రంగనాయకమ్మ రష్యానే బలపరచాలి!

ABN , First Publish Date - 2022-03-12T07:08:25+05:30 IST

తానుశ్రామికవర్గ పక్షపాతినని రంగనాయకమ్మ పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకు అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే.

రంగనాయకమ్మ రష్యానే బలపరచాలి!

తానుశ్రామికవర్గ పక్షపాతినని రంగనాయకమ్మ పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకు అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. అయితే, పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు ఆమె కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంధ్రజ్యోతిలో మార్చి 2న ‘మహా రష్యన్ దురహంకారం’ పేరిట రంగనాయకమ్మ రాసిన వ్యాసంలో పొసగని సూత్రీకరణలు ఉన్నాయి.


రంగనాయకమ్మగారు ప్రస్తావించిన జాతుల సమస్య మీద ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ జరగనన్ని చర్చలు, వాదోపవాదాలు విప్లవానికి ముందు తరువాత రష్యన్‌ పార్టీలో జరిగాయి. బోల్షివిక్‌ పార్టీ ఒక ప్రజాస్వామిక సంస్థ. పార్టీలో లెనిన్‌ ప్రతిపాదించినా, స్టాలిన్‌ ప్రతిపాదించినా చర్చల తరువాత ఆమోదం పొందిన వాటినే అమలు చేశారు. అందువలన వాటిని వ్యక్తులకు ఆపాదించటం తగనిపని. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సైద్ధాంతిక విబేధాలతో చీలిన తరువాత తెలుగునాట రెండు పార్టీలను కొందరు సుందరయ్య పార్టీ, రాజేశ్వరరావు పార్టీ అని పిలవటాన్ని ఆమె గుర్తుకు తెచ్చారు. ‘లెనిన్‌ వ్యతిరేకించిన జాతుల విధానమే స్టాలిన్‌ ఆధిపత్యంలో కొనసాగింది’ అని చెప్పటం అలాంటిదే.



జారు కాలంలో మైనారిటీ జాతులను అణచివేసింది నిజం. అందుకే విప్లవం సంభవించక ముందే సోషలిస్టు దేశంలో జాతుల సమస్య పరిష్కారం గురించి పార్టీలో చర్చ జరిగింది. అయినప్పటికీ రష్యన్‌ రిపబ్లిక్‌ అని నామకరణం చేసింది లెనిన్‌ నాయకత్వంలో ఉన్న పార్టీ, ప్రభుత్వమే కదా. దాని అర్థం మహా రష్యన్‌ దురహంకారానికి లెనిన్‌ లోనైనట్లా? రిపబ్లిక్‌లకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్న లెనిన్‌ వైఖరిని కొందరు ఆమోదించకపోయినా మెజారిటీ అంగీకరించారు. 1917 నవంబరు ఏడున రష్యన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ ఏర్పడితే, స్వయం నిర్ణయాధికార అవకాశాన్ని వినియోగించుకొని అంతకుముందు స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ఫిన్లండ్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంటే లెనిన్‌ ఆమోదించాల్సి వచ్చింది. తరువాత కూడా అలాంటి అవకాశం కల్పించినా మరొకటేదీ విడిపోలేదు. స్టాలిన్‌ కాలం నుంచి అనుసరించిన ఆధిపత్య విధానాలు 1991లో వేరుపడిపోవటానికి ఒక ముఖ్యకారణం అని రంగనాయకమ్మ చేసిన సూత్రీకరణకు స్టాలిన్‌ పట్ల గుడ్డి వ్యతిరేకత తప్ప తర్కబద్ధత కనిపించదు. ఆమెతో సహా కొందరు చెప్పే స్టాలిన్‌ ఆధిపత్యానికి తలొగ్గి రిపబ్లిక్కులు విధిలేక కలసి ఉన్నాయనుకుందాం. స్టాలిన్‌ 1953లో మరణించిన తరువాత స్వయం నిర్ణయాధికార కాంక్ష లేదా డిమాండ్‌ ఎందుకు ఎక్కడి నుంచీ తలెత్తలేదు. రిపబ్లిక్కులకు అసమాన అధికారాలు ఉంటే సమస్య తలెత్తి ఉండేది. లెనిన్‌ వ్యతిరేకించిన లేదా స్టాలిన్‌ అమలుపరచిన విధానాలు అనే పద ప్రయోగాలు తప్పే. అవేవీ ఏకపక్షమైనవి కాదు. తప్పయినా ఒప్పయినా పార్టీ తీసుకున్న వైఖరిని అమలు చేశారు. 


‘ఉక్రెయిన్‌ ముందుగా దాడి చేయనపుడు రష్యాకు ఆత్మరక్షణ ప్రశ్న ఏమిటి’ అని రంగనాయకమ్మ అడుగుతున్నారు. అసలు రష్యా ఆ మాట ఎక్కడ చెప్పింది? చెప్పలేదు, కనుక ఇతరులు చెప్పినదాన్ని ప్రమాణంగా తీసుకోవటం ఏమిటి? ‘ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత... అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీలతో సంబంధాలు పెట్టుకుంది’ అన్నారు. ఇది వాస్తవ విరుద్ధం. ఒక స్వతంత్ర దేశంగా ప్రతి దేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటం వేరు, ఒక దేశం లేదా కూటమికి వ్యతిరేకంగా మరో కూటమి వైపు మొగ్గి ఇతర సంబంధాలు పెట్టుకోవటం వేరు. 2013లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ ఐరోపా యూనియన్‌తో ఆర్థిక అనుసంధాన ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. తొలుత ఆర్థికం పేరుతో సంబంధాలు, తరువాత నాటోలో చేర్చుకోవటం, తద్వారా రష్యా ముంగిటకు తమ సేనలను చేర్చటం... ఇదీ అమెరికా పథకం. దానికి ఎదురుదెబ్బ తగలటంతో సీఐఏ రంగంలోకి దిగి ప్రతిపక్ష పార్టీలతో ప్రదర్శనలు చేయించి తిరుగుబాటును రెచ్చగొట్టింది. ఎన్‍కోవిచ్‌ రష్యాలో తలదాచుకున్నాడు. తరువాత ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. అసలు సమస్య ఇక్కడి నుంచే ప్రారంభం కాగా, స్వతంత్రదేశంగా ఏర్పడిన వెంటనే అమెరికా తదితర దేశాలతో ఉక్రెయిన్ సంబంధాలు పెట్టుకున్నదని రాయటం వక్రీకరణ.


‘రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నుంచీ ప్రపంచం మీద పెత్తనం చేసే విషయంలో అమెరికాకి రష్యా ప్రధాన పోటీదారు. అందుకే అమెరికా, రష్యాలను అగ్రరాజ్యాలు అంటారు ఇతర దేశాల వారు. అసలు అనవలసింది రెండూ పెద్ద బందిపోటు ముఠాలు అని...’. ఈ వాక్యం రంగనాయకమ్మ వంటి సీనియర్‌ కలం నుంచి వెలువడటం ఆశ్చర్యంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ఉంది. దానిలో రష్యాతో సహా 15 రిపబ్లిక్కులు ఉన్నాయి. 1991 వరకు అదే కొనసాగింది. సోవియట్‌ ప్రపంచ పెత్తనం కోసం చూసిందని అమెరికా కూటమి చేసిన ప్రచారాన్ని రంగనాయకమ్మ కూడా వంటపట్టించుకున్నారా? మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తరువాత ఆమె అంతకుముందు చేసిన రచనల్లో కొన్ని పదాలను సవరించారు. కానీ సోవియట్‌ గురించి పూర్వపు వైఖరితోనే ఉన్నట్లున్నారు. లేకపోతే అమెరికాతో జతగట్టి రెండూ ఒకటే అనటం ఏమిటి? అమెరికా పెత్తనానికి, దుర్మార్గాలకు బలైన కొరియా, వియత్నాం, ఇరాక్‌, లిబియా, సిరియా వంటి ఉదంతాలున్నాయి. అటువంటి చరిత్ర సోవియట్‌‌కు గానీ, తరువాత రష్యాకు గానీ ఉందా?


శ్రామికవర్గ దృక్పథం కలిగినవారు యుద్ధం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి అని ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ చెప్పిన అంశాలు నిజానికి ఆ దృక్పథాన్ని ప్రతిబింబించలేదు. రష్యా పెట్టుబడిదారీ దేశమే, కానీ అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు. అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా రష్యా ఈ ప్రత్యేక సైనిక చర్యకు పూనుకుంది. ప్రపంచాధిపత్యం కోసం పూనుకున్న అమెరికా కుట్రలను ఎదిరించేందుకు ఒక పెట్టుబడిదారీ దేశంగా రష్యా లేదా మరొకటి ముందుకు వస్తే శ్రామికవర్గ దృక్పథం కలిగిన వారు దానిని బలపరచాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీతో లెనిన్‌ బ్రెస్ట్‌–లిటోవస్క్‌ సంధి కుదుర్చుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో స్టాలిన్‌ ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోంది. కనుక దాన్ని ఎదుర్కొనేవారిని బలపరచాలి. వర్తమాన ఉదంతంలో ఐక్యరాజ్యసమితిలో చైనా తటస్థ వైఖరిని తీసుకుంది. అదే సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు, గోధుమల వంటి వాటిని దిగుమతి చేసుకుంది. రంగనాయకమ్మ వర్ణించినట్లు ‘ఒక బందిపోటు’ను చైనా సమర్థిస్తున్నట్లుగా అనుకోవాలా, అమెరికాతో పోరాడే శక్తికి తోడ్పాటు ఇస్తున్నట్లుగా భావించాలా? అమెరికా ‘బందిపోటు’తో 50ఏళ్ళ క్రితం సోషలిస్టు చైనా ఒప్పందం చేసుకొని, దానిలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించింది. దాని వలన చైనా శ్రామికులకు మేలు జరిగిందా కీడు జరిగిందా? అదే విధంగా రష్యాతోనూ చైనా ఒప్పందాలు, సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీని అర్థం రెండు పెద్ద బందిపోటు దేశాలతో చైనా చేతులు కలిపినట్లా? తన ప్రధాన పోటీదారైన అమెరికా అడుగుజాడల్లో ఉక్రెయిన్ నడుస్తోందనే కారణంతోనే రష్యా దానిపై దురాక్రమణకు పాల్పడిందని రంగనాయకమ్మ చెప్పారు. తన వర్గం ఏదో మరచిపోయి ఒక ఫ్యాక్టరీ కార్మికుడు యజమానులకు కొమ్ముకాస్తే పర్యవసానాలను అనుభవించక తప్పదు. అదే ఇక్కడా వర్తిస్తుంది.


ఎం. కోటేశ్వరరావు

Updated Date - 2022-03-12T07:08:25+05:30 IST