IPL 2022: చివర్లో చెలరేగిన రసెల్, బిల్లింగ్స్.. హైదరాబాద్ ఎదుట భారీ లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-15T03:13:17+05:30 IST

సన్‌ రైజర్స్ హైదరాబాద్‌(Sun Risers Hyderabad)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్

IPL 2022: చివర్లో చెలరేగిన రసెల్, బిల్లింగ్స్.. హైదరాబాద్ ఎదుట భారీ లక్ష్యం

పూణె: సన్‌ రైజర్స్ హైదరాబాద్‌(Sun Risers Hyderabad)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఆరంభం కలిసిరాలేదు. 17 పరుగులకే వెంకటేశ్ అయ్యర్ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాతో కలిసి అజింక్య రహానే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే, ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించాక 26 పరుగులు చేసిన నితీశ్ రాణా అవుటయ్యాడు.


ఆ తర్వాత కాసేపటికే రహనే (28) కూడా పెవిలియన్ చేరడంతో పరుగులు రావడం కష్టమైంది. మరోవైపు, బౌలర్లు పట్టుబిగించడంతో వికెట్లు టపటపా రాలాయి. ఈ క్రమంలో క్రీజులో పాతుకుపోయిన శామ్ బిల్లింగ్స్, ఆండ్రూ రసెల్ బౌలర్లను కాసేపు వణికించారు. చకచకా పరుగులు తీస్తూ స్కోరు బోర్డును కదిలించారు. దీంతో 150 పరుగులకే పరిమితమవుతుందనుకున్న స్కోరు వడివడిగా పరుగులు పెట్టింది. వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్‌లో రసెల్ మూడు సిక్సర్లతో 20 పరుగులు పిండుకోవడంతో కోల్‌కతా స్కోరు 177 పరుగులకు చేరుకుంది. బిల్లింగ్స్ 29 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్సర్‌తో 34 పరుగులు చేయగా, రసెల్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు మూడు వికెట్లు దక్కాయి.

Read more