రూపాయి బెంబేలు!

ABN , First Publish Date - 2022-09-23T07:22:08+05:30 IST

ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం భారత కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. ఒక్క రోజులోనే 83 పైసలు దిగజారి 80.79 వద్ద క్లోజైంది. రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయి ఇదే.

రూపాయి బెంబేలు!

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు దెబ్బ.. ఒక్కరోజే 83 పైసల నష్టం 

డాలర్ మారకంలో ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 80.79కి చేరిక


ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం భారత కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. ఒక్క రోజులోనే 83 పైసలు దిగజారి 80.79 వద్ద క్లోజైంది. రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయి ఇదే. అంతేకాదు, ఈ ఏడాది రూపాయి నమోదు చేసిన భారీ పతనాల్లో ఇదొకటి. ఫిబ్రవరి 24వ తేదీన 99 పైసలు నష్టపోయిన తర్వాత రెండో పెద్ద నష్టం ఇది. గురువారం ఉదయం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకం లో రూపాయి 80.27 వద్ద ప్రారంభమై ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 80.95ని తాకింది. చివరికి ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 83 పైసల నష్టంతో 80.79 వద్ద ముగిసింది. ఇతర ఆసియా దేశాల కరెన్సీలు కూడా చారిత్రక కనిష్ఠ స్థాయిలనే నమోదు చేశాయి. ఈ ఏడాది రూపాయి ఇప్పటి వరకు  6.5 శాతం మేర  క్షీణించింది. 



అసలేం జరిగింది..?

అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచడం రూపాయిని తీవ్రంగా ప్రభావితం చేసింది, భవిష్యత్తులో మరిన్ని భారీ వడ్డీ పోట్లు తప్పవన్న ఫెడ్‌ చీఫ్‌ జెరోమ్‌ పోవెల్‌ హెచ్చరికలు, ఉక్రెయిన్‌పై పోరాటానికి రష్యా సేనల సమీకరణ వార్తలు ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. దీనికి తోడు విదేశీ మార్కెట్లలో అమెరికన్‌ కరెన్సీ బలపడడం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ప్రదర్శించిన స్తబ్ధత, ఇన్వెస్టర్ల రిస్క్‌ విముఖత, క్రూడాయిల్‌ ధరలు రూపాయి పతనానికి ఆజ్యం పోశాయి. ఆరు కరెన్సీలతో కూడిన డాలర్‌ ఇండెక్స్‌ 0.38 శాతం పెరిగి 110.06గా నమోదైంది. వడ్డీ రేట్ల విషయంలో పోవెల్‌ ప్రకటించిన కఠిన వైఖరి డాలర్‌ బలాన్ని పెంచాయని విశ్లేషకులంటున్నారు. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు బుధవారం దేశీయ మార్కెట్‌ నుంచి రూ.461.04 కోట్ల విలువ గల పెట్టుబడులు తరలించుకుపోయారు. ఈ ఏడాది వారి నిధుల తరలింపు ఇప్పటివరకు 2,840 కోట్ల డాలర్లుంది. 2008 సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో తరలించుకుపోయిన 1,180 కోట్ల డాలర్ల కన్నా ఇది చాలా ఎక్కువ. 



ఏదీ గమ్యం..?

క్రూడాయిల్‌ ధరలు గరిష్ఠంగా ఉండి దేశీయ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల తరలింపు కొనసాగితే రూపాయి ప్రస్తుత క్షీణత మరింతగా కొనసాగుతుందని విశ్లేషకులంటున్నారు. రూపాయి విలువ.. డిమాండ్‌, సరఫరా పైనే ఆధారపడి ఉంటుందంటూ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్‌ పెరిగినంత వరకు రూపాయిలో ఈ క్షీణత కొనసాగుతూనే ఉంటుందన్నది పలువురి అభిప్రాయం. ఎగుమతుల విలువ కన్నా దిగుమతుల విలువ అధికంగా ఉంటే డాలర్‌ డిమాండ్‌ కూడా అధికంగానే ఉంటుందని, ఇది రూపాయి విలువను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు.


 డాలర్‌ డిమాండ్‌ ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే రూపాయి 81.50 వరకు పడిపోయవచ్చని అంచనా. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూపాయి 82 స్థాయికి క్షీణించవచ్చని జపాన్‌ రేటింగ్‌ సంస్థ నోమురా ఇప్పటికే అంచనా వేసింది. ప్రస్తుత క్రమంలో రూపాయికి 81.25 నుంచి 81-40 మధ్యలో నిరోధం, 80.12 వద్ద మద్దతు ఉన్నాయని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ చెప్పారు. 


సగటు జీవిపై పెను ప్రభావం..

రూపాయి విలువలో ఈ భారీ పతనం సగటు జీవి నడ్డి విరచడం ఖాయం. ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు ఇది మరింత భారాన్ని మోపుతుంది. గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్న క్రూడాయిల్‌ ధరలు, బలహీనమైన రూపాయి ద్రవ్యోల్బణ ఒత్తిడిని విపరీతంగా పెంచుతాయి. భారత్‌.. క్రూడాయిల్‌, మెటల్స్‌, ఎలక్ర్టానిక్స్‌కు దిగుమతుల పైనే ఆధారపడుతుంది. రూపాయి బలహీనపడిన కొద్ది వాటన్నింటికీ అధిక ధరలు చెల్లించాలి. ఆ రకంగా ముడి సరుకు వ్యయాలు పెరిగిపోయి ఉత్పత్తి వ్యయం అదుపు తప్పితే కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారుల పైనే వేస్తాయి. అంతేకాదు, విదేశీ విద్య, విదేశీ ప్రయాణాల భారం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఎగుమతుల రంగం పోటీ సామర్థ్యం మాత్రం పెరుగుతుంది. దిగుమతులు, ఎగుమతుల్లో వ్యత్యాసాల వల్ల కరెంట్‌ ఖాతా లోటు అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఈ ఏడాది  కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌).. జీడీపీలో 3.2 శాతాన్ని తాకే  అవకాశం కనిపిస్తోంది. రూపాయిని ఆదుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగితే విదేశీ మారకం నిల్వలు క్షీణించిపోయి ఆర్థిక వ్యవస్థ రక్షణ కవచాన్ని కోల్పోతుంది. 


ఈక్విటీ మార్కెట్‌దీ అదే దారి

అమెరికన్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం ఈక్విటీ మార్కెట్‌పై కూడా పడింది. సెన్సెక్స్‌ 337.06 పాయింట్లు నష్టపోయి 59119.72 వద్ద ముగియగా నిఫ్టీ 88.55 పాయింట్లు దిగజారి 17629.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో పవర్‌ గ్రిడ్‌ షేరు 2.80 శాతం పతనమై నష్టాల్లో అగ్రస్థానంలో నిలిచింది. హెచ్‌డీఎ్‌ఫసీ ద్వయం, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ర్టాటెక్‌ సిమెంట్‌ లాభపడిన షేర్లలో ఉన్నాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ (0.47 శాతం), మిడ్‌ క్యాప్‌ సూచీ (0.32 శాతం) మాత్రం లాభపడ్డాయి. 

Updated Date - 2022-09-23T07:22:08+05:30 IST