రష్యన్ స్విమ్మర్ ఎవ్‌జెనీ ర్లోవ్‌పై స్విమ్మింగ్ ఫెడరేషన్ నిషేధం

ABN , First Publish Date - 2022-04-22T21:43:57+05:30 IST

మాస్కో : రష్యాకు చెందిన స్విమ్మర్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఎవ్‌జెనీ ర్లోవ్‌ 9 నెలలపాటు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్టు అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఫినా(ఎఫ్ఐఎన్ఏ) ప్రకటించింది.

రష్యన్ స్విమ్మర్ ఎవ్‌జెనీ ర్లోవ్‌పై స్విమ్మింగ్ ఫెడరేషన్ నిషేధం

మాస్కో : రష్యాకు చెందిన స్విమ్మర్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఎవ్‌జెనీ ర్లోవ్‌ 9 నెలలపాటు ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్టు అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఫినా(ఎఫ్ఐఎన్ఏ) ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా మాస్కోలో జరిగిన ర్యాలీలో పాల్గొనడమే ఎవ్‌జెనీ ర్లోవ్‌పై వేటుకు కారణమైంది. కాగా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతుగా గత నెల్లో మాస్కోలోని లుజ్నికీ స్టేడియంలో నిర్వహించిన ర్యాలీలో ఇతర ఒలింపిక్ పతక విజేతలతోపాటు ర్లోవ్ కూడా  పాల్గొన్నాడు. అతడి టీ-షర్ట్‌పై ‘జెడ్’ అనే అక్షరం కనిపించింది. జెడ్ అక్షరం రష్యన్ భాషాపదం కాదు. కానీ ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు మద్దతుగా ఈ సింబల్‌ను వినియోగిస్తున్నారు. ఉక్రెయిన్‌లో రష్యన్ ఆయుధ వాహనాలపై కూడా ఈ సంకేతం కనిపిస్తోంది. అధ్యక్షుడు పుతిన్, రష్యాకు మద్దతు తెలిపిన కారణంగానే నిషేధం విధిస్తున్నట్టు  అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ పేర్కొంది. క్రమశిక్షణా కమిటీ ర్లోవ్‌పై చర్యలు తీసుకుందని వెల్లడించింది.


గతేడాది జరిగిన టొక్యో ఒలింపిక్స్‌లో రష్యన్ స్విమ్మింగ్ టీమ్‌కు ర్లోవ్ ఒక స్టార్‌గా నిలిచాడు. రెండు గోల్డ్ మెడల్స్ సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. బుధవారం నుంచే ర్లోవ్‌పై బ్యాన్ అమల్లోకి వచ్చింది. 2022లో ఎలాంటి క్రీడా ఈవెంట్స్‌లో పాల్గొనడానికి వీల్లేదు. దీంతో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనడానికి అవకాశం లేదు. కాగా రష్యాతోపాటు అనుకూల దేశం బెలారస్‌కు చెందిన ఆటగాళ్లకు ఇదొక హెచ్చరికగా ఉంది. ఇదివరకే హంగేరీలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి రష్యా, బెలారస్‌లపై ఫినా నిషేధం విధించింది. అయితే జూన్, జులై నెలల్లో జరిగే ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. అంతర్జాతీయ ఈవెంట్లను బాయ్‌కాయ్ చేయాలని రష్యా భావిస్తోందని, అందుకే ఆ దేశ క్రీడాకారులను పక్కనబెడుతున్నామని ఫినా పేర్కొంది. అయితే ప్రస్తుతం రష్యా వైఖరి స్పష్టంగా తెలిసిందే.

Updated Date - 2022-04-22T21:43:57+05:30 IST