అంతరిక్ష రోదసీ కేంద్రం కూలిపోతుంది : రష్యా హెచ్చరిక

ABN , First Publish Date - 2022-03-12T21:30:22+05:30 IST

రష్యాపై పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల వల్ల అంతరిక్ష

అంతరిక్ష రోదసీ కేంద్రం కూలిపోతుంది : రష్యా హెచ్చరిక

మాస్కో : రష్యాపై పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల వల్ల అంతరిక్ష రోదసీ కేంద్రం (ఐఎస్ఎస్) కూలిపోయే అవకాశం ఉందని ఆ దేశ అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ హెచ్చరించింది. ఐఎస్ఎస్‌కు సర్వీసింగ్ చేసే రష్యన్ రోదసీ నౌక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని, అందువల్ల కఠినమైన ఆంక్షలను ఉపసంహరించాలని కోరింది. 


ఐఎస్ఎస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సామాజిక మాధ్యమాల్లో రాసిన వ్యాసంలో, రష్యాపై అమలవుతున్న ఆంక్షల్లో కొన్ని ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముందు నుంచి అమలవుతున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షల వల్ల ఐఎస్ఎస్‌కు సర్వీసింగ్ చేసే రష్యన్ రోదసీ నౌక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని చెప్పారు.  ఈ కేంద్రంలోని రష్యన్ సెగ్మెంట్‌పై ప్రభావం పడుతుందన్నారు. కక్ష్యను సరిదిద్దడానికి ఈ రష్యన్ సెగ్మెంట్ దోహదపడుతుందన్నారు. ఫలితంగా 500 టన్నుల బరువైన నిర్మాణం సముద్రంలో కానీ, భూమిపై కానీ పడిపోతుందన్నారు. ఈ కేంద్రం కక్ష్యను సంవత్సరానికి సగటున 11సార్లు ఈ రష్యన్ సెగ్మెంట్ సరిదిద్దుతుందన్నారు. అంతరిక్షంలో శిథిలాలను నిరోధించడానికి కూడా దోహదపడుతుందని చెప్పారు. 


ఐఎస్ఎస్ రష్యాలో పడిపోయే అవకాశం లేదని మ్యాపులను ప్రదర్శిస్తూ తెలిపారు. యుద్ధంతో వినాశనానికి కారణమయ్యేవారి నేతృత్వంలోని దేశాలవారు అర్థం చేసుకోవాలన్నారు. రాస్‌కాస్మోస్‌పై ఆంక్షల వల్ల జరగబోయే నష్టాన్ని తెలుసుకోవాలని కోరారు. ఆంక్షలు విధిస్తున్నవారు పిచ్చివాళ్లని మండిపడ్డారు. 


రోగోజిన్ గత నెలలో కూడా ఈ విధంగానే హెచ్చరించారు. ఐఎస్ఎస్ భూమిపైకి కూలిపోతుందని హెచ్చరించారు. రష్యాపై విధిస్తున్న ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే మార్చి 1న NASA స్పందిస్తూ, రష్యా సహాయం లేకుండానే ఐఎస్ఎస్‌ను కక్ష్యలో సక్రమంగా ఉంచడానికి ఓ పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2022-03-12T21:30:22+05:30 IST