ఆ బిస్కెట్లు తింటేనే దీర్ఘాయువు... లేకపోతే ప్రాణగండమే... జనం పోటెత్తడంతో బెంబేలెత్తిపోతున్న దుకాణదారులు!

ABN , First Publish Date - 2021-10-02T13:13:14+05:30 IST

దేశంలో కరోనా ప్రవేశించనప్పటి నుంచి రకరకాల...

ఆ బిస్కెట్లు తింటేనే దీర్ఘాయువు... లేకపోతే ప్రాణగండమే... జనం పోటెత్తడంతో బెంబేలెత్తిపోతున్న దుకాణదారులు!

దేశంలో కరోనా ప్రవేశించనప్పటి నుంచి రకరకాల వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఫలితంగా జనం ఆ వదంతులను నమ్ముతూ, వాటికి పరిహారాల పేరిట ఏవోవో పనులు చేస్తున్నారు. తాజాగా ఇటువంటి విచిత్ర ఉదంతమే బీహార్ లోని సీతామఢిలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో వ్యాపించిన ఒక వదంతు కారణంగా పార్లే జీ బిస్కెట్లకు ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది.




వివరాల్లోకి వెళితే సీతామఢిలో పార్లే జీ బిస్కెట్లకు స్థానికంగా జరిగే ఒక పండుగతో ముడిపెట్టి ఒక వదంతును విపరీతంగా వ్యాపింపజేశారు. ఈ ప్రాంతంలోని వాంతా తమ ఇంటిలో ఎంతమంది మగపిల్లలున్నా వారందరిచేత పార్లే జీ బిస్కెట్లు తినిపించకపోతే వారు ప్రమాదానికి గురవుతారట. కుమారుల దీర్ఘాయువు కోసం, సుఖవంతమైన జీవనం కోసం జితియా పర్వదినం నాడు ప్రత్యేక వ్రతం చేయాలట. ఆరోజు మగపిల్లల చేత పార్లే జీ బిస్కెట్లు తినిపించాలట. ఈ వదంతులు వ్యాపించగానే జనం దుకాణాల ముందు బారులు తీరి భారీ మొత్తంలో పార్లేజీ బిస్కెట్లు కొనుగోలు చేస్తున్నారు.


ఫలితంగా ఆ ప్రాంతంలోని వ్యాపారుల వద్దనున్న పార్లేజీ బిస్కెట్ల స్టాకు అంతా క్షణాల్లో అమ్ముడుపోయింది. సీతామఢీ జిల్లాలోని బైర్గనియా, ఢేంగ్, నాన్పుర్, బాజ్‌పుట్టీ, మేజర్‌గంజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ వదంతు అత్యంత వేగంగా వ్యాపించింది. ఇది ఎలా మొదలయ్యిందో తెలియనప్పటికీ స్థానికంగా ఉన్నవారంతా రాత్రనక, పగలనక పార్లేజీ బిస్కెట్ల కోసం బజార్ల వెంబడి తిరుగుతున్నారు. ఇప్పటికిప్పుడు ఆ బిస్కెట్లు తినకపోతే తమ పిల్లలకు ఏమవుతుందోనని వారు బెంబేలెత్తిపోతున్నారు. 

Updated Date - 2021-10-02T13:13:14+05:30 IST