రష్యా ఓడుతోంది.. ఉక్రెయిన్‌ గెలుస్తోంది

ABN , First Publish Date - 2022-04-26T07:56:24+05:30 IST

మొన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. నిన్న పోలండ్‌, బాల్టిక్‌ దేశాల అధినేతలు..

రష్యా ఓడుతోంది.. ఉక్రెయిన్‌ గెలుస్తోంది

యుద్ధ లక్ష్యాలను సాధించడంలో రష్యా విఫలం

జెలెన్‌ స్కీ కి  శక్తిమేర సాయం చేస్తాం

అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్‌, ఆస్టిన్‌ వ్యాఖ్యలు


కీవ్‌, ఏప్రిల్‌ 25: మొన్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. నిన్న పోలండ్‌, బాల్టిక్‌ దేశాల అధినేతలు.. తాజాగా అమెరికా కీలక మంత్రులు..! యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్‌లో పర్యటించి గట్టి సంఘీభావం తెలిపారు. ఆదివారం అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో పర్యటించారు. యుద్ధం మొదలైన రెండు నెలల్లో ఉక్రెయిన్‌ వచ్చిన అమెరికా ఉన్నత స్థాయి నాయకులు వీరే కావడం గమనార్హం. రహస్యంగా సాగిన పర్యటనలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో మూడు, నాలుగు గంటలు సమావేశమయ్యారు. రానున్న వారాల్లో ఎలాంటి సాయం అవసరమో చర్చించారు. ‘‘యుద్ధ లక్ష్యాలను సాధిచండంలో రష్యా విఫలమైంది. ఉక్రెయిన్‌ విజయవంతం అవుతోంది. గెలుపు పట్ల జెలెన్‌ స్కీ నిబద్ధతతో ఉన్నారు. ఆయన గమ్యం చేరేందుకు సహకరిస్తాం’’ అని హామీ ఇచ్చారు. సరైన ఆయుధ సంపత్తి, సహకారం ఉంటే ఉక్రెయిన్‌దే విజయమని, అందుకు తాము చేయగలిగినంత చేస్తామని చెప్పారు. ‘‘సార్వభౌమ, ప్రజాస్వామ్య దేశంగా, తమ భూభాగాన్ని కాపాడుకున్న ఉక్రెయిన్‌ను మేం చూడాలనుకుంటున్నాం. ఉక్రెయిన్‌ వంటివాటిపై దాడులు చేయలేని స్థితికి రష్యా బలహీన పడాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు. 300 మిలియన్‌ డాలర్లపైగా సైనిక రుణం ఇస్తామని, 165 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయిస్తామని ఆస్టిన్‌ చెప్పారు. కాగా, ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారిగా బ్రిడ్జెట్‌ బ్రింక్‌ను అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. ఉక్రెయిన్‌లో రెండేళ్లుగా అమెరికా రాయబారి లేరు. 


పర్యటన వేళ.. రైల్వే స్టేషన్లపై రష్యా దాడులు

అమెరికా కీలక మంత్రుల పర్యటన నేపథ్యంలో.. రష్యా ప్రతీకార చర్యలకు దిగింది. రాజధాని కీవ్‌తో పాటు ల్వీవ్‌, రివ్నే, విన్నెస్టా తదితర చోట్ల దాడులకు పాల్పడింది. ఆస్టిన్‌, బ్లింకెన్‌ వచ్చిన రైలు మార్గంలోని క్రాసిన్నే స్టేషన్‌పైనా క్షిపణులను వదలింది. మొత్తం ఐదు స్టేషన్లపై దాడులకు దిగినట్లు సమాచారం.


ఫ్లెచెట్‌లతో బుచాలో దారుణాలు 

రష్యా సేనలు వీడిన తర్వాత బుచా, ఇర్పిన్‌లో  వందలాది ఉక్రెయిన్‌ ప్రజల మృతదేహాలు కనిపించాయి. వీరిలో చాలామంది తల, ఛాతీ భాగాల్లో తేలికపాటి లోహపు బాణా (ఫ్లెచెట్‌ రౌండ్స్‌)లను పోస్టు మార్టంలో గుర్తించారు. సన్నగా ఉండే వీటిని రష్యా ఫిరంగుల నుంచి పేల్చారు.జీవించి ఉన్న పురుషులు, మహిళల్లోనూ ఫ్లెచెట్‌లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నిపుణులు తెలిపారు. ఇలాంటి ఆయుధాలను మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా వినియోగించారు. కాగా, ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతమైన విన్నిట్సియా రీజియన్‌లో సోమవారం రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. ఐదుగురు మృతిచెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్రెమెన్‌చెక్‌లోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, రిఫైనరీపై దాడి చేసింది.

Updated Date - 2022-04-26T07:56:24+05:30 IST