రష్యాను, రష్యన్లను గౌరవించాలి : ఫ్రెంచ్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-03-08T21:40:33+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను గౌరవించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు

రష్యాను, రష్యన్లను గౌరవించాలి : ఫ్రెంచ్ అధ్యక్షుడు

పారిస్ : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను గౌరవించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్ పిలుపునిచ్చారు. రష్యా భాగస్వామ్యం లేకపోతే శాశ్వత శాంతి సాధ్యం కాదని, అందువల్ల రష్యాను, ఆ దేశ ప్రజలను గౌరవించాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దేశాలు రష్యాతో దూరం పాటిస్తుండగా, ఆ దేశాధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో మాట్లాడటానికి తలుపులు తెరచి ఉంచిన దేశాధినేతల్లో మేక్రన్ ఒకరు. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్ నాలుగుసార్లు పుతిన్‌తో మాట్లాడారు. గత నెలలో మొత్తం మీద వీరిద్దరూ 11 సార్లు మాట్లాడుకున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు చేసిన దౌత్య యత్నాలు విఫలమైనప్పటికీ మేక్రన్ ఆశావాదాన్ని వీడలేదు. 


యూరోపియన్ యూనియన్‌కు అధ్యక్ష స్థానంలో ప్రస్తుతం ఫ్రాన్స్ ఉంది. రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కసారి ఈ పదవి లభిస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తలి బెన్నెట్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. శనివారం అనూహ్యంగా బెన్నెట్ మాస్కోలో పుతిన్‌ను కలిశారు. ఆదివారం పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 


అట్లాంటిక్ కౌన్సిల్‌లో యూరోప్ సీనియర్ డైరెక్టర్, ఎమ్మాన్యుయేల్ మేక్రన్ నేతృత్వంలోని పార్టీ సభ్యుడు బెంజమిన్ హద్దద్ మాట్లాడుతూ, ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించాలని పుతిన్ కోరుకుంటే, ఈ సంక్షోభానికి తెరదించాలని అనుకుంటే, పాశ్చాత్య దేశాలకు దౌత్య మార్గాలను తెరచి ఉంచడం కోసం మేక్రన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తరపున పుతిన్‌తో మేక్రన్ మాట్లాడారని చెప్పారు. స్థానికంగా కాల్పుల విరమణ, యుద్ధం జరుగుతున్న నగరాల్లో చిక్కుకున్న ప్రజలు సురక్షితంగా ఇతర ప్రాంతాలకు సురక్షితంగా వెళ్ళిపోవడానికి తగిన అవకాశం కల్పించడం, మానవతావాద సాయం అందుబాటులో ఉంచడం వంటి అంశాల్లో పుతిన్ కాస్త దయ చూపించే విధంగా ప్రయత్నించారని తెలిపారు. 


Updated Date - 2022-03-08T21:40:33+05:30 IST