rupeefall: మునుపెన్నడూచూడని కనిష్ఠస్థాయికి రూపాయి.. మీ కుటుంబ ఖర్చులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..

ABN , First Publish Date - 2022-09-24T20:38:23+05:30 IST

దేశీయ కరెన్సీ రూపాయి(Rupee) గింగిరాలు తిరుగుతోంది. శుక్రవారం డాలర్‌ మారకంలో 30 పైసలు క్షీణించి 81.23 స్థాయికి దిగజారింది. చివరికి రూ.81.09 వద్ద ముగిసింది. రూపాయికి ఇది జీవితకాల కనిష్ఠ స్థాయి.

rupeefall: మునుపెన్నడూచూడని కనిష్ఠస్థాయికి రూపాయి.. మీ కుటుంబ ఖర్చులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..

దేశీయ కరెన్సీ రూపాయి(Rupee) విలువ గింగిరాలు తిరుగుతోంది. శుక్రవారం డాలర్(dollar) మారకంలో 30 పైసలు క్షీణించి 81.23 స్థాయికి దిగజారింది. కాస్త కోలుకుని చివరికి రూ.81.09 వద్ద ముగిసింది. అయితే  రూపాయికి ఇది జీవితకాల కనిష్ఠ స్థాయి. అంతర్జాతీయంగా డాలర్‌ విలువ పుంజుకోవడం, ఈక్విటీ మార్కెట్‌(eqity markets) నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII)లు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ఇందుకు ప్రధాన కారణాలయ్యాయి. చివరి 3 సెషన్లలో రూపాయి 135 పైసలు మేర క్షీణించిందంటే పతనం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మళ్లీ  ఉదృతమవుతుండడం, అమెరికా సహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్యోల్బణం నియంత్రణకు వడ్డీ రేట్లు ఎక్కువ మోతులో పెంచుతుండటం, ఈక్విటీ మార్కెట్ల నష్టాలు వంటి పరిణామాలు మన కరెన్సీని రోజురోజుకూ బలహీనం చేస్తున్నాయి. రూపాయి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 8 శాతానికిపైగానే క్షీణించింది. మున్ముందు డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.82 స్థాయికి పడిపోవచ్చునని ఫారెక్స్ మార్కెట్ల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపాయి విలువ క్షీణత భారతీయ కుటుంబాలు, సామాన్యులపై ఏవిధంగా ప్రభావం చూపిస్తుందో ఓ లుక్కేద్దాం...


ఆ వస్తువుల ధరలు పెరగడం ఖాయం..

రూపాయి విలువ పతనమవుతుండడం భారతీయులకు ఏమాత్రం సానుకూల పరిణామం కాదు. రూపాయి ఇంకా పతనమైతే భారతీయుల జేబులపై పలు రూపాల్లో ప్రభావం ఉంటుంది. విదేశాల నుంచి భారత దిగుమతులపై అధిక బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా దిగుమతులపై అధికంగా ఆధారపడే కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తుల ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో ఎలక్ట్రానిక్స్, ఆటో ఇండస్ట్రీ, టెలికం కంపెనీలు, ఎఫ్ఎంసీజీ కంపెనీల ఉత్పత్తులు ఉంటాయి. ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కంపెనీలు ఉత్పత్తి వ్యయాలను పూర్తిగా భరించవు. కొంతమొత్తాన్ని వినియోగదారులపై మోపే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ధరలు పెంచడమే వారిముందున్న మార్గమవుతుంది. కాబట్టి వినియోగదారులు ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది.


ఇంధన ధరలు ఆకాశానికి..

క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ప్రధానమైనది. భారత ఆయిల్ వినియోగంలో ఏకంగా 85 శాతం విదేశాల నుంచే దిగుమతవుతోంది. రూపాయి క్షీణత కారణంగా అధికంగా చెల్లింపులతో ఆయిల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పరిణామం దేశీయంగా ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి.


నెలవారీ బడ్జెట్ పెరగడం ఖాయం...

ఇంధన ధరలు పెరిగితే రవాణా వ్యయాలు పెరిగిపోతాయి. ఈ పరిణామం ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంటే ఆహారపదార్థాలు సహా నిత్యావసరాల ధరలు కూడా గణనీయంగా పెరిగిపోతాయి. వీటన్నింటి ఫలితం నెలవారీ బడ్జెట్ అనివార్యంగా పెరిగిపోతుంది. కుటుంబ వ్యయాలు పెరగడంతో ఆదాయంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా సేవింగ్స్ ప్లాన్ చేసుకునేవారికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీపై ప్రభావం..

దేశీయ ఎరువుల పరిశ్రమ విదేశీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. కాబట్టి రూపాయి విలువ దిగజారితే కంపెనీలపై ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. ముడిపదార్థాల ధరల భారాన్ని వినియోగదారులపై మోపాలని కంపెనీ భావిస్తే ఎరువులు ధరలు పెరగడం తప్ప మరో మార్గం ఉండదు. కాబట్టి రూపాయి విలువ క్షీణత దేశీయ ఎరువులు పరిశ్రమ, వ్యవసాయరంగానికి ఏమాత్రం సానుకూలం కాదు.


విదేశీయానం మరింత భారం..

రూపాయి పతనం ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో విదేశీ ప్రయాణాలు భారంగా మారడం ఖాయం. భారత కరెన్సీ, మనం వెళ్లబోతున్న దేశ కరెన్సీ ఎక్చ్సేంజీ రేటు ఆధారంగా ప్రయాణికులపై ప్రభావం ఉంటుంది.  కాబట్టి కరెన్సీ పతనం నేపథ్యంలో విదేశీయానం చేయాలనుకునేవారు సరైన సమయంలో ప్లానింగ్ చేసుకోవడం ఉత్తమం.


విదేశాల్లో చదువు మరింత భారం..

రూపాయి విలువ క్షీణత ప్రభావం విదేశాల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులపై పడుతుంది. రూపీ పతనంతో అంచనా వ్యయాలన్నీ పెరిగిపోతాయి. ఆ భారం ఎక్కువగా ఉంటే భరించడం ఇబ్బందిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


ఆందోళన అక్కర్లేదు..

రూపాయి విలువ దిగజారడంపై అంతగా కలవరం చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూపాయి విలువ పెరుగుదలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. విదేశీ మారక నిల్వల నుంచి డాలర్లు విక్రయించి రూపాయి విలువను చక్కదిద్దే చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఆర్బీఐ సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుంటుంది.

Updated Date - 2022-09-24T20:38:23+05:30 IST