Russia: కంటి చూపు కోల్పోతున్న పుతిన్.. బతికేది మరో మూడేళ్లే: ‘ది ఇండిపెండెంట్’ సంచలన కథనం

ABN , First Publish Date - 2022-05-31T03:04:58+05:30 IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా చక్కర్లు

Russia: కంటి చూపు కోల్పోతున్న పుతిన్.. బతికేది మరో మూడేళ్లే: ‘ది ఇండిపెండెంట్’ సంచలన కథనం

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా చక్కర్లు కొడుతున్న మరో వార్త సంచలనం సృష్టిస్తోంది. పుతిన్ తన కంటి చూపును వేగంగా కోల్పోతున్నారని, ఆయన మరో మూడేళ్లకు మించి బతికే అవకాశం లేదంటూ ‘ది ఇండిపెండెంట్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. పత్రిక తన కథనంలో రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) అధికారి ఒకరిని ఉటంకించింది. ఆయన ఈ విషయాన్ని బ్రిటన్‌లో ఉంటున్న రష్యా మాజీ గూఢచారి బోరిస్ కార్పిచ్‌కోవ్‌కు ఓ మెసేజ్ ద్వారా తెలియజేశారని పత్రిక పేర్కొంది. 


మరోవైపు, పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ ఆదివారం కొట్టిపడేశారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతున్న సూచనలేవీ లేవని స్పష్టం చేశారు. కాగా, పుతిన్ టీవీలో కనిపించిన సమయంలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న కాగితాలపై ఉన్న సందేశాలను చదివి వినిపిస్తున్నారని, ఒక్కో  పేజీలో రెండు లైన్లు మాత్రమే ఉంటున్నాయని ఆస్ట్రేలియన్ మీడియా పేర్కొంది. పుతిన్ దృష్టి కోల్పోయారని చెప్పడానికి ఇంతకుమించిన నిదర్శనం అక్కర్లేదని పేర్కొంది. 69 ఏళ్ల పుతిన్ అవయవాలు నియంత్రణ కోల్పోయి వణుకుతున్నాయని మరికొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. పుతిన్ తన పొత్తికడుపులోని ద్రవాలను తీయించుకోవానికి ఆపరేషన్ చేయించుకున్నారని, అది విజయవంతమైందని ఈ నెల మొదట్లో ‘ఎక్స్‌ప్రెస్’ ఓ కథనంలో పేర్కొంది.


Updated Date - 2022-05-31T03:04:58+05:30 IST