
భువనేశ్వర్ : ఒడిశాలో జరిగిన అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ (బీజేడీ)కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 108 అర్బన్ లోకల్ బాడీ కౌన్సిల్స్‌కు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 95 కౌన్సిల్స్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో బీజేడీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేడీపై ప్రజల ప్రేమకు ఈ గెలుపు నిదర్శనమని పేర్కొన్నారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు అలుపెరుగని కృషి చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు.
ఒడిశాలోని మూడు నగరాల మేయర్ పదవులు కూడా బీజేడీ వశమయ్యాయి. భువనేశ్వర్ నుంచి సులోచనా దాస్, కటక్ నుంచి సుభాష్ సింగ్, బరంపురం నుంచి సంఘమిత్ర దలేయి విజేతలుగా నిలిచారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేడీ ఘన విజయం సాధించింది. జిల్లా పరిషత్ స్థానాల్లో దాదాపు 90 శాతం స్థానాలు బీజేడీ వశమయ్యాయి. 108 అర్బన్ లోకల్ బాడీస్‌కు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం జరిగింది. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్‌కు ఈ ఎన్నికలు జరిగాయి. వీటిలో 95 స్థానాలు బీజేడీకి లభించగా, బీజేపీకి 6, కాంగ్రెస్‌కు 4, స్వతంత్రులకు మూడు కౌన్సిళ్లు లభించాయి.
90 శాతానికి పైగా కౌన్సిళ్ళను బీజేడీ గెలుచుకోవడం ఇదే తొలిసారి. బీజేపీకి కేవలం 5.5 శాతం కౌన్సిళ్ళు మాత్రమే లభించాయి. కాంగ్రెస్‌కు 3.5 శాతం కౌన్సిళ్లు లభించాయి.
ఒడిశా శాసన సభ ఎన్నికలు 2024లో లోక్‌సభ ఎన్నికలతో పాటు జరుగుతాయి. ఈ నేపథ్యంలో వెలువడిన ఈ ఫలితాలు బీజేడీకి గొప్ప ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.
ఇవి కూడా చదవండి