ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థుల తరలింపులో కీలక ప్రక్రియ.. ‘ఆపరేషన్‌ గంగ’ ఇక శరవేగంగా..!

ABN , First Publish Date - 2022-03-03T13:14:50+05:30 IST

‘ఆపరేషన్‌ గంగ’ ఇక రష్యా మీదుగానూ సాగనుంది! ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే కార్యక్రమంలో కీలక పరిణామం సంభవించింది.

ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థుల తరలింపులో కీలక ప్రక్రియ.. ‘ఆపరేషన్‌ గంగ’ ఇక శరవేగంగా..!

‘గంగ’కు దారిచ్చిన ‘ఓల్గా’

తెరుచుకున్న రష్యా గగనతలం

పుతిన్‌కు మోదీ ఫోన్‌

ఖార్కివ్‌లో 6 గంటల పాటు యుద్ధ విరామం 

ఆ సమయంలోగా నగరాన్ని విడిచి వెళ్లేందుకు వెసులుబాటు

ఖార్కివ్‌ను వీడాలని విదేశాంగ శాఖ సూచన 

ఢిల్లీ, ముంబైలో 2 విమానాల్లో దిగిన 400 మంది

న్యూఢిల్లీ, మార్చి 2: ‘ఆపరేషన్‌ గంగ’ ఇక రష్యా మీదుగానూ సాగనుంది! ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే కార్యక్రమంలో కీలక పరిణామం సంభవించింది. ఉక్రెయిన్‌ నగరం ఖార్కివ్‌లో వారం రోజులుగా బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మన విద్యార్థులు, ఇక రష్యా మీదుగానే స్వదేశానికి తరలిరానున్నారు. ఇదంతా ప్రధాని మోదీ నెరిపిన దౌత్యం ఫలితమే! మోదీ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌ చేసి ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తరలించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి పుతిన్‌ సానుకూలంగా స్పందించారు. ఖర్ఖివ్‌ నుంచి భారత విద్యార్థులను తరలించేందుకు 6 గంటలపాటు వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9:30 గంటల్లోగా ఖార్కీవ్‌ను వీడి వెళ్లే వెసులుబాటు లభించింది.


పుతిన్‌తో మాట్లాడిన తర్వాత మోదీ.. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి.. విదేశాంగ శాఖ అధికారులను మోదీ అప్రమత్తం చేశారు. ఖార్కివ్‌ నుంచి వీలైనంత త్వరగా భారతీయులను బయటకు తీసుకెళ్లాలని ఆదేశించారు. అనంతరం ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన జారీచేసింది. ఖార్కివ్‌ను తక్షణం ఖాళీ చేయాలని  ఆ నగరం నుంచి నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని పెసోచిన్‌ నగరానికి గానీ 12 కిలోమీటర్ల దూరంలోని బబాయె నగరానికి గానీ, 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజ్లిడోవ్కా నగరానికి గానీ  చేరుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాహనాలు దొరక్కపోతే కాలి నడకన అయినా ఆ మూడు ప్రాంతాల్లోని ఏదో ఒక చోటుకు చేరుకోవాలని పేర్కొంది. దీంతో  పెద్ద ఎత్తున భారతీయులు ఖార్కివ్‌ను వీడారు.


మాటిచ్చినట్లుగానే భారతీయ విద్యార్థుల తరలింపులో రష్యా సహకరిస్తోంది. ఖార్కివ్‌ను వీడి.. పశ్చిమ సరిహద్దుకు వెళ్లాలనుకున్న భారత్‌కు చెందిన కొందరు అమ్మాయిలకు రష్యా సైన్యం సహకరించింది. దీంతో వారంతా సరిహద్దు వైపు వెళ్లేందుకు రైలెక్కారు. అనంతరం అబ్బాయికూ సహకరించి రైలెక్కించారు. పుతిన్‌తో మోదీ మాట్లాడిన అనంతరం రష్యా కీలక ప్రకటన చేసింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి భారతీయులు సురక్షిత ప్రాంతాలకు చేరేలా కార్యాచరణ చేపడతామని వెల్లడించింది. ఈ మేరకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం రష్యా ఏం చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌లోని రష్యా రాయబారి డేనిస్‌ అలిపోవ్‌ మీడియాతో పేర్కొన్నారు.  కాగా  బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తానని స్పష్టం చేశారు.  శక్తివంతమైన, ప్రభావవంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్‌.. తన పౌరులను ఉక్రెయిన్‌ నుంచి సురక్షితంగా తీసుకురాగలదని పేర్కొన్నారు. మరోవైపు పొలండ్‌ సరిహద్దులో 100 మంది భారతీయ విద్యార్థులను అక్కడి సైనికుల చితగొట్టి.. ఉక్రెయిన్‌లోకి తిప్పి పంపారని ఐక్యరాజ్యసమితిలో బెలారస్‌ రాయబారి వాలంటిన్‌ రైబాకోవ్‌ పేర్కొన్నారు.  


ఉత్తుంగ తరంగంలా.. 

‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం కింద ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు 31 ప్రత్యేక విమానాలను పంపనుంది. ఈ విమానాల్లో 6,300 మందిని భారత్‌కు తీసుకురానున్నారు.   రొసాసో నుంచిమరో నాలుగు విమానాలు, స్లొవికేయాలోని కొషిత్స నుంచి ఒక విమానం భారత్‌కు నడుపుతారు. మరిన్ని విమానాలు పంపడానికి భారత్‌ సిద్దమవుతోంది. 


త్రివర్ణ పతాకంతో పాక్‌, టర్కీ విద్యార్థులు

ఉక్రెయిన్‌ నుంచి సురక్షితంగా బయటపడేందుకు పాక్‌కు చెందిన కొందరు త్రివర్ణ పతాకానికి జై కొడుతున్నారట. ఉక్రెయిన్‌ నుంచి ఆ దేశ సరిహద్దులకు చేరే భారత విద్యార్థులు.. ఎలాంటి అడ్డంకులు ఎదురవకుండా ఉండేందుకు తమ వాహనాలపై త్రివర్ణ పతాకాన్ని అతికించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్‌, టర్కీకి చెందిన కొందరు విద్యార్థులు కూడా సరిహద్దులకు చేరేందుకు భారత జాతీయ పతాకం రక్షణ కల్పించింది. 


అస్వస్థతతో భారత విద్యార్థి మృతి 

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలొదిలాడు. అయితే రష్యా దాడుల వల్ల కాదు...  తీవ్ర అనారోగ్యంతోనే! పంజాబ్‌లోని బర్మాలాకు చెందిన చంద్రన్‌ జిందాల్‌ అనే 21 ఏళ్ల విద్యార్థి ఉత్తర ఉక్రెయిన్‌లోని విన్నిట్సా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఫిబ్రవరి 2న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదేనెల 7న ఆయనకు విన్నిట్సాలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. తర్వాత ఆయన బంధువులు అక్కడకు వెళ్లొచ్చారు.

Updated Date - 2022-03-03T13:14:50+05:30 IST