ఆగని పతనం మరో రికార్డు కనిష్ఠానికి రూపాయి

ABN , First Publish Date - 2022-07-06T09:14:42+05:30 IST

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది.

ఆగని పతనం మరో రికార్డు కనిష్ఠానికి రూపాయి

ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. మరో ఆలోచన లేకుండా విదేశీ సంస్థలు సాగిస్తున్న అమ్మకాలు, డాలర్‌ శక్తివంతం కావడం రూపాయిని కుంగదీస్తున్నాయి. మంగళవారం అమెరికన్‌ డాలర్‌ మారకంలో మరో 38 పైసలు నష్టపోయిన రూపాయి 79.33 వద్ద ముగిసింది. ఆరంభంలో 79.04 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 79.02-79.38 మధ్యన కదలాడి చివరికి 38 పైసల నష్టంతో ముగిసింది. రూపాయికి ఇది రికార్డు కనిష్ఠ స్థాయి. డాలర్‌ శక్తివంతంగా ఉన్న ప్రభావంతో రాబోయే రోజుల్లో కూడా రూపాయి నెగిటివ్‌ ధోరణిలోనే ట్రేడవుతుందని షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అనుజ్‌ చౌదరి అన్నారు. అయితే ఇటీవల బంగారంపై విధించిన దిగుమతి సుంకం రూపాయిని కొంత ఆదుకునే ఆస్కారం ఉందని అంచనా. ఇదిలా ఉండగా విదేశీ సంస్థలు సోమవారం రూ.2,149.56 కోట్ల విలువ గల షేర్లు విక్రయించినట్టు స్టాక్‌ ఎక్స్ఛేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


క్యూ3 నాటికి 82 స్థాయికి: నోమురా

అమెరికన్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచుతూ పోవడం వల్ల రాబోయే రోజుల్లో రూపాయిపై ఒత్తిడి మరింతగా పెంచనుందని రేటింగ్‌ ఏజెన్సీ నోమురా అంచనా వేస్తోంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి రూపాయి విలువ 82కి దిగజారవచ్చని నోమురా పేర్కొంది. ఈ ఏడాది కరెంట్‌ ఖాతా లోటు కూడా 3.3 శాతానికి చేరే ఆస్కారం ఉన్నట్టు తాజా నివేదికలో తెలిపింది. జూన్‌లో ఎగుమతులు మందగించగా దిగుమతులు మాత్రం గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడే అంశమని పేర్కొంది. అలాగే అమెరికా మాంద్యంలోకి జారుకోవచ్చన్న భయాల నడుమ ఎగుమతులు మరింత మందగించే ఆస్కారం ఉన్నట్టు తెలిపింది.


సెన్సెక్స్‌ 100 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఆరంభంలో పాజిటివ్‌గా ప్రారంభమైనప్పటికీ చివరి గంటలో సాగిన అమ్మకాలతో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తటంతో సెన్సెక్స్‌ 100.42 పాయింట్లు నష్టపోయి 53,134.35 వద్ద ముగియగా నిఫ్టీ 24.50 పాయింట్లు కోల్పోయి 15,820.85 వద్ద క్లోజైంది. యూర్‌పలో తిరోగమనం భయాలతో మార్కెట్లు నిరాశావహంగా ప్రారంభం కావడం కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపింది. 

Updated Date - 2022-07-06T09:14:42+05:30 IST