అధికార అరాచకం

ABN , First Publish Date - 2021-03-03T06:42:43+05:30 IST

జిల్లాలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్‌, మున్సిపాలి టీలు, నగర పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.

అధికార అరాచకం

మార్కాపురంలో ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ 

పోటీకి సిద్ధమంటున్న జనసేన, బీజేపీ కూటమి 

చీరాల పగ్గాలు చేతికి తీసుకున్న అధిష్ఠానం 

కనిగిరిలో పోలీసుల సాక్షిగా బెదిరింపులు 

గిద్దలూరులోనూ సరెండరైన ఇద్దరు టీడీపీ అభ్యర్థులు 

ఒంగోలులో ప్రతిపక్షం వ్యూహాత్మక అడుగులు 

చీమకుర్తిలో ఒక్క వార్డే  ఏకగ్రీవం  

అద్దంకిలో ఢీ అంటే ఢీ అంటున్న ఇరుపక్షాలు 

పురపోరులో అధికారపార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ఇటు ప్రలోభాలు.. అటు బెదిరింపులతో టీడీపీ, ఇతర అభ్యర్థులను లొంగదీసుకునే వ్యవహారాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. వ్యాపారవర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అయితే వారిని తీవ్రస్థాయిలో బెదిరించారు. ఇంకోవైపు డబ్బు ఆశచూపి లొంగదీసుకునే ప్రక్రియను ముమ్మరం చేశారు. వీటిని తట్టుకోలేక మార్కాపురంలో మున్సిపల్‌ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అక్కడ జనసేన, బీజేపీ కూటమి అవకాశం ఉన్నన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. చీరాలలో వైసీపీ నాయకుల మధ్య సమన్వయానికి మంత్రి బాలినేని మంగళవారం ఉదయం చేసిన చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఇటు బలరాం, అటు ఆమంచిలు ఎవరికి వారే పట్టుదలకు పోయారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం సూచనకు అనుగుణంగా పరిశీలకులే నిర్వహిస్తారని మంత్రి తేల్చి చెప్పారు. ఒంగోలులో అభ్యర్థులు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా ఉండేలా టీడీపీ నాయకత్వం చర్యలు తీసుకుంది. అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోవటంతో అందుకు అవకాశం లేకుండా పోయింది. అద్దంకిలో వైసీపీ, టీడీపీ శ్రేణులు దాదాపు అన్ని వార్డుల్లో ఢీ అంటే ఢీ అంటుండగా నేతలు ప్రచారానికి కూడా శ్రీకారం పలికారు. గిద్దలూరులో మరిన్ని ఏకగ్రీవాల కోసం ఎమ్మెల్యే అన్నా రాంబాబు సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నప్పటికీ ఆశించిన మేర ఫలితం దక్కటం లేదు. 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్‌, మున్సిపాలి టీలు, నగర పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ  ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు అందుకు అవకాశం ఉంది.  దీంతో ఏకగ్రీవ ఎన్నికలతోనే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిం చాలని చూస్తున్న వైసీపీ ప్రలోభాలు, బెదిరింపులతో ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు బహిరంగంగానే అడ్డదారులు తొక్కుతోంది. 

మున్సిపోల్స్‌ను బహిష్కరించిన మార్కాపురం టీడీపీ

మార్కాపురంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు కందుల నారాయణ రెడ్డి ప్రకటించారు. ఆయనతోపాటు ఆయా డివిజన్లకు నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అభ్యర్థులను బెదిరించటం, వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని హెచ్చరించటం, పలురకాలుగా వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించటం లాంటి చర్యలతో టీడీపీకి చెందిన సామాన్య కార్యకర్తలు ఆందోళనకు గురైనట్లు నారాయణరెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలను తట్టుకోవడం కష్టమనే భావించి ఈ నిర్ణయా నికి వచ్చినట్లు చెప్పారు.  ఎన్నికలను బహిష్కరించినా ఇంటింటికీ తిరిగి అధికారపార్టీ వ్యవహారశైలిని వివరిస్తామని ప్రకటించారు. అయితే ఇక్కడ జనసేన, బీజేపీ కూటమి పోటీకి సిద్ధమైంది. ఒకప్పుడు టీడీపీలో ఉండి నారాయణరెడ్డి నాయకత్వాన్ని విభేదించి జనసేనలోకి వెళ్లిన ఇమ్మడి కాశీనాథ్‌ ఆధ్వర్యంలో పోటీకి సిద్ధం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన తరఫున అప్పట్లో 17 వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 13మందికిపైగా అభ్యర్థులతో ఆయన ఒక పుణ్యక్షేత్రంలో క్యాంపు ప్రారంభించారు.  వీరిని కూడా పోటీ నుంచి తప్పించేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. సెల్‌ఫోన్లు కూడా ఆపుకుని క్యాంపులో ఉన్న వారిని  బుధవారం సాయంత్రం 3గంటల తర్వాత మార్కాపురానికి తీసుకురావచ్చని భావిస్తున్నారు. వీరు కాకుండా మరో ఐదు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వారంతా కలిసి సమరానికి సిద్ధమయ్యే ప్రయత్నంలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థులు మరో 4 వార్డుల్లోను, సీపీఐ అభ్యర్థి ఒక వార్డులోను పోటీలో ఉన్నారు. 


కనిగిరిలో పరాకాష్ట 

కనిగిరిలో 20వార్డులకుగాను 11 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని ఎన్నికలను నామమాత్రం చేయాలని అధికారపార్టీ నాయకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధులు దగ్గరుండి యావత్తు యంత్రాంగం ద్వారా ప్రత్యర్థి పక్షానికి చెందిన అభ్యర్థులను లోబర్చుకునే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా వన్‌సైడ్‌గా పనిచేస్తుందనే విమర్శలు అధికంగా ఉన్నాయి. అటు డీఎస్పీ, ఇటు సీఐలు టీడీపీకి చెందిన అభ్యర్థులను భయపెట్టడంలో కీలకభూమిక పోషిస్తున్నారనే విమర్శలున్నాయి. మంగళవారం ఐదు డివిజన్లను వైసీపీ ఏకగ్రీవంగా హస్తగతం చేసుకోగా అందులో మూడుచోట్ల రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థులను మచ్చిక చేసుకోవటం, నామినేషన్ల పరిశీలనకే రాకుండా చేసి డివిజన్లను సొంతం చే సుకున్నారు. ఇప్పటికి అందిన సమాచారం మేరకు పోటీ నుంచి తప్పుకుంటే రూ.20లక్షల వరకు ఆర్థిక చేయూతనిచ్చే పథకాన్ని కూడా అక్కడ అమలు చేస్తున్నారు.


ఒంగోలులో టీడీపీ వ్యూహాత్మకం 

ఒంగోలులో ఏకగ్రీవ ఎంపికలకు ఆస్కారం అతితక్కువగా కనిపిస్తోంది. టీడీపీకి సంబంధించి ఐదు డివిజన్లలో ఇప్పటికే నామినేషన్లు లేని పరిస్థితి. అయితే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీడీపీ తరపున ఎక్కువ డివిజన్లలో ఒకరికి ఇద్దరు నామినేషన్లు వేశారు. దీంతో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే వారిని మచ్చిక చేసుకోవటం ద్వారా ఏకగ్రీవ ఎంపికలకు కిందిస్థాయిలో వైసీపీ నాయకులు కాచుక్కూర్చున్నారు. దీంతో దామచర్ల ముందస్తు వ్యూహంతో అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. ఈలోపు ఏదైనా ఒక డివిజన్‌లో నామినేషన్‌ వేసిన అభ్యర్థిని వైసీపీ లోబరుచుకుంటే డమ్మీ అభ్యర్థినే పార్టీ అభ్యర్థిగా చేసేందుకు వారు వ్యూహం ప న్నారు. పరిస్థితిని గమనిం చిన వైసీపీ నేతలు కూడా ఏకగ్రీవ ఎంపికలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పోటీలో విజయాలకు ప్రాధాన్యతనిచ్చారు.  


చీరాల విషయంలో పట్టువీడని ఇరువర్గాలు 

చీరాలలో నాయకుల ఆధిపత్యపోరుకి బ్రేక్‌ వేసే ప్రయత్నం చేసిన వైసీపీ అధిష్ఠానం అది కుదరక చివరికి మున్సిపల్‌ ఎన్నికల పగ్గాలను తమ చేతికి తీసుకోవటం విశేషం. ఈ విషయంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి బాలినేని మంగళవారం ఉదయం ఒంగోలులోని తన నివాసంలో ఇటు బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌, అటు ఆమంచితో విడివిడిగా భేటీ అయ్యారు. భవిష్యత్తులో పర్చూరు బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీ పదవిని పొందనున్న ఆమంచికి సర్దుకుపోవాలని సూచించారు. అలాగే ఆమంచి అనుచరుల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని బలరాంకు సూచించారు. ఆ సందర్భంగా మున్సిపాలిటీ వార్డులు, అభ్యర్థుల ఎంపికపై ఎవరికి వారే పట్టుదలతో ముందుకు పోయారు. దీంతో విసుగుచెందిన బాలినేని సీఎం ఆదేశానికి అనుగుణంగా పార్టీ బీఫాంలను పరిశీలకులకు ఇస్తానని, వారు ఏ అభ్యర్థికి ఇస్తే వారే పార్టీ అభ్యర్థి అవుతారని ప్రకటించారు. అనంతరం చీరాలలో ఇటు బలరాం, అటు ఆమంచిలు వారి అనుచరులతో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు.

 

గిద్దలూరులోనూ ప్రలోభాలు

గిద్దలూరులోను వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం మూడు వార్డులు ఏకగ్రీవం చేసుకున్నారు. వివాదాస్పదంగా మారిన ఒకటో వార్డు అభ్యర్థి ఏకగ్రీవానికి రంగం సిద్ధం కాగా ఆయన బీసీ కాదన్న విషయాన్ని సవాల్‌ చేసేందుకు ఆయా సంఘాలు ఐక్యంగా న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. మరో రెండు మూడు వార్డుల్లో ఏకగ్రీవ ఎంపికలకు రాంబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సారథ్యంలో అవకాశం ఉన్న అన్ని వార్డుల్లో పోటీకి టీడీపీ శ్రేణులు సిద్ధం కావటం విశేషం. 


చీమకుర్తిలో బోణి 

చీమకుర్తిలో వైసీపీ భారాన్ని నెత్తిన పెట్టు కున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. మంగళవారం 14వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచేందుకు ఆయన చేసిన వ్యూహం సఫలమైంది. అటు పార్టీ బలంతోపాటు, స్థానికంగా తన కుటుంబానికి ఉన్న వ్యక్తిగత సంబంధాలను వినియోగిం చుకుని భారీవిజయాన్ని చేకూర్చాలన్న భావనతో ఆయన సోమవారమే ప్రచారానికి శ్రీకారం పలికారు. 


Updated Date - 2021-03-03T06:42:43+05:30 IST