జెలెన్‌స్కీ ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం లేదు : రష్యా

ABN , First Publish Date - 2022-03-09T23:29:36+05:30 IST

వోలోడిమిర్ జెలెన్‌స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని

జెలెన్‌స్కీ ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం లేదు : రష్యా

మాస్కో : వోలోడిమిర్ జెలెన్‌స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నించడం లేదని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా బుధవారం చెప్పారు. అమెరికా సహకారంతో ఉక్రెయిన్‌లో జీవాయుధాలను తయారు చేస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వారానికోసారి జరిగే మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 


అమెరికా రాజకీయ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ విక్టోరియా నూలాండ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని మారియా జఖరోవా ప్రస్తావించారు. బయలాజికల్ రీసెర్చ్ కోసం ప్రయోగశాలలు ఉక్రెయిన్‌లో ఉన్నాయని నూలాండ్ ధ్రువీకరించారని చెప్పారు. శాంతియుతంగా ఉపయోగించడం గురించి కానీ, శాస్త్రీయ లక్ష్యాల గురించి కానీ తాను మాట్లాడటం లేదన్నారు. ఈ కార్యక్రమాలకు అమెరికా రక్షణ శాఖ నిధులను సమకూర్చుతోందని చెప్పారు. వీటి గురించి ప్రపంచానికి అమెరికా రక్షణ శాఖ, అమెరికా అధ్యక్ష పరిపాలనా యంత్రాంగం అధికారికంగా వివరించాలని డిమాండ్ చేశారు. వివరాలను తెలియజేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ప్రపంచం ఎదురు చూస్తోందని తెలిపారు. ఇదిలావుండగా, జీవాయుధాలను తయారు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఉక్రెయిన్, అమెరికా ఖండించాయి. 


ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సాధారణ ప్రజలపై రష్యా దాడులు చేస్తోందని జరుగుతున్న ప్రచారాన్ని మారియా జఖరోవ్ ఖండించారు. తాము సామాన్యులపై దాడులు చేయడం లేదని, ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం రష్యా సైన్యం లక్ష్యం కాదని చెప్పారు. ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదాను నాశనం చేయాలని తాము కోరుకోవడం లేదని తెలిపారు. ఆ దేశాన్ని డీ-నాజిఫై చేయాలని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. 


ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు ఉక్రెయిన్ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందన్నారు. మానవతావాద కారిడార్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు కీవ్ అధికారులు చేరనివ్వడం లేదని ఆరోపించారు. ఉక్రెయిన్‌తో మూడు విడతల్లో జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని తెలిపారు. 


Updated Date - 2022-03-09T23:29:36+05:30 IST