భారత్ సాయం కోరిన రష్యా

ABN , First Publish Date - 2022-04-19T22:49:49+05:30 IST

న్యూఢిల్లీ/మాస్కో : ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాల తీవ్ర ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా.. భారత సాయాన్ని కోరింది. రష్యాకు మరిన్ని మెడికల్ పరికరాలు సరఫరా చేయాలని విన్నవించింది.

భారత్ సాయం కోరిన రష్యా

న్యూఢిల్లీ/మాస్కో : ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాల తీవ్ర ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా.. భారత్ సాయాన్ని కోరింది. రష్యాకు మరిన్ని మెడికల్ పరికరాలు సరఫరా చేయాలని విన్నవించింది. ఈ అంశంపై ఈ నెల 22న భారత్, రష్యాలకు చెందిన కంపెనీలు వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. భారత్ నుంచి మెడికల్ సప్లయిలు అదనంగా పెంచడంపై ఈ సమావేశంలో ప్రతినిధులు చర్చించబోతున్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ ఫోరం కోఆర్టినేటర్ రాజీవ్ నాథ్  ఈ విషయాన్ని వెల్లడించారు. మరోపక్క రష్యా మార్కెట్‌లో భారత్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఎగుమతులను ఈ ఏడాది 10 రెట్లు పెంచి 2 బిలియన్ల రూపాయలు(26.2 బిలియన్ డాలర్లు)కు చేరుకోవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుందని రాజీవ్ నాథ్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో కీలకపాత్ర పోషించే రష్యా బిజినెస్ గ్రూప్ ‘బిజినెస్ రష్యా’ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. యూరప్, చైనాల నుంచి రష్యాకు దిగుమతులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 


ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆగ్రహానికి గురవుతున్న రష్యాతో సంబంధాలను యథావిథిగా కొనసాగించాలని భారత్ నిర్ణయించింది. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఎగుమతులకు మరింత ఊతమివ్వడమే లక్ష్యంగా స్థానిక కరెన్సీలలో చెల్లింపులకు ఇరు దేశాలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి. కాగా రష్యా నుంచి అదనంగా ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్న భారత్‌ను అగ్రరాజ్యం అమెరికాతోపాటు మిత్ర దేశాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-19T22:49:49+05:30 IST