అమ్మ ఒడిలో రూ.వెయ్యి కోత

ABN , First Publish Date - 2021-01-11T05:17:59+05:30 IST

జగనన్న అమ్మఒడి సొమ్ములో ప్రభుత్వం రూ.వెయ్యి కోత విధించింది. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

అమ్మ ఒడిలో రూ.వెయ్యి కోత

  1. తల్లుల ఖాతాలో రూ.14 వేలు
  2. విద్యాశాఖ ఖాతాలో రూ.వెయ్యి
  3. నేడు ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం


కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 10: జగనన్న అమ్మఒడి సొమ్ములో ప్రభుత్వం రూ.వెయ్యి కోత విధించింది. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కరి ఖాతాలో సోమవారం రూ.14 వేలు జమ చేయనుంది. మిగి లిన రూ.వెయ్యి పాఠశాలల అభివృద్ధి కోసం విద్యాశాఖ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటిం చిన ప్రకారం ఒక్కో తల్లి ఖాతాలో రూ.15 వేలు జమ కావాల్సి ఉంది. అమ్మ ఒడి పథకం కింద ఆర్థిక సాయం ఇచ్చినట్లే ఇచ్చి కోత ఏమిటని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. 

జిల్లాలో 4,12,884 మంది తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు రూ.619.326 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది 1,20,755 మంది విద్యార్థులను అనర్హుల జాబితాలో ఉంచారు. ప్రతి నెలా 300 యూనిట్లు విద్యుత్‌ బిల్లు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల ఆదాయం ఉన్నవారిని, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు.. ఇలా 7 నిబంధనలతో అనర్హులుగా ప్రకటించారు. 9,075 మంది విద్యార్థుల ధ్రువపత్రాలు సరిగా లేవని, రీవెరిఫికేషన్‌ జాబితాలో ఉంచారు. అనర్హుల జాబితా, రీవెరిఫికేషన్‌ జాబితాలో ఉన్న 1,30,830 మందికి ఆర్థిక సాయం నిలిపివేశారు. జిల్లాలో 1 నుంచి 12వ తరగతి వరకు మొత్తం 8,14,351 మంది  విద్యార్థులు ఉన్నారు. వీరిలో 6,84,521 మందిని అర్హులుగా గుర్తించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు 6,11,210 మంది, ఇంటర్‌ విద్యార్థులు 72,989 మందికి సాయం అందనుంది. పాఠశాల స్థాయిలో 1,04,752 మంది, ఇంటర్‌లో 16,003 మందిని అనర్హులుగా గుర్తించారు. పాఠశాల స్థాయిలో 8,596 మందిని, ఇంటర్‌లో 479 మందిని రీవెరిఫికేషన్‌ జాబితాలో ఉంచారు. 


ఉదయం 11 గంటలకు జమ: డీఈవో

కర్నూలు నగరంలోని ఎ క్యాంప్‌ ఇందిరాగాంధీ మెమోరియల్‌ మున్సిపల్‌ హై స్కూల్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తామని డీఈవో సాయిరాం తెలిపారు. ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, కలెక్టర్‌ వీర పాండియన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలాజీ హాజరు అవుతారని తెలిపారు. అర్హులందరికీ అమ్మఒడి పథకం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈవో వెల్లడించారు. 


Updated Date - 2021-01-11T05:17:59+05:30 IST