ఉక్రెయిన్‌పై మరిన్ని భీకర దాడులకు రష్యా సన్నాహాలు!

ABN , First Publish Date - 2022-03-05T18:10:03+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధం పదో రోజుకు చేరింది. ఇకపై మరింత విజృంభించి

ఉక్రెయిన్‌పై మరిన్ని భీకర దాడులకు రష్యా సన్నాహాలు!

మాస్కో : ఉక్రెయిన్‌పై యుద్ధం పదో రోజుకు చేరింది. ఇకపై మరింత విజృంభించి, భీకర దాడులు చేయాలని రష్యా సన్నాహాలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై విరుచుకుపడి, లొంగిపోయేలా చేయడానికి సిద్ధమవుతోంది. కొద్ది రోజులుగా స్తంభించిన యూనిట్లను పటిష్టపరచడం కోసం మరో 1,000 మంది మెర్సినరీస్‌ను ఉక్రెయిన్‌కు పంపించాలని నిర్ణయించింది. పాశ్చాత్య నిఘా వర్గాలను ఉటంకిస్తూ అమెరికన్ మీడియా ఈ వివరాలను శనివారం వెల్లడించింది. 


పాశ్చాత్య నిఘా సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ‘‘ఇది అత్యంత హేయమైన, సంస్కారహీనమైన వైఖరి’’ అని చెప్పారని అమెరికన్ మీడియా తెలిపింది. భారీ ఆయుధాలంటే కేవలం బరువులో మాత్రమే భారీ కాదని, అవి కలిగించే నష్టం కూడా ఎక్కువే ఉంటుందని చెప్పారని తెలిపింది. వాటికి విచక్షణ చాలా తక్కువ అని చెప్పారని పేర్కొంది. 


అమెరికన్ మీడియా కథనాల ప్రకారం, ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రష్యన్ మెర్సినరీస్ కార్యకలాపాల సంకేతాలను అమెరికా ఇప్పటికే గుర్తించింది. కీవ్ నగరంవైపు వెళ్తున్న 64 కిలోమీటర్ల పొడవైన రష్యా దళాల వాహనాల శ్రేణి చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలనుబట్టి తెలుస్తోంది. ఈ విధంగా ఈ వాహనాలు అకస్మాత్తుగా నెమ్మదిగా నడవడానికి కారణం సైనికుల్లో ఆత్మస్థయిర్యం లేకపోవడమేనని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో మరిన్ని దళాలను పంపించాలని రష్యా నిర్ణయించింది. 


రష్యా దళాల వాహనాలు నెమ్మదిగా నడవడానికి కారణం లాజిస్టిక్ సమస్యలను అమెరికాకు చెందిన పెంటగాన్ చెప్తోంది. నష్టపోయిన సమయాన్ని భర్తీ చేయడానికి తీసుకోవలసిన చర్యలను రష్యా ఆలోచిస్తోందని తెలిపింది. మరో వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఉక్రెయిన్‌పై దాదాపు 500 క్షిపణులను రష్యా ప్రయోగించింది, కానీ ఉక్రెయిన్ ఇప్పటికీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. 


Updated Date - 2022-03-05T18:10:03+05:30 IST