రష్యాది నరమేధమే

ABN , First Publish Date - 2022-04-14T08:01:52+05:30 IST

కళ్లకు గంతలు, చేతులు వెనక్కు కట్టి వందలకొద్దీ సాధారణ పౌరుల హత్య.. మహిళలపై హత్యాచారాలు..

రష్యాది నరమేధమే

ఉక్రెయిన్‌ను తుడిచిపెట్టాలని అనుకుంటోంది

భయంకర దారుణాలు బయటకొస్తున్నాయ్‌..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 


వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 13: కళ్లకు గంతలు, చేతులు వెనక్కు కట్టి వందలకొద్దీ సాధారణ పౌరుల హత్య.. మహిళలపై హత్యాచారాలు.. చిన్నారుల పైనా దారుణాలు..! ఇవీ ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం అరాచకాలు. ఈ క్రమంలో రష్యా నర మేధానికి పాల్పడుతోందంటూ తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. చాలా ఆధారాలు బయటకు వస్తున్నాయని అన్నారు. అసలు ఉక్రెయిన్‌ ఉనికినే తుడిచిపెట్టేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భావిస్తున్నారని మండిపడ్డారు. గత వారంతో పోలిస్తే పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందన్నారు. ‘‘ఇలాంటి అకృత్యాల గురించి ఇంకా వినబోతున్నాం. రష్యా చర్యలు నరమేధమా? కాదా? అనేది అంతర్జాతీయ న్యాయ నిపుణులు నిర్ధారించాలి. కానీ, ఉక్రెయిన్‌ చెబుతున్నదాని ప్రకారం ఇది నరమేధమే’’ అని బైడెన్‌ స్పష్టం చేశారు. వీటిని నిజమైన నాయకుడి నుంచి వచ్చిన నిజమైన వ్యాఖ్యలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వాగతించారు. ఇప్పటివరకు బైడెన్‌.. రష్యా చర్యలను యుద్ధ నేరాలుగానే పేర్కొన్నారు. యూరప్‌ పర్యటనలోనూ.. ‘‘దేవుడి దయవల్ల.. ఈ వ్యక్తి (పుతిన్‌) పదవిలో ఉండకూడదని కోరుకుంటున్నాను’’ అనే వ్యాఖ్యతో సరిపెట్టారు. దీంతో రష్యాలో అధికార మార్పును మాత్రమే ఆయన కోరుకుంటున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ‘‘రష్యాది నరమేధం’’ అంటూ అభివర్ణించారు. 


ఎంతమందినైనా రేప్‌ చెయ్‌.. కానీ కండోమ్‌ పెట్టుకో


వీడియో కాల్‌లో రష్యా సైనికుడితో అతడి భార్య

‘‘నువ్వు ఉక్రెయిన్‌ మహిళలను ఎంతమందినైనా రేప్‌ చేయ్‌. వాటి గురించి నాకేమీ చెప్పొద్దు. కానీ, కండోమ్‌ పెట్టుకోవడం మర్చిపోవద్దు. నీ భద్రత ముఖ్యం అనేది గుర్తుంచుకో’’ ..ఇదీ ఓ రష్యన్‌ సైనికుడితో అతడి భార్య వీడియో కాల్‌లో చెప్పిన మాట. 32 సెకండ్ల ఈ వీడియో క్లిప్‌ను ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ విడుదల చేసింది. అత్యాచారాలు చేయాల్సిందిగా దురాక్రమణదారులను వారి భార్యలే ప్రోత్సహిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సాటి మహిళల పట్ల వారి నైతిక విలువలు ఇవేనా? అని ప్రశ్నించింది. కాగా, ఉక్రెయిన్‌లో రష్యన్‌ సైనికుల మరో దురాగతం బయటపడింది. రష్యన్‌ సైనికుడు అలెక్సీ బిచ్కోవ్‌ ఓ చిన్నారిపై అత్యాచారం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అతడిని ఉక్రెయిన్‌ సైన్యం అరెస్టు చేసింది. కాగా, చెర్నిహీవ్‌ రీజియన్‌ యాహిద్నెలోని ఓ పాఠశాల బేస్‌మెంట్‌లో 300 మందిని రష్యా సైన్యం నెల  రోజులు బంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. వీరిలో 18 మంది చనిపోయారు. ఇక బుచాలో 57 మందిని సామూహికంగా ఖననం చేసిన దృశ్యాలు బుధవారం బయటపడ్డాయి.


జపోరిజియాలోనూ ఫాస్ఫరస్‌ దాడులు

జాపోరిజియాలో ముందుకెళ్లేందుకు రష్యా క్షిపణులను ప్రయోగిస్తోంది. పోలోహి జిల్లా నోవోడానిలివ్కా గ్రామంలోని ఓ ఇంటిపై బుధవారం రసాయన బాంబును జారవిడిచింది. ఖర్కీవ్‌ నగరం సహా రీజియన్‌లోని పలు జిల్లాల్లో జనావాసాలపై రష్యా పెద్దఎత్తున కాల్పులు జరుపుతోంది. ఖెర్సన్‌ రీజియన్‌ ప్రవ్డినే గ్రామంపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. డొనెట్స్క్‌లోనూ గ్రామాలపై దాడులకు దిగింది. విక్టరీ డే మే 9 నాటికి మారియుపోల్‌ను స్వాధీనం చేసుకుని పరేడ్‌ నిర్వహించాలనే లక్ష్యంతో ఉంది. ఇక్కడ 36వ మెరైన్‌ బ్రిగేడ్‌కు చెందిన వెయ్యిమంది ఉక్రెయిన్‌ సైనికులు తమకు లొంగిపోయినట్లు ప్రకటించింది. మరోవైపు తూర్పు ఉక్రెయిన్‌పై దాడికి రష్యాలోని బెల్గోరోడ్‌లో పెద్దఎత్తున దళాలు సంసిద్ధమవుతున్నట్లు స్పష్టమైంది. బుధవారం పోలండ్‌, బాల్టిక్‌ దేశాలు లిథువేనియా, ఎస్తోనియా, లాత్వియాల అధ్యక్షులు కీవ్‌లో పర్యటించారు. ధ్వంసమైన పట్టణాలను పరిశీలించారు.


భయపెట్టేందుకు రష్యా యత్నాలు..

ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు రష్యా ఫాస్ఫరస్‌ బాంబు దాడులకు పాల్పడుతోందని జెలెన్‌స్కీ ఆరోపించారు. బుధవారం ఎస్తోనియా పార్లమెంటును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సైనిక చర్య ప్రణాళిక ప్రకారమే సాగుతుందన్న పుతిన్‌ వ్యాఖ్యలను  ఎద్దేవా చేశారు. 20 వేలమంది సైనికులను కోల్పోవడమే ప్రణాళికా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత, రష్యా అనుకూలుడైన విక్టర్‌ మెద్వెడ్చుక్‌ను అరెస్టు చేసిన ఫొటోలను జెలెన్‌ స్కీ విడుదల చేశారు. మెద్వెడ్చుక్‌ కావాలంటే రష్యా అపహరించిన తమవారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-04-14T08:01:52+05:30 IST