
న్యూఢిల్లీ : దేశ భద్రత కోసం కమిటీ - కేజీబీ అధికారి స్థాయి నుంచి రష్యా అధ్యక్షుడిగా ఎదిగిన వ్లదిమిర్ పుతిన్ జీవన శైలి అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. 800 చదరపు అడుగుల విస్తీర్ణంగల అపార్ట్మెంట్, ఓ ట్రైలర్, మూడు కార్లు ఉన్నాయని ఆయన అధికారికంగా ప్రకటించినప్పటికీ, ‘ఫార్చూన్’ కథనాల ప్రకారం ఆయన ప్రపంచ సంపన్నుల్లో ఒకరు.
హెర్మిటేజ్ కేపిటల్ మేనేజ్మెంట్ అనే ఇన్వెస్ట్మెంట్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సీఈఓ బిల్ బ్రౌడర్ 2017లో వెల్లడించిన వివరాల ప్రకారం, వ్లదిమిర్ పుతిన్‌కు దాదాపు 200 బిలియన్ డాలర్ల సంపద ఉంది. అత్యంత విలాసవంతమైన కార్లు, గడియారాలను వాడుతూ ఉంటారు. బిల్ బ్రౌడర్ ఈ వివరాలను అమెరికన్ సెనేట్ జ్యుడిషియరీ కమిటీ సమక్షంలో తెలిపారు. బ్రౌడర్ 1990వ దశకంలో రష్యాలో భారీ పెట్టుబడిదారు అనే విషయం గమనార్హం.
అత్యంత విలాసవంతమైన గడియారాలు
‘ఫార్చూన్’ వెల్లడించిన వివరాల ప్రకారం, Patek Philippe తయారు చేసిన 60,000 డాలర్ల విలువైన పెర్పెట్యువల్ కేలండర్ గడియారం, A Lange & Sohne తయారు చేసిన 500,000 డాలర్ల విలువైన Toubograph గడియారాలను ఆయన వాడుతూ ఉంటారు. పదేళ్ళ క్రితం రష్యా ప్రతిపక్షాలు వెల్లడించిన వివరాల ప్రకారం పుతిన్ అధికారిక జీతానికి ఆరు రెట్లు ఎక్కువ విలువైన విలాసవంతమైన గడియారాలు ఆయన వద్ద ఉన్నాయి. వీటి విలువ దాదాపు 7 లక్షల డాలర్లు ఉంటుంది.
సకల హంగులతో భవనం
నల్ల సముద్రాన్ని వీక్షించేందుకు వీలుగా 1,90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతమైన భవనం పుతిన్‌కు ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ భవనంలోని పై కప్పులపై అత్యంత ఆకర్షణీయమైన చిత్ర కళ, పాలరాతి ఈత కొలను, దాని చుట్టూ గ్రీకు దేవతల విగ్రహాలు, స్పా, ఆంఫీథియేటర్, అత్యాధునిక ఐస్ హాకీ రింక్, వేగాస్-స్టైల్ కేసినో, నైట్ క్లబ్, బార్ రూమ్, వందలాది డాలర్ల విలువైన వైన్, స్పిరిట్స్ ఉన్నట్లు అనేక పత్రికలు వెల్లడిస్తున్నాయి. దీనిని ‘పుతిన్ కంట్రీ కాటేజ్’ అని ఆ దేశ ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ప్రతిపక్షాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భవనంలో 5 లక్షల డాలర్ల విలువైన డైనింగ్ రూమ్ ఫర్నిచర్, 54 వేల డాలర్ల విలువైన బార్ టేబుల్, 850 డాలర్ల విలువైన ఇటాలియన్ టాయ్‌లెట్ బ్రష్‌లు, 1,250 డాలర్ల విలువైన టాయ్‌లెట్ పేపర్ హోల్డర్స్ ఉన్నాయి. అయితే ఈ భవనానికి యజమానిని తానేనని ఈ ఏడాది జనవరిలో రష్యన్ ఆలిగార్చ్ ఆర్కడీ రోటెన్బెర్గ్ చెప్పారని బ్రిటిష్ మీడియా తెలిపింది.

బంగారంతో మరుగుదొడ్డి
పుతిన్‌కు ఈ భవనం కాకుండా మరొక 19 ఇళ్ళు, 700 కార్లు, 58 విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయని కూడా కొన్ని సంస్థలు చెప్తున్నాయి. ఈ విమానాల్లో ఒకదానిలో 716 మిలియన్ డాలర్ల వ్యయంతో ‘‘ది ఫ్లయింగ్ క్రెమ్లిన్’’ను నిర్మించారని, దీనిలోని మరుగుదొడ్డిని బంగారంతో తయారు చేశారని తెలుస్తోంది. ఇటలీలో ఆరు అంతస్థులుగల, 140 మీటర్ల పొడవైన సూపర్ యాట్ ఆయనదేనని భావిస్తున్నట్లు ఓ ప్రముఖ పత్రిక తెలిపింది. దీని విలువ దాదాపు 700 మిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపింది. దీనిలో ఓ స్పా, ఈత కొలను, రెండు హెలిప్యాడ్స్, కలపను మండించే ప్రదేశం, తరంగాల ప్రభావాన్ని తగ్గించగలిగే విధంగా డిజైన్ చేసిన పూల్ టేబుల్ ఉన్నాయని పేర్కొంది. ఈ యాట్‌ను స్వాధీనం చేసుకోవాలని ఇటలీని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కోరారు.
ఆంక్షల నుంచి మినహాయింపు
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై యూరోపు, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. పుతిన్‌కు సన్నిహితులపై కూడా ఆంక్షలను అమలు చేస్తున్నప్పటికీ, ఆయనను మాత్రం మినహాయించాయి.
ఇవి కూడా చదవండి