ఉక్రెయిన్‌లో రష్యా బీభత్సం

ABN , First Publish Date - 2022-10-02T09:19:40+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లో నాలుగు కీలక రీజియన్లు జాపొరోజియా, ఖెర్సోన్‌, డోనెట్స్క్‌, లుహాన్స్క్‌లను విలీనం చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం ప్రకటించినప్పటి నుంచి ఈ దాడులు తీవ్రతరమయ్యాయి.

ఉక్రెయిన్‌లో రష్యా బీభత్సం

54 మంది పౌరుల దుర్మరణం


ఖార్కివ్‌లో సురక్షిత ప్రాంతాలకు

వెళ్తున్న వారిపై బాంబింగ్‌

అక్కడ 20 మంది మృత్యువాత

జాపొరోజియాలో 30 మంది..

డోనెట్స్క్‌లో నలుగురి మృతి

మైకొలైవ్‌లో సూసైడ్‌ డ్రోన్లు..

లైమన్‌లో బందీగా 

5 వేల మంది రష్యా సైనికులు!

అక్కడి నుంచి వెనుదిరిగిన రష్యా

రష్యా ఆక్రమణపై 

భద్రతా మండలిలో ఓటింగ్‌

భారత్‌ సహా 4 దేశాలు దూరం


కీవ్‌, అక్టోబరు 1: ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లో నాలుగు కీలక రీజియన్లు జాపొరోజియా, ఖెర్సోన్‌, డోనెట్స్క్‌, లుహాన్స్క్‌లను విలీనం చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుక్రవారం ప్రకటించినప్పటి నుంచి ఈ దాడులు తీవ్రతరమయ్యాయి. ఖార్కివ్‌లో శనివారం సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న పౌరులపై రష్యా షెల్లింగ్‌తో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 20 మంది పౌరులు మృతిచెందినట్లు ఖార్కివ్‌ గవర్నర్‌ ఓలె సినీహుబోవ్‌ వెల్లడించారు. ‘‘ఖార్కివ్‌లోని కుపిన్‌స్కీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మృతుల్లో 10 మంది చిన్నారులు ఉన్నారని ఆయన వివరించారు. శుక్రవారం జాపొరోజియా రాజధానిపై జరిపిన దాడుల్లో 30 మంది మరణించారని, మరో 88 మంది గాయపడ్డారని బ్రిటిష్‌ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డోనెట్స్క్‌ రీజియన్‌లోని బాఖ్‌మట్‌, స్వీయటోహిల్స్క్‌ ప్రాంతాలపైనా రష్యా దళాలు వరుసగా దాడులు జరిపాయని ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో నలుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారని, జనావాస ప్రాంతాల్లో 12 భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. మైకొలైవ్‌లో సూసైడ్‌ డ్రోన్‌ (ఎ్‌స-300)లతో జరిపిన దాడుల్లో మూడు నెలల చిన్నారి సహా.. ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారని వివరించారు. అంతకు ముందు ఈ ప్రాంతంలో ఇరాన్‌ షహీద్‌-136 కమికేజ్‌ క్షిపణులతో రష్యా దాడులు జరిగినట్లు తెలిపారు.


అణు విద్యుత్తు కేంద్ర డీజీ అపహరణ

ఐరోపాలోనే అతిపెద్దదైన జాపొరోజియా అణు విద్యుత్తు కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ ఇహోర్‌ మురాషోవ్‌ను రష్యా దళాలు అపహరించినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. శుక్రవారం మురాషోవ్‌ కారును అడ్డగించిన రష్యా సేనలు.. ఆయన కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ ప్లాంట్‌పై గతంలో జరిగిన వరుస దాడుల కారణంగా ముప్పు పొంచి ఉండడంతో.. గత నెలలో విద్యుదుత్పత్తిని నిలిపివేసి.. రియాక్టర్ల కూలింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. కాగా, ఉక్రెయిన్‌లోని నాలుగు రీజియన్లను రష్యా విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించడానికి వ్యతిరేకంగా భద్రత మండలిలో ఓటింగ్‌ జరిగింది. అమెరికా, అల్బేనియాలు ప్రవేశపెట్టిన ముసాయిదాకు అనుకూలంగా 10 దేశాలు ఓటు వేయగా భారత్‌, చైనా, గాబోన్‌, బ్రెజిల్‌ దూరంగా ఉన్నాయి. శాశ్వత సభ్య దేశం రష్యా వీటోను వినియోగించంతో అది వీగిపోయింది. భారత శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్‌  మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో పౌరుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు కాల్పులను విరమించాలని, చర్చల ద్వారా విభేదాలు, వివాదాలను పరిష్కరించుకోవాలని కోరారు. 

అమెరికాపై పుతిన్‌ ఫైర్‌

పాశ్చాత్య దేశాలు, అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తాయంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విరుచుకుపడ్డారు. పాశ్చాత్య దేశాలు వలసపాలనలతో భారత్‌, దక్షిణాఫ్రికాను దోచుకున్నాయని మండిపడ్డారు. ‘‘బానిస వ్యాపారాలు చేసిన చరిత్ర అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఉంది. భారత్‌లో నరమేధానికి పాల్పడ్డాయి. అణు, రసాయన ఆయుధాల విషయంలోనూ కల్లబొల్లి నిబంధనలతో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తూ.. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. అణ్వాయుధాలను రెండు సార్లు వినియోగించిన ఏకైక దేశం అమెరికా. హిరోషిమా, నాగసాకి నగరాలను ధ్వంసం చేసింది. కొరియా, వియత్నాంపైనా రసాయన ఆయుధాలను వినియోగించింది’’ అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


లైమన్‌ను స్వాధీనం చేసుకున్నాం: జెలెన్‌స్కీ

లైమన్‌ నగరాన్ని తిరిగి కైవసం చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. 5 వేల మంది రష్యా సైనికులను తమ దళాలు చుట్టుముట్టాయన్నారు. అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. తమ దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా కూడా ప్రకటించించడం గమానార్హం.

Updated Date - 2022-10-02T09:19:40+05:30 IST