకోకుండా పోరాటం సాగిస్తే అతన్ని చంపేస్తున్నారు. ఆర్టీఐ హత్యలన్నీ బ్లాక్‌మెయిల్ చేయని నీతివంతుల హత్యలని, అవి చేసినవారు అవినీతిపరులైన అధికారులో, నేతలో, మరెవరో అని ప్రత్యేకంగా రుజువుల అవసరమా? 


ఆర్టీఐ కార్యకర్తలందరికీ భద్రత కల్పించాలని అడిగినా ఏ ప్రభుత్వానికీ అది సాధ్యం కాదు. ప్రభుత్వ పక్షాన పూర్తి సమాచారాన్ని తమంత తామే వెల్లడిస్తే, సహజంగానే చాలా అవినీతి జరగకుండా నిరోధించడానికి వీలుంటుంది. తమ పేరు చెప్పకుండా ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగే అవకాశాన్ని భద్రత కోసమే చట్టంలో కల్పించారు. వ్యక్తులకే గాని సంఘాలకు, సంస్థలకు సమాచారహక్కు లేదని ఒక అర్థం చెబుతున్నారు. కానీ అది సమంజసం కాదు. వ్యక్తీకరణ స్వేచ్ఛను పత్రికలు ముద్రించే కంపెనీలకు, సంఘాలకు, సొసైటీలకు కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో వర్తింపచేసింది. వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమైన సమాచారహక్కును కేవలం వ్యక్తులకే పరిమితం చేయడం అసమంజసం. ఆర్టీఐ కోరేవారు సంఘటితమై, తమ రక్షణకు సరైన వ్యూహాలు రూపొందించుకోవడం అవసరం. విజిల్ బ్లోయర్స్ నిర్వచనంలో ఆర్టీఐ దరఖాస్తుదారులను కూడా చేర్చి, కోరినపుడు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. తనకు బెదిరింపులు వస్తున్నాయని దరఖాస్తుదారుడు చెప్పినపుడు కమిషన్లు దాన్ని సీరియస్‌గా తీసుకుని వెనువెంటనే భద్రత బాధ్యతను సంబంధిత పబ్లిక్ అథారిటీకి అప్పగించాలి. అతడికే ప్రమాదం జరిగినా వారే బాధ్యత వహించాలి. బెదిరింపులు, దాడులపై ఫిర్యాదుల విషయంలో వెంటనే దర్యాప్తు జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలి. హత్యలను ఆపలేని కేసుల్లో సత్వర విచారణ చేపట్టి నేరస్థులను పట్టుకుని శిక్షించే చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ సమాంతరంగా జరగకపోతే అవినీతి వ్యతిరేక పోరాటంలో సమిధలుగా మారుతున్న ఆర్టీఐ కార్యకర్తలను కాపాడుకోవడం కష్టమవుతుంది. అంతిమంగా సమాచారహక్కు చట్టాన్ని కాపాడుకోవడం మరింత కష్టతరమవుతుంది. 

ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

మాజీ కేంద్ర సమాచార కమిషనర్

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.