దౌత్య విజయం!

ABN , First Publish Date - 2022-04-13T06:57:44+05:30 IST

రష్యాచమురు కొనుగోలు విషయంలో భారతదేశాన్ని ఫలానావిధంగా వ్యవహరించమంటూ...

దౌత్య విజయం!

రష్యాచమురు కొనుగోలు విషయంలో భారతదేశాన్ని ఫలానావిధంగా వ్యవహరించమంటూ తాము ఎంతమాత్రం కోరలేదని, రష్యా, ఉక్రెయిన్‌లతో ముడిపడిన ప్రతీ అంశంలోనూ భారత్ పూర్తిగా తనకు నచ్చిన నిర్ణయమే తీసుకుంటుందని శ్వేతసౌధం అంటోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన వర్చువల్ సమావేశం ఉభయదేశాలనూ మరింత సన్నిహితం చేసిందే తప్ప, దూరాన్ని పెంచలేదని వైట్‌హౌస్ చెబుతోంది. ఉభయదేశాల టూ ప్లస్ టూ మంత్రులస్థాయి చర్చల్లో అమెరికా ఒత్తిళ్ళకు భారత్ తలొగ్గకపోవడం, మనదే పైచేయిగా ఉండటం దేశవాసులను సంతోషపెడుతోంది.


రష్యాచమురు కొనుగోలు విషయంలో విదేశాంగమంత్రి జయ శంకర్ కుండబద్దలుకొట్టేయడం విపక్షాల ప్రశంసలనూ అందుకుంది. ‘భారత్ కొంటున్న చమురు మీద అంత దృష్టిపెడుతున్న మీరు, ముందు యూరప్ సంగతి చూడండి. ఇంధనభద్రత మా హక్కు. రష్యానుంచి యూరప్ ఓ మధ్యాహ్నంపూట కొంటున్నదానికంటే భారతదేశం నెలకుసరిపడా కొనుక్కుంటున్నది ఎంతో తక్కువ’ అని జయశంకర్ జవాబిచ్చారు. ఇక, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇచ్చిన వివరణలు, వ్యాఖ్యలు గతంలో చేసినవే. హింస ఆగాలనీ, దౌత్యానికి మద్దతిస్తామనీ, అవసరమైతే మధ్యవర్తిగా ఉంటామనీ మరోమారు ఉద్ఘాటించారాయన. ఇక, రష్యాతో ఆయుధ ఒప్పందాలకు దూరంగా ఉండాలన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ సూచనకుకానీ, భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనలను నిశితంగా గమనిస్తున్నామన్న హెచ్చరికకు కానీ స్పందించాల్సిన అవసరం లేదని భారత్ నిర్ణయించుకుంది. మోదీనీ, భారతదేశాన్నీ విమర్శించడానికి మీకు నోరురావడం లేదా అని ప్రతినిధుల సభకు చెందిన ఇల్హాన్ ఓమర్ ఇటీవల ప్రశ్నించిన నేపథ్యంలో బ్లింకెన్ ఈ అంశాన్ని ప్రస్తావించి ఉండవచ్చు.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య విషయంలో భారతదేశ తటస్థ వైఖరిపై అమెరికా ఆచితూచి స్పందిస్తున్నది. భారత్ మీతోనే ఉంటుందా? అని విలేఖరులు వేసిన ప్రశ్నకు బైడెన్ జాగ్రత్తగా సమాధానం చెప్పారు. భారతదేశం బుచా ఊచకోతల తరువాత రష్యాకు వ్యతిరేకంగా బలంగా నిలబడిందని, ఉక్రెయిన్‌కు సాయం చేస్తోందనీ అమెరికా అధికారులే గుర్తుచేస్తున్నారు. చమురు కొనుగోళ్ళను పెంచబోమన్న హామీ ఏమైనా భారత్ నుంచి సాధించారా? అన్న విలేఖరులు ప్రశ్నకు వైట్ హౌస్ సెక్రటరీ ఆ విషయాన్ని మోదీ చూసుకుంటారనీ, రష్యానుంచి ఇండియా కొంటున్నది తన చమురు అవసరాల్లో రెండుశాతం మాత్రమేననీ, అమెరికానుంచి పదిశాతం కొంటున్నదని చెప్పుకొచ్చారు. రష్యాకు వ్యతిరేకంగా తాము విధించిన ఆంక్షలను వమ్ముచేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరిగినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ దలీప్ సింగ్ ఇటీవల ఘాటుగా మాట్లాడి భారత్ మనసు నొప్పించిన విషయం తెలిసిందే.


ఉభయదేశాలూ తమకు సమష్టిలక్ష్యాలున్నాయనీ, వాటిని సాధించాలన్న దృఢ సంకల్పం ఉన్నదని ప్రకటించుకొని రక్షణసహా పలు కీలకరంగాల్లో సహకారాన్ని కాంక్షించాయి. రక్షణ ఉత్పత్తుల తయారీలో అమెరికా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాలని భారత్ కోరుతోంది. రష్యానుంచి ఆయుధాల కొనుగోలు తగ్గించుకొనే పక్షంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు సిద్ధమని అమెరికా అంటోంది. అంతరిక్షం, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి అంశాల్లోనూ, ప్రాంతీయస్థాయిలో శాంతి సుస్థిరతలను కాపాడే విషయంలోనూ మరిన్ని అడుగులువేయాలనుకున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో విడుదల చేసిన సంయుక్త ప్రకటన భారత్‌కు ఇబ్బంది కలిగించని రీతిలో ఉంటూ ప్రధానంగా అమెరికాకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది. సామాన్యుల మరణాలను ఖండించడం, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలనడం,  ఆయా దేశాల సమగ్రతనీ, సార్వభౌమత్వాన్నీ గౌరవించాలనడం మంచిదే. ఉక్రెయిన్ యుద్ధం వల్ల కొన్ని మనస్పర్థలు పుట్టుకొచ్చినా, భారత్ అమెరికా బంధం ఇకపై మరింత బలపడేదే తప్ప పలుచనకాబోదని అమెరికా వాదన. నాలుగోవిడత టూ ప్లస్ టూ సమావేశంతో పాటు బైడెన్ మోదీ మనసు విప్పి మాట్లాడుకోవడం, ఉభయదేశాల బంధానికీ పునాదులు వేసిన నెహ్రూ ట్రూమన్ భేటీని ఈ సందర్భంగా బ్లింకెన్ తలుచుకోవడం గమనించినప్పుడు, భారత్ మనసు మరింత గెలుచుకోవాలన్న అమెరికా ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

Updated Date - 2022-04-13T06:57:44+05:30 IST