వ్యాక్సిన్ అంటేనే భయపడిపోతున్న గ్రామం.. అమిత్‌షాయే రంగంలోకి దిగాల్సి వచ్చింది..!

ABN , First Publish Date - 2021-06-22T18:22:55+05:30 IST

‘మా ఊళ్లో ఒకాయన వేక్సిన్ వేసుకున్న కొద్ది రోజులకే చనిపోయాడు. వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారని మా ఊరంతా నమ్ముతున్నారు. అందుకే ఎవరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు’.. ఇదీ ఆ గ్రామానికే చెందిన ఓ మహిళ చెబుతున్న మాటలివి.

వ్యాక్సిన్ అంటేనే భయపడిపోతున్న గ్రామం.. అమిత్‌షాయే రంగంలోకి దిగాల్సి వచ్చింది..!

‘మా ఊళ్లో ఒకాయన వేక్సిన్ వేసుకున్న కొద్ది రోజులకే చనిపోయాడు. వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారని మా ఊరంతా నమ్ముతున్నారు. అందుకే ఎవరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు’.. ఇదీ ఆ గ్రామానికే చెందిన ఓ మహిళ చెబుతున్న మాటలివి. దీంతో ఆ గ్రామంలోని ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు, వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను పటాపంచలు చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాయే రంగంలోకి దిగాల్సి వచ్చింది. వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదనీ, కరోనాను అరికట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఆ గ్రామ ప్రజలకు చెప్పుకొస్తున్నారు. 


గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రూపాల్ గ్రామంలో వ్యాక్సిన్‌పై అపోహలు, అవాస్తవ ప్రచారాలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు ఎవరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆ గ్రామంలోని మొత్తం జనాభాలో ఇంత వరకు సగం మంది కూడా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో నేరుగా వైద్యాధికారులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ సత్ఫలితాలు లేకపోవడంతో ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాయే ఎంట్రీ ఇచ్చారు. రూపల్ గ్రామం ఆయన నియోజకవర్గం పరిధిలోనే ఉండటంతో ఆయన సోమవారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రైమరీ హెల్త్ సెంటర్ (పీహెచ్‌సీ)ను సందర్శించారు. సోమవారం ఆ పీహెచ్‌సీలో వ్యాక్సిన్ వేయించుకున్న ఇద్దరు మహిళలతో అమిత్ షా నేరుగా మాట్లాడారు. భవ్నాబెన్ జానీ, మీతాబెన్ పటేల్ అనే ఇద్దరు మహిళలు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ప్రమాదకరం కాదనీ, ప్రాణాలకు ముప్పు ఉండదని గ్రామంలో మీరు విస్తృతంగా ప్రచారం చేయాలనీ, తద్వారా గ్రామంలో ప్రజల్లో వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించాలని ఆ ఇద్దరు మహిళలకు అమిత్ షా సూచించారు. ‘మా ఇంట్లో మా తల్లిదండ్రులు, అన్నా వదినలు ఎవరూ వ్యాక్సిన్ వేసుకోవడం లేదనీ, అది తీసుకుంటే చనిపోతారన్న భయంతోనే గ్రామంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి’ అని మీతాబెన్ పటేల్ చెప్పుకొచ్చారు. 


ఆ గ్రామంలో ఏడు వేల మంది జనాభా ఉన్నారు. వ్యాక్సిన్ డ్రైవ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం సగం మంది కూడా ఈ గ్రామంలో వ్యాక్సిన్ పొందలేదు. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు ఆ గ్రామంలో 141 కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలో ఇప్పటి వరకు 43 శాతం మంది మొదటి డోస్ తీసుకోగా.. సెకండ్ డోస్‌ను మాత్రం కేవలం 19 శాతం మందే తీసుకోవడం గమనార్హం. 18 నుంచి 44 ఏళ్ల వయసు మధ్యలో ఆ గ్రామంలో 3357 మంది ఉంటే, కేవలం 999 మంది మాత్రమే మొదటి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. వారిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే రెండో డోస్‌ను కూడా తీసుకున్నారు. 45 ఏళ్ల పైబడి వయసు ఉన్న వాళ్లు ఆ గ్రామంలో 1695 మంది ఉంటే, 1181 మంది మొదటి డోస్ తీసుకోగా, వారిలో 990 మంది సెకండ్ డోస్‌ను కూడా వేయించుకున్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు ప్రచారం కావడంతో మొదటి డోస్‌ను తీసుకున్న వాళ్లు కూడా రెండో డోస్‌ను తీసుకోవడానికి వెనకడుగు వేస్తుండటం గమనార్హం. దీంతో కేంద్ర హోం మంత్రి రంగంలోకి దిగి, వ్యాక్సిన్‌పై ఆ గ్రామ ప్రజల్లో అవగాహనను కల్పించే ప్రయత్నం చేశారు. 



Updated Date - 2021-06-22T18:22:55+05:30 IST