రుణమో రామచంద్రా...!

ABN , First Publish Date - 2021-07-22T04:25:46+05:30 IST

అసలే కరోనా కాలం.. కొవిడ్‌ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రస్తుతం సాగు పెట్టుబడి కోసం అన్నదాతలు సైతం తిప్పలు పడుతున్నారు.

రుణమో రామచంద్రా...!

- గాడితప్పుతున్న పంట రుణాల లక్ష్యం
- భూమి ఎంత ఉన్నా రూ.లక్ష వరకే పరిమితం
- జిల్లాలో వానాకాలం పంట రుణాల లక్ష్యం రూ.2,428 కోట్లు
- కొత్త రుణాలకు కొర్రీలు పెడుతున్న బ్యాంకర్లు
- రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు
- పంటల సాగుకు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్న వైనం

కామారెడ్డి, జూలై 21(ఆంధ్రజ్యోతి): అసలే కరోనా కాలం.. కొవిడ్‌ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రస్తుతం సాగు పెట్టుబడి కోసం అన్నదాతలు సైతం తిప్పలు పడుతున్నారు. వానాకాలం పంటల సాగు ఊపందుకున్న నేపథ్యంలో రైతన్న చేతిలో డబ్బు కరువవుతోంది. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టు తిరుగుతున్నారు. కొత్త రుణాల కోసం బ్యాంకులకు వెళ్తే నిబంధనల కొర్రిపెడుతూ బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూమి ఎంత ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులు రూ.లక్ష వరకు మరికొన్ని రూ.1.50 లక్షల వరకు మాత్రమే రుణాలు ఇచ్చేందుకు పరిమితమవుతున్నాయి. దీంతో బ్యాంకులు ఇచ్చిన రుణాలు సరిపోక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. సీజన్‌ ప్రారంభంలో ఏటా ఇదే పరిస్థితి వార్షిక ప్రణాళిక విడుదలయినా లక్ష్యం మేరకు రుణాలు అందించడంలో బ్యాంకర్ల అలసత్వం రైతులకు శాపంగా మారుతోంది.
వానాకాలం రుణాల లక్ష్యం రూ.2వేల కోట్లు
ఇప్పటికే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అధికారులు నిర్ణయించారు. ఇందులో రుణ పంపిణి లక్ష్యం రూ.4,776 కోట్లు ఉండగా.. ప్రాధాన్య రంగాలకు రూ.4,373 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.3,776 కోట్లు కేటాయించారు. ఈ వానాకాలం పంట రుణాల లక్ష్యం రూ.2,428 కోట్లుగా నిర్ధేశించారు. ఆయా బ్యాంకులకు లక్ష్యాలను సైతం పంట రుణాల కోసం లక్ష్యాన్ని కేటాయించారు. అయితే గతంలో తీసుకున్న రుణాలు రైతులు చెల్లించకుంటే కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ప్రతీ సీజన్‌లోనూ బ్యాంకర్లు వారివారికి నిర్ధేశించిన లక్ష్యానికి తగ్గట్టుగా పంట రుణాలు ఇవ్వకపోవడంతో లక్ష్యాలను చేరుకోవడం లేదు. దీంతో రైతులు పంట రుణాలకు నోచుకోవడం లేదు. పంట రుణాల కోసం బ్యాంకులకు రైతులు వస్తే రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు జిల్లా ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సూచిస్తున్నా బ్యాంకర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. వానాకాలం పంటల సాగు మొదలై రెండు నెలలు కావస్తున్నా లక్ష్యానికి తగ్గట్టుగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
జబర్దస్త్‌గా వడ్డీ వసూళ్లు
జిల్లాలో 90 శాతం మంది రైతులు మూడేళ్ల నుంచి తీసుకుంటున్న పంట రుణాలకు ఆయా బ్యాంకులు జబర్దస్త్‌గా 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. గతంలో ఏడాది లోపు చెల్లించే పంట రుణాలకు నాలుగు శాతం రాష్ట్రప్రభుత్వం, 3 శాతం వడ్డీ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేవి. కానీ కొంతకాలం నుంచి ప్రభుత్వాలు వడ్డీ సరిగా చెల్లించడం లేదు. ఆయా ప్రభుత్వాలు వడ్డీ చెల్లించినప్పుడు తిరిగి ఖాతాలో జమ చేస్తామని ప్రస్తుతం అయితే వడ్డీ కట్టాలంటూ రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. కొంత ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్నేళ్లుగా చెల్లించడం లేదు. దీంతో వడ్డీతో సహ చెల్లించిన రైతులకే తిరిగి రుణాలు ఇస్తున్నారు.
పాత రుణాల స్థానంలో కొత్తవి
చాలా మంది రైతులు భూమిని బట్టి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పంట రుణాలు తీసుకునేవారు. ప్రస్తుతం సాగు ఖర్చు పెరిగాయి. పంట రుణం పెంచి ఇవ్వాలని రైతులు కోరినా బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఎక్కువ రుణాలు కావాలంటే భూమిని తనఖా పెట్టాలని బ్యాంకర్లు అంటుండడంతో చాలా మంది రైతులు ఇచ్చిన రుణాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఉండి ఇప్పటి వరకు పంటరుణాలు తీసుకొని రైతులకు మాత్రమే రుణాలు ఇస్తున్నారు. ఇప్పటికీ కేవలం రుణం తీసుకున్న రైతుల నుంచి వడ్డీతో సహ మొత్తం తీసుకుని తిరిగి కొత్త పంట రుణాలు ఇస్తున్నారు. ఈ సందర్భంలోనూ వ్యవసాయ భూమికి సంబంధించి 1బీ రికార్డు జిరాక్స్‌ కాపీలను తీసుకుంటున్నారు.
కొత్త రుణాలకు కొర్రీలు
రికార్డుల ప్రక్షాళనలో జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంగా సుమారు 40వేల మందికి డిజిటల్‌ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. సంబంధిత రైతుల పంట రుణాలకు బ్యాంకులకు వెళితే కొర్రీలు పెడుతున్నారు. రేపు,మాపు అంటూ కొన్ని బ్యాంకులు తిప్పుతుండగా.. పాత రుణాలే రెన్యూవల్‌ చేస్తున్నా వచ్చే నెల చూస్తామంటూ బ్యాంకర్లు దాట వేస్తున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే ఈసీ కావాలి, మండల పరిధిలో బ్యాంకుల్లో ఇప్పటి వరకు రుణాలు తీసుకోలేదని నో అబ్జక్షన్‌ ధ్రువపత్రాన్ని తీసుకురావాలని నిర్ధేశిస్తున్నారు. ఇలా నిబంధనల కొర్రీలతో రైతులకు బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టు రైతులు ప్రదక్షణలు చేస్తున్నా రుణాలు అందని పరిస్థితి. ఇదే విషయమై రైతులు లీడ్‌ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులే కల్పించుకుని సకాలంలో రుణాలు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.
వడ్డీ వ్యాపారులే దిక్కు
ఈ వానాకాలం సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు సైతం పంటల సాగు ముమ్మరంచేశారు. విస్తారంగా పంటలను సాగు చేస్తున్నారు. రైతుబంధు, సీఎం కిసాన్‌ పథకాల ద్వారా ఎంతో కొంత నగదు అందినప్పటికీ ప్రస్తుతం పంటల సాగుకు పెరిగిన ధరలతో ఆ నగదు సరిపోవడం లేదు. దీంతో పంట రుణాలపై బ్యాంకర్లను ఆశ్రయిస్తే వారి నుంచి స్పందన ఉండడం లేదు. చివరకు పంటల సాగుకు రైతులకు వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. పంట రుణాలకు బ్యాంకులు సవాలక్ష కొర్రీలు పెడుతుండడంతో రైతులు పెట్టుబడికై వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు సైతం అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. దీంతో పంటల సాగులో రైతులకు అప్పులే మిగులుతున్నాయే తప్ప లాభాలు ఏమి ఉండడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - 2021-07-22T04:25:46+05:30 IST