దాచాలన్నా దాగదులే..!

Published: Sun, 27 Mar 2022 00:33:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దాచాలన్నా దాగదులే..!చంద్రాల గ్రామంలో హడావుడిగా ఏర్పాటుచేసిన మైక్రో ఫిల్టర్‌

దొంగ పనులు కప్పిపుచ్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల విశ్వప్రయత్నాలు

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో తర్జనభర్జనలు

హైదరాబాద్‌ నుంచి సిబ్బందిని రప్పించి పనులు

పనులు పూర్తికాకపోవడంతో బిల్లుల రద్దు

సహకరించిన జడ్పీ సీఈవో

నాలుగు రోజుల్లో ముగియనున్న 14వ ఆర్థిక సంఘం నిధుల గడువు


పై ఫొటోలు చూశారా..! 14వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులంట ఇవి. ఘనత వహించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు దొంగ బిల్లులు పెట్టింది ఈ పనులకే. 14వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, దొంగ బిల్లుల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి ఉలిక్కిపడిన అధికారులు అప్పటికప్పుడు హైదరాబాద్‌ నుంచి పనివారిని రప్పించి ఈ పనులు చేయించారు. ఒకరోజులో అయ్యే వ్యవహారమా? చివరికి చేతులెత్తేసి జడ్పీ సీఈవోకు చెప్పించి దొంగ బిల్లులు రద్దు చేయించారు.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : సొంత ప్రయోజనాల కోసం 14వ ఆర్థిక సంఘం నిధులను అపహాస్యం పాలు చేశారు ఆర్‌డబ్ల్యూఎస్‌ (రూరల్‌ వాటర్‌ సప్లై అండ్‌ శానిటేషన్‌) అధికారులు. దాదాపు రూ.80 లక్షలను ఎందుకూ పనికిరాకుండా చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రచురించిన ‘ఆర్‌డబ్ల్యూ..ఎస్‌’ కథనంతో బండారం బయట పడేసరికి ఆర్‌డబ్ల్యూఎస్‌, జడ్పీ అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఆ ఐదు గ్రామాల్లో పనులు చేయించేందుకు శనివారం తెల్లవారుజామునే హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని రప్పించారు. సింగలూరు, విన్నకోట, వేమవరంలో పనులు చేయించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, ఎంత శరవేగంగా చేసినా ఒకరోజులో అయ్యే పనా..? ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల్లో 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గడువు ముగుస్తుంది. దీంతో పనులు చేయించటం అసాధ్యమన్న భావనకు వచ్చేశారు. చివరకు పనులు చేయలేమని నిర్ణయానికి వచ్చి పెట్టిన దొంగ బిల్లులు రద్దు చేయాల్సిందిగా జడ్పీ సీఈవోకు ప్రతిపాదిం చారు. ఆయన రద్దు చేసేశారు. దొంగ ఎం-బుక్‌లన్నీ విశ్వసనీయమైన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈకి అప్పగించినట్టు తెలిసింది. 

ఇవేం పనులు? 

హైదరాబాద్‌ నుంచి వచ్చిన సిబ్బందితో సింగలూరు గ్రామంలో హడావుడిగా పనులు చేయిస్తున్నారు. ఎవరూ అటువైపు చూడకుండా కాపలా పెట్టారు. రాకపోకలను అడ్డుకున్నారు. అయితే, సింగలూరు గ్రామంలో జరుగుతున్న హడావుడి పనుల ఫొటోలు ‘ఆంధ్రజ్యోతి’కి చిక్కాయి. విన్నకోటలో వాటర్‌ ట్యాంక్‌ ఆవరణలో మైక్రో ఫిల్టర్‌ ట్యాంకులను పడేసి ఉంచారు. మిగిలిన ప్రక్రియ పూర్తి చేయకుండా అలాగే వదిలేశారు. చంద్రాల గ్రామంలో ఒక ప్లాట్‌ఫాంపై ఫిల్టర్‌ ట్యాంకు లను నిలబెట్టారు. ఎలాంటి పనులు చేపట్ట లేదు. కానీ, పూర్తి చేసేసినట్టుగా బిల్లులు పెట్టారు. వేమవరం, శేరీదగ్గుమిల్లిలో పనులే జరగలేదు. వీటికి కూడా బిల్లులు పెట్టారు. 

నిధుల గోల్‌మాల్‌

ఏటా కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు జిల్లాలవారీగా విడుదల అవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు డబ్బు కేటాయించలేని పరిస్థితుల్లో ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి. కానీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ నిర్లక్ష్యాన్ని కనబరిచింది. దాదాపు రూ.కోటిన్నర మేర బూడిదపాలు చేసింది. మొదట రూ.1.49 కోట్లతో పిలిచిన టెండర్లకు నాలుగు సార్లు స్పందన రాలేదు. దీంతో పనులన్నింటినీ రద్దుచేసి, ఆర్థిక సంఘం నిధులను తగ్గించుకుని రూ.కోటికి వేరే పనులకు టెండర్లు పిలిచారు. నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టేందుకు తెలివిగా ఒక పనిని పదహారు పనులుగా విభజించారు. మైక్రో ఫిల్టర్స్‌ పనులన్నీ కలిపి ఒకటే టెండర్‌ పిలవకుండా గ్రామానికో పనిగా నిర్ణయించారు. ప్రతి పనికీ రూ.5 లక్షల మేర నిర్ణయించారు. అన్ని పనులనూ ఒకే సంస్థకు అప్పగించారు. 

దాచాలన్నా దాగదులే..!విన్నకోటలో బిగించకుండా వదిలేసిన వాటర్‌ ట్యాంకులు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.