ఆర్థిక భరోసా..!

ABN , First Publish Date - 2022-05-16T06:30:44+05:30 IST

ఆర్థిక భరోసా..!

ఆర్థిక భరోసా..!

నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా

తప్పులుంటే ఆర్బీకేల్లో ఫిర్యాదు చేసుకోవచ్చు

కౌలు రైతులకూ భరోసా ఇవ్వాలని డిమాండ్‌

గుడివాడ, మే 15 : ఖరీఫ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో రైతు భరోసా అక్కరకు వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. పెట్టుబడి భారంగా మారి వ్యవసాయానికి రైతులు దూరమవుతున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్‌ నిధి-వైఎస్సార్‌ రైతు భరోసా పథకం పేరిట రైతుల ఖాతాల్లో ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున జమ చేస్తున్నారు. ప్రస్తుతం 2022-23 వ్యవసాయ సంవత్సర మొదటి విడత రైతు భరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అన్నదాతలు తమ ఖాతాలు సరిచూసుకుని, సమస్యలుంటే రైతు భరోసా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

కృష్ణా రైతులకు రూ.77.09 కోట్ల పెట్టుబడి సాయం

జిల్లాలో రైతు భరోసా పొందడానికి అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని 3.07 లక్షల మంది రైతులు లబ్ధిపొందగా, వారిలో ప్రస్తుత కృష్ణాజిల్లాకు చెందినవారు 1.44 లక్షల మంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 3.18 లక్షల మంది లబ్ధిపొందగా, కృష్ణాజిల్లాకు చెందినవారు 1.50 లక్షల మంది. 2021-22లో ఉమ్మడి జిల్లాలో 3.26 లక్షల మంది లబ్ధిపొందగా, కృష్ణాజిల్లాలో 1.43 లక్షల మంది రైతు భరోసా అందుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో అర్హులైన రైతులకు రూ.77.09 కోట్ల పెట్టుబడి సాయం విడుదల అవుతున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. 

రకరకాలకారణాలతో అర్హుల జాబితాలో కోత

జిల్లాలో చాలామంది రైతులు వివిధ రకాల కారణాలతో రైతు భరోసాకు దూరమవుతున్నారు. కొంతమంది అన్నదాతలు అర్హత ఉన్నా ఆధార్‌ నమోదులో లోపాలతో ప్రభుత్వ పెట్టుబడి సాయం అందుకోలేకపోతున్నారు. భూ రికార్డుల్లో మార్పులు, చేర్పులు ఉన్నవారు, పట్టాదారు పాసుపుస్తకం పొందనివారు, కొత్తగా పాసు పుస్తకం వచ్చినవారు, భూ యజమాని మరణించిన పరిస్థితుల్లో కొత్త హక్కుదారు పేరు నమోదు కానివారు.. ఇలా రకరకాల కారణాలతో రైతు భరోసా అందుకోలేకపోతున్నారు. 2019-20లో 1.44 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే, 2020-21 ఏడాదికి వారి సంఖ్య 1.50 లక్షలకు చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి 1.43 లక్షల మందే ఎంపికయ్యారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. జిల్లాలో 90వేల ఎకరాల్లో ఆక్వా ఉత్పత్తులు సాగు చేయడం కూడా రైతు భరోసా ఖాతాల తగ్గుదలకు కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రైతు భరోసా మొత్తాలను పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చు మూడేళ్ల క్రితంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగిందని, పెట్టుబడి సాయం పెంచితేనే రైతులు సాగు బాటలో నడుస్తారని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించిన పరిస్థితుల్లో నష్టపరిహారం సకాలంలో అందడం లేదని రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో పట్టాదారు పాసుపుస్తకం ఆలస్యంగా జారీ అయినవారు, ఇటీవల భూములు కొన్నవారు రైతు భరోసా సాయం కోసం వేచి చూస్తున్నారు. వారందరినీ గుర్తించి సాయం అందించాలని కోరుతున్నారు. కౌలు రైతులకు కార్డులు మంజూరుచేసి భరోసా సాయం అందజేయాలని  కౌలు రైతుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 


అర్హులందరికీ రైతు భరోసా

అర్హులైన రైతులందరికీ రైతు భరోసా సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి వివరాలు, పట్టాదారు పాసు పుస్తకాలతో రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి. అర్హత ఉన్న రైతులు తమ సమస్యను మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి.

- మనోహరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

Updated Date - 2022-05-16T06:30:44+05:30 IST