విషమంగానే రష్దీ ఆరోగ్య పరిస్థితి

ABN , First Publish Date - 2022-08-14T08:46:50+05:30 IST

అమెరికాలో దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.

విషమంగానే రష్దీ  ఆరోగ్య పరిస్థితి

మాట్లాడలేని స్థితి.. దాడిలో బాగా దెబ్బతిన్న చేతి నరాలు

కన్ను పోయే ప్రమాదం

24 గంటలకుపైగా వెంటిలేటర్‌పైనే...

దాడికి పాల్పడిన వ్యక్తి పేరు హాది మతార్‌


న్యూయార్క్‌, ఆగస్టు 13 : అమెరికాలో దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని,  ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉన్నదని బుక్‌ ఏజెంట్‌ ఆండ్రూ వైలీ తెలిపారు. ఆయన చేతినరాలు బాగా దెబ్బ తిన్నాయని చెప్పారు. న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం ప్రసంగించడానికి సిద్ధవుతుండగా.. వేదికపైకి ఓ అగంతకుడు దూసుకొచ్చి రష్దీ మెడభాగంలో కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని న్యూజెర్సీకి చెందిన హాది మతార్‌(24)గా పోలీసులు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో జన్మించిన రష్దీ(75) రాసిన ‘ద శటానిక్‌ వర్సెస్‌’ నవలను 30 ఏళ్ల క్రితం ఇరాన్‌ ప్రభుత్వం నిషేధించి ఆయన తలకు వెల ప్రకటించిం ది.


అప్పటినుంచి ఆయన ముం బైను వదిలి విదేశాల్లో తల దాచుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. దాడికి గురై నెత్తురోడుతున్న స్థితిలో ఉన్న రష్దీని హెలికాప్టర్‌లో వాయవ్య పెన్సిల్వేనియాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడే స్థితిలో లేరని, ఆయన ఆరోగ్యం గురించి తెలుస్తున్న విషయాలు ఆశాజనకంగా లేవని  ఆండ్రూ వైలీ తెలిపారు. రష్దీ నవల ‘మిడ్‌నైట్‌ చిల్ర్డెన్‌’కు బుకర్‌ ప్రైజ్‌ లభించింది. విదేశీ ప్రభుత్వాల ఆశ్రయంలో ఉంటున్న రష్దీ.. ఘటన జరిగిన రోజు అదే అంశంపై ప్రసంగాల్సి ఉంది. ‘మోర్‌ దాన్‌ షెల్టర్‌’ అనేది ఆయన ఎంచుకున్న అంశం. చౌతాక్వా లేక్‌లో 7వేల మంది సభ్యులు కలిగిన ఎన్‌జీవో సంస్థ ఈ ప్రసంగం ఏర్పాటుచేసింది. దాడికి గురై రష్దీ కిందపడిపోగానే శ్రోతల్లోని ఒక వైద్యుడు ముందుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. పీటర్స్‌బర్గ్‌లో ఓ శరణార్థుల సంస్థను నడుపుతున్న హెన్రీ రీస్‌ కూడా స్వల్పంగా గాయపడ్డారు.  


రష్దీపై అంత తేలిగ్గా ఆగంతకుడు దాడి చేయడం అమెరికా భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తనకు కల్పిస్తున్న అధిక భద్రతపై రష్దీ బహిరంగంగా ఫిర్యాదుచేసిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. చుట్టూ భారీగా భద్రతా సిబ్బందిని పెట్టుకుని ఒక సాహిత్య ఉత్సవంలో పాల్గొనాల్సి రావ డం తనకు ఒకింత ఇబ్బందిగా ఉన్నదని 2001లో ఆయన అన్నారు. 


ఇస్లామిక్‌ గార్డ్స్‌ అభిమాని దుశ్చర్య

దాడికి పాల్పడిన హాది మతార్‌ పూర్వపరాలపై ఇంకా స్పష్టత రాలేదు. సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌కు, షియా తీవ్రవాద భావాలకు అతడు సానుభూతిపరుడని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ దేశమే రష్దీపై 30 ఏళ్లకుపైగా ఫత్వాను అమలుచేస్తోంది. అధికారికంగానే అతని తలపై మూడు మిలియన్‌ డాలర్ల వెలను ప్రకటించి.. ఎప్పటికప్పుడు ఆ మొత్తాన్ని పెంచుతూ పోతోంది. హాదిని ఘటనాస్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో అతనొక్కడే పాల్గొన్నట్టు భావిస్తున్నారు. 


ఓటు బ్యాంకు కోసమే నిషేధించారు

రాజీవ్‌గాంధీని విమర్శిస్తూ రష్దీ లేఖ 

వివాదాస్పద ‘ద శటానిక్‌ వర్సెస్‌’ నవలను 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత పదేళ్లకు న్యూయార్క్‌ టైమ్స్‌కు నేరుగా రాజీవ్‌గాంధీని విమర్శిస్తూ రష్దీ లేఖ రాశారు. ముస్లిం ఓటుబ్యాంకు కోసమే రాజీవ్‌ ప్రభుత్వం తన పుస్తకాన్ని నిషేధించిందని ఘాటుగా విమర్శించారు. తన పుస్తకాన్ని రాజకీయ ఫుట్‌బాల్‌లా వాడుకోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్టు లేఖలో స్పష్టం చేశారు. కాగా, రాజీవ్‌ చర్యను శనివారం కాంగ్రెస్‌ నేత నట్వర్‌ సింగ్‌(91) సమర్థించారు. అది తప్పు కాదని, శాంతిభద్రతల కారణంగానే అప్పట్లో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నదని రాజీవ్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన వివరించారు. రష్దీ పుస్తకం విషయంలో రాజీవ్‌ తన అభిప్రాయం అడిగినప్పుడు.. పుస్తకాల నిషేధానికి తాను జీవితకాల వ్యతిరేకిని అయినా.. కశ్మీర్‌, ఇతర భారతీయ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఆ పుస్తకంపై వేటు వేయాల్సిందేనని సూచించానన్నారు. 

Updated Date - 2022-08-14T08:46:50+05:30 IST