అత్యంత దిగువకు రూపాయి విలువ

ABN , First Publish Date - 2022-07-01T20:25:51+05:30 IST

అమెరికా సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను వేగంగా పెంచుతుండటంతోపాటు కరోనా సంక్షోభ సమయంలో కల్పించిన ద్రవ్య ఉద్దీపనలను సైతం క్రమంగా ఉపసంహరించుకుంటోంది. దాంతో డాలర్‌ నిధుల లభ్యత తగ్గనుందన్న భయాలు ఆ దేశ కరెన్సీకి..

అత్యంత దిగువకు రూపాయి విలువ

ముంబై: దేశీయ కరెన్సీ విలువ మరింత క్షీణించి సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో అమెరికన్‌ డాలర్‌తో మన రూపాయి మారకం విలువ గురువారంనాడు 5పైసలు తగ్గింది. దాంతో డాలర్‌-రూపాయి మారకం రేటు రూ. 79.11కి చేరుకుంది. రెండు రోజుల క్రితం రూపాయి విలువ 79 స్థాయిని దాటింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచడంతోపాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన ఈ పతనానికి కారణం. వీటితో పాటు అంతర్జాతీయంగా డాలర్‌ మరింత బలం పుంజుకోవడం, దేశీ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం కూడా రూపాయిపై ప్రభావం చూపాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రూపాయి 4.2 శాతం బలహీనపడింది.


అమెరికా సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను వేగంగా పెంచుతుండటంతోపాటు కరోనా సంక్షోభ సమయంలో కల్పించిన ద్రవ్య ఉద్దీపనలను సైతం క్రమంగా ఉపసంహరించుకుంటోంది. దాంతో డాలర్‌ నిధుల లభ్యత తగ్గనుందన్న భయాలు ఆ దేశ కరెన్సీకి డిమాండ్‌ను పెంచుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ బుధవారం పేర్కొన్నారు. మున్ముందు మన రూపాయి విలువ మరింత క్షీణించవచ్చన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) వార్షిక సదస్సుతోపాటు పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్‌) సమావేశం నిర్ణయాలు సమీప భవిష్యత్‌లో రూపాయి మారకం రేటుకు మార్గనిర్దేశం చేయవచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌కు చెందిన సుగంధ సచ్‌దేవ అన్నారు.

Updated Date - 2022-07-01T20:25:51+05:30 IST