
కీవ్ : నేటి రష్యా చమురులో ఉక్రెయిన్ రక్తపు వాసన ఉందని, దానిని కొనవద్దని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. SWIFT నుంచి రష్యన్ బ్యాంకులను నిషేధించాలని కోరింది. యూరోపియన్ నౌకాశ్రయాలకు రష్యన్ నౌకలను అనుమతించరాదని, క్రిప్టోకరెన్సీకి రష్యాకు యాక్సెస్ ఇవ్వకూడదని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆదివారం టెలివైజ్డ్ మెసేజ్‌లో ఈ విజ్ఞప్తి చేశారు.
యోధులైన ఉక్రెయిన్ ప్రజలు ప్రపంచానికి చాలా సరళమైన సందేశాన్ని ఇస్తున్నారని తెలిపారు. ‘‘రష్యన్లూ ఇంటికెళ్ళిపోండి. మీరు విదేశీ గడ్డపై ఉన్నారు. ఇక్కడ మీ అవసరం ఎవరికీ లేదు. మిమ్మల్ని పువ్వులతో స్వాగతించేవారెవరూ ఇక్కడ లేరు. ఉక్రెయిన్ను వదిలిపెట్టు పుతిన్’’ అని కోరుతున్నారని చెప్పారు.
ఈ యుద్ధంలో రష్యా గెలవబోదన్నారు. రష్యన్లను కాపాడుకోవలసిన, ఈ రక్తపాతాన్ని ఆపవలసిన సమయమిదని చెప్పారు. ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల భద్రత కోసం రష్యాపై ఒత్తిడిని పెంచాలన్నారు. ఉక్రెయిన్ రక్తపు వాసన వస్తున్న రష్యా చమురును కొనడమంటే, రష్యా యుద్ధ నేరాలకు ఆర్థిక వనరులను సమకూర్చడమేనన్నారు.
రష్యా నుంచి బహుళ జాతి కంపెనీలు వలసపోతున్నాయన్నారు. 113 ఎంఎన్‌సీలు రష్యాతో లేదా రష్యాలో కార్యకలాపాలను నిలిపేశాయని చెప్పారు. ఆ కంపెనీల నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, ప్రశంసిస్తున్నానని చెప్పారు. రష్యాతోనూ, రష్యన్ భాగస్వాములతోనూ తమ వ్యాపార లావాదేవీలను నిలిపేయాలని అన్ని కంపెనీలను కోరుతున్నానని చెప్పారు.
ఇవి కూడా చదవండి