నియంత పక్షాన నిలిచిన పాపం!

ABN , First Publish Date - 2022-07-30T08:09:35+05:30 IST

ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా యుద్ధట్యాంకులు చొరబడి, ఉక్రెయిన్ పల్లెలూ పట్టణాలను రష్యా యుద్ధవిమానాలు నేలమట్టం చేయడం ఆరంభించి ఐదునెలలు గడిచాయి.

నియంత పక్షాన నిలిచిన పాపం!

ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా యుద్ధట్యాంకులు చొరబడి, ఉక్రెయిన్ పల్లెలూ పట్టణాలను రష్యా యుద్ధవిమానాలు నేలమట్టం చేయడం ఆరంభించి ఐదునెలలు గడిచాయి. ఇది ఒక భయానక యుద్ధం, మానవ విషాదం. ఈ రక్తపాతంలో 20వేల మంది రష్యన్ సైనికులు మరణించారు. ఉక్రెయిన్ సైనికదుస్తుల్లో కన్నుమూసిన వారు ఇంతకు రెండురెట్లుంటారు. అన్యాయంగా చనిపోయిన పౌరుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. లక్షలాదిమంది ఉక్రెనియన్లు మాతృభూమిని విడిచి, గత్యంతరం లేక ఇతరదేశాలకు కట్టుబట్టలతో వలసపోయారు. ఉక్రెయిన్ సర్వనాశనమైపోయింది. ధ్వంసమైన దేశాన్ని పునర్ నిర్మించడం దాదాపు అసాధ్యం. యుద్ధం ముగిసినా కూడా, దానిని గతకాలపు స్థితికి తీసుకుపోవడానికి దశాబ్దాలు పడుతుంది. మరొకవైపు రష్యన్ల జీవితాలు కూడా అతలాకుతలమైపోయాయి. పశ్చిమదేశాల ఆంక్షలవల్ల, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న ఈ యుద్ధంతో వచ్చిన ఆర్థిక ఉపద్రవం వల్ల రష్యన్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు.


ఒక మనిషిగా, ఈ విస్తృత మానవసమాజంలో ఒకడిగా ఈ బీభత్సం నన్ను కుదిపేస్తున్నది. పట్టణాలను తుడిచిపెట్టేయడం, ఆస్పత్రులు, జనావాసాలు అన్న విచక్షణ లేకుండా బాంబులు కురిపించడం, ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేయడం ద్వారా రష్యన్ సైన్యం తీవ్ర రాక్షసత్వాన్ని కనబరుస్తున్నది. ఇదంతా చూస్తున్నప్పుడు ఒక భారతీయుడిగా మన ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని ఖండించకపోవడం, రష్యా దౌష్ట్యాలను ప్రశ్నించకపోవడం నన్ను నిర్ఘాంతపరుస్తున్నాయి.


ఫిబ్రవరిలో ఈ యుద్ధం ఆరంభమై, మార్చినెలంతా కొనసాగుతున్నప్పుడు కూడా భారతదేశం వేచిచూసే ధోరణితోనే వ్యవహరించింది. ఈ విధ్వంసం ఎంత కాలం కొనసాగుతుందనే విషయంలో అప్పటికి స్పష్టత లేదు. త్వరలో ముగిసిపోవచ్చుననే భ్రమలుకూడా అప్పట్లో ఉండేవి. కానీ, మార్చిదాటి ఏప్రిల్, ఏప్రిల్ కూడా గడిచి మే నెల ప్రవేశిస్తున్నకొద్దీ రష్యా దమనకాండ మరింత పెరిగింది, వినాశనం హెచ్చింది. ఈ దశలో కూడా మనం తటస్థత పేరిట మౌనంగా ఉండటం సబబేనా? పశ్చిమదేశాల దుర్నీతి కారణంగానే ఈ యుద్ధం మొదలైందన్న వాదన సరైనది కాదు. నాటోలో చేరకుండా ఉక్రెయిన్‌ను నిలువరించడానికే పుతిన్ ఈ యుద్ధం చేశాడన్న వాదనలో ఎంత డొల్లతనం ఉన్నదో ఈ బీభత్సం చూస్తున్నవారికి ఈ పాటికే తెలిసొచ్చి ఉండాలి. తన అభీష్ఠానికి వ్యతిరేకంగా స్వతంత్రంగా నిలిచినందుకు, తనకు లొంగిరానందుకు ఉక్రెనియన్లకు ఆయన తీవ్ర రక్తపాతంతో బలమైన గుణపాఠం చెప్పదల్చుకున్నాడు. రష్యా అధ్యక్షుడు తనను తాను మధ్యయుగాలనాటి చక్రవర్తుల ఈ కాలపు అవతారంగా భావించుకుంటున్నాడు. రష్యా చుట్టుపక్కల దేశాలన్నింటినీ ఏకం చేసి, వాటిని అతిశక్తివంతమైన ఓ చక్రవర్తిలాగా ఏలాలని కోరుకుంటున్నాడు. ఈ కలని నిజం చేయడానికి ఆయనా, ఆయన సైన్యమూ ఎంతకైనా తెగిస్తున్నారు. ఉక్రెనియన్లనే కాదు, రష్యన్లను కూడా బలిపెట్టడానికి సిద్ధపడుతున్నారు.


పుతిన్ వైఖరిని తెలియచెప్పే ఒక్క ఉదాహరణ చూడండి. ఉక్రెయిన్ ఓడరేవుల్లో నిలిచిపోయిన కోట్లాది టన్నుల గోధుమలను ఎగుమతిచేసేందుకు వీలుగా ఇటీవల అంతర్జాతీయ వేదికల మధ్యవర్తిత్వం నడుమ, కొన్ని దేశాల చొరవతో ఓ అవగాహన కుదిరింది. యావత్ ప్రపంచానికీ ఉపకరించే నిర్ణయం ఇది. ఎగుమతులకు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ఉక్రెయిన్, రష్యాలు అంగీకరించి సంతకాలు చేశాయి. కానీ, సంతకం చేసిన వెంటనే పుతిన్ యుద్ధవిమానాలు ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ఓడరేవుమీద బాంబుల వర్షం కురిపించి దానిని నాశనం చేశాయి.


ఉక్రెనియన్లు మారుపేరుతో ఉన్న రష్యన్లేననీ, అందువల్ల వారిని మాతృభూమితో కలపాలని పుతిన్ నమ్ముతున్నాడు. వారిని నాశనం చేసైనా సరే ఆ లక్ష్యం నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాడు. కానీ, ఈ ఐదునెలల కాలంలో ఉక్రెనియన్ల జాతీయతాస్ఫూర్తి ఎంత బలమైనదో కొట్టొచ్చినట్టు కనిపించింది. తమను తాము రష్యన్లకు పూర్తి భిన్నమైన, ప్రత్యేకమైన, స్వతంత్ర సమూహంగా ఉక్రెనియన్లు భావిస్తున్నారు. తమ గుర్తింపును నిలబెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగా ప్రాణాలు కోల్పోవడానికి కూడా వారు వెనుకాడటం లేదు. రష్యా చొరబాటుకు ముందు ఉక్రెనియన్లలో ఎక్కువమంది రష్యాతో తమకుగల సాన్నిహిత్యాన్ని, సాంస్కృతిక బంధుత్వాన్ని గుర్తుచేసుకోవడానికి, అవసరమైతే గట్టిగా చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహించలేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అత్యధికులు, చివరకు రష్యన్ భాష మాట్లాడే ఉక్రెనియన్లు కూడా రష్యాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానితో కలిసే ఊసు ఎత్తితే మండిపడుతున్నారు.


జాతీయత విషయంలో ఉక్రెనియన్లు కనబరుస్తున్న ఈ అపారమైన ప్రేమ చూసినప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు తిరగబడిన ఘట్టం గుర్తుకు వస్తుంది. దానితో పాటు, అప్పట్లో భారతదేశం నిర్వహించిన  పాత్ర కూడా జ్ఞప్తికి వస్తుంది. సామ్రాజ్యవాద శక్తులతో వందల ఏళ్లు పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకున్న దేశంగా మనం వెనువెంటనే వియత్నాం ప్రజల ఆకాంక్షలు గుర్తించి, గౌరవించాం. అమెరికా దౌష్ట్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారి పక్షం వహించాం. 1960లలో మనం తీవ్ర దుర్భిక్షంలో ఉంటూ, అమెరికా ఆర్థిక, సైనిక కటాక్షం మీద పూర్తిగా ఆధారపడివున్న స్థితిలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. వియత్నాంలో అమెరికా దుశ్చర్య నైతికంగానూ, రాజకీయంగానూ సరికాదని ఎత్తిచూపడానికి మనం అప్పుడు ఏమాత్రం సంశయించలేదు.


మరొక సమీపగతాన్ని కూడా ఇక్కడ గుర్తుచేసుకోవాలి. 1970లలో అప్పటి పశ్చిమపాకిస్తాన్ తనను ఆర్థికంగా దోచేస్తూ, అణచివేస్తూ, వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నందుకు తూర్పు పాకిస్థాన్ నిత్యం రగులుతూండేది. తూర్పు పాకిస్థాన్‌లోని బెంగాలీ జాతీయవాదం తమపైన బలవంతంగా రుద్దుతున్న ఇస్లామిక్ గుర్తింపును భరించలేకపోయింది. తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనీ, అందుకు తమకంటూ ఓ స్వతంత్రదేశం కావాలనీ తూర్పు పాకిస్థాన్ ప్రజలు కోరుకున్నారు. కానీ, ఇస్లామాబాద్ సైనికపాలకులు ఈ తూర్పు బెంగాలీలు పాకిస్థానీయులే తప్ప, మరొకటి కాబోరనీ, అయ్యేందుకు వీల్లేదనీ నమ్మారు. బెంగాలీల ఆకాంక్షలను తొక్కేస్తూ, తిరుగుబాట్లను తీవ్రంగా అణచివేయడంద్వారా తమ వాదన నిజం చేయగలమని భ్రమపడ్డారు. కానీ, అంతిమంగా భారతదేశం జోక్యం చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడి, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.


పాకిస్థానీయులకు బంగ్లాదేశీలు ఎవరో, రష్యన్లకు ఉక్రెనియన్లు అంత. ఒక స్వతంత్ర జాతీయతా భావం ఉన్నవారు తమకంటే మరింత శక్తిమంతమైనవారు మనమంతా చారిత్రకంగా, సాంస్కృతికంగా ఒక్కటేనన్న అసత్యవాదనలతో ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎంతమాత్రం సహించలేరు. బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ దుశ్చర్యలను నిలువరించడం, శరణార్థులుగా వచ్చిన లక్షలాదిమందికి ఆశ్రయం కల్పించడం, అవసరమైన దశలో పరిమిత సైనికశక్తిని ప్రయోగించి విముక్తి ప్రసాదించడం భారతదేశం తీసుకున్న సరైన, సవ్యమైన చర్యలు. ఉక్రెయిన్ విషయంలో మనం ఈ రకంగా సాయపడటం సాధ్యం కానేకాదు. కానీ, ఏకంగా రష్యా దురాక్రమణనే ప్రశ్నించకపోవడం, గట్టిగా ఖండించకపోవడం, వ్యూహాత్మకం ముసుగులో మౌనంగా ఉండటం సరైనదేనా? పుతిన్, ఆయన సైనికులు ఉక్రెయిన్‌లో పాల్పడుతున్న ఘోరకలిలో మనమూ పరోక్ష భాగస్వాములం కావడం సబబేనా?


ఉక్రెయిన్ పరిణమాల పట్ల భారతప్రభుత్వం ఇంత నిస్తే జంగా వ్యవహరించడానికి కారణాలు ఏమై ఉంటాయన్నదీ ఊహించవచ్చు. ఆయుధాలకోసం మనం రష్యా మీద ఆధారపడివున్నాం. దాని చమురు కూడా అవసరమే. ఉక్రెయిన్లకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉందనీ, ఒక స్వతంత్రదేశంగా ఉండే హక్కు ఉందనీ మనం గట్టిగా చెబితే, మరి కశ్మీరీల మాటేమిటి, నాగాల సంగతేమిటని ఎవరైనా వెలెత్తిచూపవచ్చునని అధికారపక్ష సిద్ధాంతకర్తలు భయపడ్డారేమో. చమురు దిగుమతులను వికేంద్రీకరించి, తద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోగలిగితే తమను ఎవరూ ప్రశ్నించరనీ, సామాజిక అశాంతి ఉండదనీ పాలకులు అనుకొని ఉంటారు. 


ఉక్రెయిన్ విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నైతికంగానే కాదు, రాజకీయంగానూ సరైనది కాదు. ఒకపక్క రష్యానుంచి భారీగా గ్యాస్ దిగుమతి చేసుకుంటూనే, కాస్తంత చమురుకొనుక్కుంటున్న భారత్‌ను పాశ్చాత్యదేశాలు తప్పుబడుతున్నాయంటూ మన విదేశాంగమంత్రి ఆ దేశాల కపటత్వాన్ని నిలదీశారు. పాశ్చాత్యదేశాల కాపట్యం కొత్తేమీకాదు, అదేమీ బ్రేకింగ్ న్యూస్ కాదు. కానీ, మన కాపట్యం మాటేమిటి? వచ్చేనెలలో మనదేశం బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలననుంచి విముక్తమై డెబ్బై ఐదేళ్ళు అయిన వేడుకను జరుపుకుంటోంది. మోదీ ప్రభుత్వం ఆజాదీకా అమృతోత్సవాన్ని ఘనంగా జరపబోతున్నది. మీడియాలో ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ, ఈ ఘన స్వాతంత్ర్యవేడుకల సందర్భంలో భారత ప్రభుత్వం గతంలో తాను పోరాడిన సామ్రాజ్యవాదం ఉనికిని ఉక్రెయిన్‌లో గుర్తించ నిరాకరిస్తోంది. ఆర్థికంగా, సైనికంగా, వైశాల్యం రీత్యా, జనాభారీత్యా అతిపెద్దదైన భారతదేశం అంతర్జాతీయ యవనికపై కీలకంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. పుతిన్ చర్యలను, దుర్మార్గాలను చైనా తన భుజాన ఎత్తుకొని మోస్తున్నప్పుడు, మన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరిస్తూ, పుతిన్ మీద ఒత్తిడి తెచ్చివుంటే బాగుండేది. భారతదేశం నైతికంగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చి ఉంటే, రష్యా కచ్చితంగా ఈ పాటికే చర్చలకు దిగివచ్చేది. మనం బాధితుల పక్షాన ఉండివుంటే, ఒక మారణహోమం ఇప్పటికే ఆగిపోయి ఉండేది. ప్రపంచపటంలో మన స్థానం హెచ్చేది, అంతర్జాతీయంగా మన గౌరవప్రతిష్ఠలు ఇనుమడించేవి.



రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2022-07-30T08:09:35+05:30 IST