నత్తనడకన పంట నష్టం సర్వే

ABN , First Publish Date - 2020-12-03T04:46:38+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు కారణంగా నీట మునిగిన పొలాలు ఇంకా తేరుకోలేదు.

నత్తనడకన పంట నష్టం సర్వే

33 శాతానికి పైగా పంట నష్టపోతేనే పరిహారం

పొలాల్లో పంట కనిపిస్తేనే నమోదు

ఇప్పటికే నీళ్లలో కుళ్లి నామరూపాలు లేకుండా పోయిన పంట

బాధితులుగా గుర్తిస్తారో లేదోనని రైతుల్లో ఆందోళన


ఏలూరు రూరల్‌, డిసెంబరు 2 : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు కారణంగా నీట మునిగిన పొలాలు ఇంకా తేరుకోలేదు. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో పాటు పొలాల్లో నీరు వెళ్లేమార్గం లేక నీటిలో ఉన్న వరిపైరు కుళ్లిపోతోంది. నీటి నుంచి బయటపడ్డ వరి కంకులు మొల కెత్తుతున్నాయి. పంటలను రక్షించుకునే ప్రయత్నంలో రైతులు నిమగ్నమ య్యారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతు న్నారు. దీనికితోడు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందించేందుకు చేస్తున్న ఎన్యుమరేషన్‌ నత్తనడక నడుస్తోంది. దీంతో పంటలను కోయాలో లేక ఎన్యుమరేషన్‌ అయ్యే వరకూ ఉంచాలో అర్థం కాక రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. నివర్‌ తుఫాను ప్రభావంతో మండలంలో చొదిమెళ్ళ, మల్కాపురం, సుంకర వారితోట, జాలిపూడి, కాట్లంపూడి, మాదేపల్లి, పోణంగి, చాటపర్రు, లింగారావు గూడెం ప్రాంతాల్లో  చేలల్లో పంట నామ రూపాలు లేకుండా పోయింది. పరి హారం అందించేందుకు పంటనష్టం నమోదు చేసే విషయంలో అధికారులు అనేక రకాల షరతులతో రంగంలోకి దిగారు. 33 శాతానికి పైగా పంట నష్టపోవడంతో పాటు పొల్లాల్లో కన్పించిన పంటకే పరిహారం జాబితాలో పేరు చేర్చనున్నారు. అయితే చాలాచోట్ల పంటకుళ్లిపోయింది. మరికొన్ని చోట్ల కోసిన తర్వాత పనలు నాని కొట్టుకుపోవడంతో పాటు కుళ్లి ఆకారం కోల్పోయిన పంట వందల ఎకరాల్లో ఉంది. కొన్నిచోట్ల అయితే ఆయా మడుల్లో అసలు పంటే కన్పించడం లేదు. ఈ క్రమంలో నష్టం అంచనాలు పూర్తి స్థాయిలో వేసి అన్నదాతలను బాధితులుగా గుర్తిస్తారా.. లేదా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. పంటల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే మొదలుపెట్టారు. ఇది పూర్తి కావడానికి ఇంకా ఎనిమిదిరోజులే ఉంది. ఈలోపు మొత్తం నష్టపోయిన పంటను పరిశీలించడం అసాధ్యం. పంట చేతికివచ్చిన దశలో వరి దెబ్బ తినడంతో ఒక్కో ఎకరాకు రూ.25 వేల వరకూ నష్టపోగా ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.ఆరు వేలు మాత్రమే అందించనుంది.

Updated Date - 2020-12-03T04:46:38+05:30 IST