రైతులు సంతోషంగా లేరు!

ABN , First Publish Date - 2022-05-21T05:35:59+05:30 IST

వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా చేపడుతున్న పథకాలు, వ్యవసాయ ప్రణాళికల తదితర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం నెల్లూరులో జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి (ఏఏబీ) సమావేశం

రైతులు సంతోషంగా లేరు!
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, ఏఏబీ చైర్మన్‌, జడ్పీ చైర్మన్‌, జేసీ, ఎమ్మెల్యే తదితరులు

అధికారులంతా ఇది గ్రహించాలి

యంత్రాంగం పనితీరుపై ఏఏబీలో ఆసక్తికర చర్చ


నెల్లూరు (వ్యవసాయం), మే 20 : వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా చేపడుతున్న పథకాలు, వ్యవసాయ ప్రణాళికల తదితర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం నెల్లూరులో జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి (ఏఏబీ) సమావేశం ఈసారి అధికారుల పనితీరుపై చర్చ జరగడం ఆసక్తిగా మారింది. రైతులు సంతోషంగా ఉన్నారని వారు అనుకోవడంలో తప్పులేదని, అయితే రైతులు నిజంగా సంతోషంగా లేరని ప్రజాప్రతినిధులు చెప్పడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. పథకాలు బాగున్నా అవి ఎంతవరకు అర్హులకు అందుతున్నాయో పరిశీలించాలని పలువురు రైతులు మాట్లాడటం, వారి సమస్యలను తెలియజేయడంతో ఆసక్తికరంగా మారింది.  కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన జిల్లాస్థాయి ఏఏబీ సమావేశం ఇందుకు వేదికైంది.


సివిల్‌ సప్లయీస్‌పై ఆగ్రహం

ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు సివిల్‌ సప్లయీస్‌ అధికారులు కనీసం స్పందించడం లేదని కొంతమంది రైతులు సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. జేసీ హరేందిరప్రసాద్‌ స్పందించి సమస్యలకు పరిష్కారం చూపుతున్నా మండల, జిల్లాస్థాయి అధికారుల్లో చలనం ఉండటం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ సివిల్‌ సప్లయీస్‌ డీఎం పి.పద్మను సున్నితంగా మందలించారు. ఏడాదిలో రెండు సీజన్లలో కూడా పని చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని, మరోసారి ఇది పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


‘ప్రకృతి’ అధికారుల గైర్హాజరు

 ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం ఎంతో కీలకమని రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కందుకూరు ఎమ్మెల్యే మహీదర్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే ఆ శాఖ అధికారులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదని చెప్పడంతో జేసీ హరేందిరప్రసాద్‌ వారిని పిలవగా లేరు. దీనిపై జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌రాజుతో  జేసీ మాట్లాడారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, మత్స్య, పశుసంవర్థక శాఖల జేడీలు మహేశ్వరుడు, నాగేశ్వరరావు, ఎల్‌డీఎం శ్రీకాంత్‌ప్రదీ్‌పకుమార్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణారావు, ఉద్యాన శాఖ ఏడీ ప్రదీప్‌, ఏడీఏ అనిత, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.


రైతులు సంతోషంగా లేరు!: నిరంజన్‌బాబు రెడ్డి, ఏఏబీ చైర్మన్‌

ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు జరిపించాం.. కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారని అందరం అనుకోవడంలో తప్పులేదు. అయితే క్షేత్రస్థాయిలో రైతులు సంతోషంగా లేరనేది వాస్తవం ధాన్యం కొనుగోలు చేసినా వారికి ఇంకా నగదు ఇవ్వలేదు. రైతు భరోసా పథకం ద్వారా కొంతమంది రైతులకు నగదు పడలేదని నా దృష్టికి వచ్చింది. తేమశాతం పేరుతో 845 కేజీలకు 1200 కేజీలు మిల్లర్లు తీసుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు రైతు ఎలా సంతోషంగా ఉంటాడు. అధికారులు వీటిపై దృష్టి పెట్టాలి. ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలి. 


ఆక్రమణలో 90శాతం చెరువులు :   మహీధర్‌రెడ్డి,  కందుకూరు ఎమ్మెల్యే

జిల్లాలో 90 శాతం చెరువులు, వాగులు ఆక్రమణకు గురై ఉన్నాయి. ప్రభుత్వ భూమిలో వేరే సర్వే నెంబరుతో ఆక్వా సాగు చేస్తున్నారు. ఇవన్నీ ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు తెలియదా? తెలిసీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వరదలొస్తే పంటచేలన్నీ మునిగిపోతున్నాయి. ఎందువల్ల అధికారులు ఆక్రమణలను తొలగించలేకపోతున్నారు. కోర్టులు హెచ్చరిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ప్రకృతి వ్యవసాయం చేసేవారిని ప్రోత్సహించాల్సిన అసవరం ఉంది. వారి పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి. అయితే ప్రకృతి వ్యవసాయం చూసే అధికారులు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఏ మట్టిలో ఏ పంట వేయాలో రైతులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉద్యాన శాఖది. అయితే ఆ అధికారులు ఎంతవరకు న్యాయం చేస్తున్నారో వారికే తెలియాలి.  


త్వరలో రైతుల ఖాతాల్లో నగదు జమ : చక్రధర్‌బాబు, కలెక్టర్‌

ధాన్యం కొనుగోళ్ల నగదును ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో రైతుల ఖాతాల్లో నగదు చేస్తాం. నవంబరు నెలలో భారీ వర్షాలు, తుఫాను వరదల కారణంగా వరి రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని గమనించాం. దీంతో ముఖ్యమంత్రి ఒక నెల ముందుగా ఖరీఫ్‌ సాగుకు సమాయత్తం కావాలని ఆదేశించారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. అర్హులైన వారికి కిసాన్‌ క్రెడిట్‌, సిసిఆర్‌సి కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 



Updated Date - 2022-05-21T05:35:59+05:30 IST