రూపాయి కూడా..!

ABN , First Publish Date - 2021-11-11T05:26:50+05:30 IST

ఈ రైతు పేరు రంగనాథం. డోన మండలం తాడూరు గ్రామం.

రూపాయి కూడా..!
జిల్లా సహకార బ్యాంకు

  1. పది రోజులైనా జమకాని వడ్డీ
  2. నిబంధనల పేరిట భారీగా కుదింపు
  3. పంట రుణం తీసుకున్న రైతులు 4 లక్షలు 
  4. అర్హుల జాబితాలో 1.12 లక్షల మందికే చోటు



ఈ రైతు పేరు రంగనాథం. డోన మండలం తాడూరు గ్రామం. తనకున్న ఐదెకరాల పొలంలో వేరుశనగ సాగు చేశాడు. గత సంవత్సరం ఖరీఫ్‌లో బ్యాంకు రుణం రూ.లక్ష దాకా తీసుకున్నాడు. గత ప్రభుత్వాలు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసినందున, ఈసారి కూడా వర్తిస్తుందని అనుకున్నాడు. కానీ వైసీపీ ప్రభుత్వం కొత్త మెళిక పెట్టింది. తీసుకున్న రుణానికి ముందుగా వడ్డీ చెల్లిస్తే.. ఆ తర్వాత ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. చేసేదే లేక గత సంవత్సరం మార్చిలో తీసుకున్న  రుణానికి రంగనాథం బ్యాంకులో వడ్డీ చెల్లించేశాడు. అప్పటి నుంచి  ఆ వడ్డీ సొమ్ము తన ఖాతాలో ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన సున్నా వడ్డీ పథకం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశాడు. కానీ తన ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదని రైతు రంగనాథం అంటున్నాడు. బ్యాంకు వెళ్లి విచారిస్తే.. వడ్డీ రాయితీ నిధులు మంజూరు కాలేదని, అర్హత ఉందో లేదో ఇప్పుడే చెప్పలేమని అధికారులు తేల్చి చెప్పారు. ఇదేం ఖర్మ అని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 9:  జిల్లాలో నాలుగున్నర లక్షల మంది రైతులు పంట సాగు కోసం ఏటా  రూ.కోట్ల రుణాలు తీసుకుంటున్నారు. వీరందరూ ఎప్పటి నుంచో వడ్డీ రాయితీ పొందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయడంతో అర్హుల జాబితా భారీగా తగ్గిపోయింది. జిల్లాలో సుమారు 1,12,500 మంది రైతులు అర్హులని,  వీరి ఖాతాల్లో సున్నా వడ్డీ పథకం కింద రూ.23.70 కోట్లు జమ చేయాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. రుణం తీసుకున్న రైతులు 4 లక్షలకు పైగా ఉంటే... కేవలం 1.12 లక్షల మందికకి  వడ్డీ రాయితీ ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. 


పైసా కూడా జమకాలేదు..

జిల్లాలో రైతులు స్టేట్‌ బ్యాంకు, గ్రామీణ ప్రగతి బ్యాంకు, రాయలసీమ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకు తదితర 20 బ్యాంకులలో రైతులు పంట రుణాలను తీసుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పంట రుణం తీసుకున్న రైతుల తరపున వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు జమ చేసింది. ప్రస్తుతం ఆ విధానాన్ని పూర్తిగా మార్చారు. రైతులు ముందుగా వడ్డీ చెల్లిస్తే, తరువాత ప్రభుత్వం తిరిగి ఇస్తుందని ముఖ్యమంత్రి జగన ప్రకటించారు. ఈ సొమ్మును రైతుల ఖాతాలకు జమ చేస్తున్నామని పది రోజుల క్రితం ప్రకటించారు. రైతులు బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తే ఒక్క రూపాయి కూడా జమ కాలేదని బ్యాంకర్లు అంటున్నారు. ప్రభుత్వం తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



ఈ-క్రాప్‌ పేరిట తొలగింపు

పంట సాగు చేసిన రైతులు ఆర్‌బీకేలకు వెళ్లి వివరాలను నమోదు చేయించాలి. వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ వద్ద ధ్రువపత్రాలను సమర్పించాలి. ఇలా నమోదు చేసిన వారికే సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందని నిబంధన పెట్టారు. కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో దాదాపు 1800 మందికి సున్నా వడ్డీ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వానికి జాబితా పంపారు. వీరిలో వెయ్యి మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఈ-క్రాప్‌ నమోదు చేయించలేదని 800 మంది రైతులను అనర్హులుగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. తమ నుంచి వడ్డీ మొత్తాన్ని వసూలు చేసి, ఇప్పుడు అనర్హులు అంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. 


అర్హులందరికీ వర్తిస్తుంది..

జిల్లాలో దాదాపు 1,12,500 మంది రైతులకు రూ.23.70 కోట్ల వడ్డీ రాయితీ మొత్తాన్ని జమ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే రైతుల బ్యాంకు ఖాతాలకు వడ్డీ రాయితీ మొత్తం జమ అవుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ క్రాప్‌ నమోదు చేయించాలని రైతులకు ముందుగానే తెలిపాము. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ క్రాప్‌ తప్పనిసరి.

 - వరలక్ష్మి, జేడీఏ 


రైతుల నోట్లో మట్టి..

జగన మోహన రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని బాహాటంగా చెప్పారు. కానీ ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. నిబంధనల పేరుతో అర్హుల జాబితాను భారీగా కుదిస్తున్నారు. గత ప్రభుత్వాలు సున్నా వడ్డీ పథకంతో పాటు పావలా వడ్డీ పథకాన్ని అర్హత ఉన్న ప్రతి రైతులకు వర్తింపజేశారు. జగన మోహన రెడ్డి కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నారు. ఈ-క్రాప్‌ నమోదులో రైతు సాగుచేసిన పంట ఒకటైతే... బ్యాంకుల్లో రుణం తీసుకున్నప్పుడు అధికారులు మరో పంటను నమోదు చేస్తున్నారు. దీని వల్ల రైతులకు వడ్డీ రాయితీ పథకం పొందే అవకాశం లేకుండా పోతోంది. నిబంధనల పేరిట రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులందరికీ సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపజేయాలి.

 - రామక్రిష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి









Updated Date - 2021-11-11T05:26:50+05:30 IST