Vijay Hazare Trophy: మూడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో దుమ్మురేపిన రుతురాజ్

ABN , First Publish Date - 2021-12-11T23:37:34+05:30 IST

ఇండియన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు

Vijay Hazare Trophy: మూడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో దుమ్మురేపిన రుతురాజ్

రాజ్‌కోట్: ఇండియన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ ట్రోఫీలో ముంబైకి సారథ్యం వహిస్తున్న 24 ఏళ్ల రుతురాజ్ రాజ్‌కోట్‌లో ప్రస్తుతం కేరళతో జరుగుతున్న వన్డేలో వరుసగా మూడో సెంచరీ నమోదు చేశాడు.


129 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 124 పరుగులు సాధించాడు. అతడి దెబ్బకు మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన రుతురాజ్.. 46వ ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.


రుతురాజ్ అంతకుముందు మధ్యప్రదేశ్‌తో జరిగిన పోరులోనూ సెంచరీ నమోదు చేశాడు. 112 బంతుల్లో 136 పరుగులు చేశాడు. ఫలితంగా 329 పరుగుల విజయ లక్ష్యాన్ని మహారాష్ట్ర మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


ఆ మ్యాచ్‌లో అతడు 14 బౌండరీలు, 4 సిక్సర్లు బాదాడు. చత్తీస్‌గఢ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ మరింతగా చెలరేగాడు. 143 బంతుల్లో అజేయంగా 154 పరుగులు చేశాడు. ఇందులో 14 బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 276 పరుగుల విజయ లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.


మూడు మ్యాచుల్లో 414 పరుగులు సాధించిన రుతురాజ్ ఈ టోర్నీలో మరో సెంచరీ సాధిస్తే దేశవాళీ వన్డే క్రికెట్‌లో నాలుగు సెంచరీలు సాధించిన బ్యాటర్ల ఎలైట్ జాబితాలో చోటు సంపాదించుకుంటాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, పృథ్వీషా ఉన్నారు. పడిక్కల్ రికార్డు మాత్రం ప్రత్యేకం. అతడు ఒకే సీజన్‌లో వరుసగా నాలుగు సెంచరీలు సాధించాడు. ఉత్తరాఖండ్‌తో రేపు జరిగే మ్యాచ్‌లో రుతురాజ్ మరో సెంచరీ బాదితే పడిక్కల్ సరసన చేరుతాడు. 


కాగా, నేటి మ్యాచ్‌లో కేరళ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. విష్ణు వినోద్ అజేయ సెంచరీతో జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు. 82 బంతులు ఎదుర్కొన్న విష్ణు 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. సిజోమన్ జోసెఫ్ 71 (నాటౌట్) పరుగులు చేశాడు.

Updated Date - 2021-12-11T23:37:34+05:30 IST