అర్ధరాత్రి వరకూ Aryanను ప్రశ్నించిన సిట్ బృందం

ABN , First Publish Date - 2021-11-13T19:51:03+05:30 IST

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను శుక్రవారం రాత్రి పొద్దు..

అర్ధరాత్రి వరకూ Aryanను ప్రశ్నించిన సిట్ బృందం

ముంబై: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను శుక్రవారం రాత్రి పొద్దు పోయేంత వరకూ ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. ముంబై హైకోర్టు విధించిన బెయిల్‌ నిబంధనలకు లోబడి శుక్రవారంనాడు ఆయన ఎన్‌సీబీ కార్యాలయానికి హాజరయ్యారు. అనంతరం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ సిట్ ఆయనను కేసు విచారణలో భాగంగా ప్రశ్నించినట్టు సమాచారం.


ఏ పరిస్థితుల్లో ఆర్యన్ క్రూయిజ్ షిప్‌ దగ్గర‌కు వెళ్లారు, ఎవరైనా తీసుకువెళ్లారా, మాదక ద్రవ్యాల సరఫరాదారులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అతని తోటివారికి ఉన్న డ్రగ్స్ సంబంధింత అలవాట్లు ఏమటినేవి సిట్ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కస్టడీలో ఆర్యన్‌ను ఎలా చూశారు, ముడుపులు ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులపై ఒత్తిడి వచ్చిందా, రేవ్ పార్టీ నుంచి ఏమి తెలుసుకున్నారు, క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ సరఫరా చేశారా వంటి పలు ప్రశ్నలు కూడా సిట్ విచారణలో ఆర్యన్‌పై సంధించినట్టు చెబుతున్నారు. ఎన్‌సీబీ దర్యాప్తు బృందం చెబుతున్న వాట్సాప్ చాట్‌లపై కూడా ఆర్యన్‌ను అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, తమ దర్యాప్తు కొనసాగుతోందని, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును ఒక కొలిక్కి తీసుకువస్తామని ఎన్‌సీబీబీ డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు.

Updated Date - 2021-11-13T19:51:03+05:30 IST