
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం నడుస్తున్న రోజులలో లక్ష్మణ్ చాలా ఆందోళనతో ఉండేవాడు. తెలంగాణ ఏర్పడుతుందా అంటూ ఫోన్ చేసి అడిగేవాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించిన తర్వాత ఫోన్ చేసి కాళోజీ, జయశంకర్, బియ్యాల జనార్దన్‌రావులు ఉంటే ఎంత సంతోషించేవారో అని బాధపడ్డాడు.
వరంగల్ నగరంలో వైశ్య కుటుంబంలో 82 సంవత్సరాల క్రితం పులుకంటి శంకరలింగం, కమలమ్మ దంపతులకు జన్మించిన పులుకంటి లక్ష్మినారాయణను మిత్రులు, పరిచయస్తులందరు బ్యాంకు లక్ష్మణ్ సేఠ్‌గా ప్రేమతో, గౌరవంతో పిలుచుకునే మంచి మనిషి. హైదరాబాద్‌లో గురువారం ఉదయం కన్నుమూసాడు. వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆయన జీవితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగిగా ప్రారంభమయి వరంగల్‌లోని అన్ని సామాజిక, సాంస్కృతిక, కార్మిక, విద్యారంగాలలో తన అడుగు ముద్రలు వేసాడు.
వరంగల్‌లో బ్యాంకు లక్ష్మణ్ సేఠ్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడి ఆర్ట్స్ కళాశాలలో బిఎ క్లాసులో ప్రముఖ జర్నలిస్ట్, విశాలాంధ్ర పత్రిక ఎడిటర్ రాఘవాచారి సహ విద్యార్థి, దగ్గరి స్నేహితుడు కావడంవల్లనేమో, లేక అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిత్వంవల్ల నేమో లక్ష్మణ్ వరంగల్ వాణి సంస్థాపకుడు, సంపాదకుడు ఎంఎస్ ఆచార్య, సీనియర్ జర్నలిస్ట్ స్వామి, పొత్తూరి వెంకటేశ్వరరావులకు ఆప్తమిత్రుడయ్యాడు. బ్యాంకు ఉద్యోగుల సంఘం, సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉండటం, వరంగల్‌లో ఉండే రాజకీయ, ప్రజాస్వామిక సంస్కృతి వాతావరణం ప్రభావంతో ప్రగతిశీల రాజకీయ సంస్థలపట్ల, ఆ భావాలు ప్రచారం చేసే వ్యక్తులపట్ల ఆకర్షితుడైనాడు. లక్ష్మణ్ది చాలా విశిష్టమైన వ్యక్తిత్వం. ఆ రోజుల్లో మార్క్సిస్టు మేధావి పాములపర్తి సదాశివరావు, పార్లమెంటు సభ్యుడు ఇటికాల మధుసూధన్‌రావు, డాక్టర్ టిఎస్ మూర్తి, వెలిశాల కనకయ్య పరిచయాలతో నగరంలో ప్రతి సామాజిక రంగాన్ని ఆయన స్పృశించాడు.
కాకతీయ మెడికల్ కాలేజీ అభివృద్ధిలో, చందా కాంతయ్య డిగ్రీ కళాశాల, చందా కాంతయ్య ప్రసూతి దవాఖాన స్థాపనలో లక్ష్మణ్ పాలుపంచుకొన్నాడు. బ్యాంకు ఉద్యోగుల సంఘానికి ఉపాధ్యక్షుడుగా ఉంటూ, అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘంలో ప్రాతినిధ్యం వహించాడు. కార్మిక రంగంలో ఉండడంవల్ల ఆజాంజాహీ మిల్లు వర్కర్ల కార్యక్రమాలు, దేశాయిపేటలో తోళ్ల పరిశ్రమలోని కార్మికులు, లారీల యూనియన్ వెంకటస్వామి స్నేహితంతో లారీ ఓనర్లు, డ్రైవర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. వరంగల్ మార్కెట్ కమిటీ, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలు ఏ సమస్య వచ్చినా లక్ష్మణ్ సలహాలు తీసుకునేవారు. బ్యాంకు ఉద్యోగుల కోసం నివాస స్థలం సేకరించి వాసవీ కాలనీ ఏర్పాటు కోసం కృషి చేసాడు.
1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం వరంగల్‌లో ఉవ్వెత్తున లేచింది. దానికి ఆకర్షితుడై భూపతి కృష్ణమూర్తి గారికి సన్నిహితుడై, ఆయన రెండాకుల గుర్తుతో తెలంగాణ ప్రజాసమితి పార్టీ టికెట్‌తో అసెంబ్లీ స్థానం కోసం పోటీ చేసినప్పుడు చాలా మందితో బాటు ఆర్థిక, హార్ధిక మద్దతు లక్ష్మణ్ కూడగట్టగలిగాడు. ఆ క్రమంలోనే పరిచయం అయిన జయశంకర్ సార్, ఆంధ్రప్రభలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి పలు అంశాలపై వ్యాసాలు రాసిన పొత్తూరి వెంకటేశ్వరరావు, వరంగల్ వాసి అయిన ప్రముఖ జర్నలిస్ట్ పిఎన్ స్వామి స్నేహం ఏర్పడి, ఆ స్నేహాన్ని చివర వరకు కొనసాగించాడు.
శ్రీశ్రీ కవిత్వం వల్ల ప్రభావితం అయిన చాలా మందికి కాళోజీ, వరవరరావుకు భావరీత్యా సన్నిహితులైనారు. అందులో లక్ష్మణ్ కూడా ఒకడు. నేను, వరవరరావు సార్ కాలేజీ నుండి, వెంకటరమణ ముద్రణాలయం (సృజన ప్రెస్) వెళ్తూ తప్పకుండా లక్ష్మణ్ దగ్గర ఆగి ప్రత్యేకమైన ఛాయ్ తాగి వెళ్లవలసిందే. ఆయన బ్యాంకు ఆఫీస్ రూంలో అర్జున్ అవార్డు గ్రహీత పిచ్చయ్య, నేరేళ్ల వేణుమాధవ్ అప్పుడప్పుడు ఆచార్య సుప్రసన్న, సిపిఐ నాయకులు మాకు కలుస్తుండేవారు. ఆయన రూమ్ ఒక రాజకీయ వార్తల కేంద్రం. వరంగల్ రాజకీయాలు, రకరకాల కార్యక్రమాల వివరాలు ఎప్పుడూ చర్చలో ఉండేవి. అక్కడ వెలుబుచ్చబడే అంశాలను తనదైన పద్ధతిలో లక్ష్మణ్ ఆయన దగ్గరకు చనువుతో వచ్చే ప్రజాప్రతినిధులకు, మంత్రులకు చేరవేసేవాడు.
వరంగల్‌లో ఉన్న ప్రముఖ డాక్టర్లు, కాలేజీలలో పనిచేసే ప్రజాస్వామిక భావాలున్న అధ్యాపకులు, ఉపాధ్యాయులతో ఆయన స్నేహం పెంచుకునేవాడు. ప్రొ. హరగోపాల్, ప్రొ. శివలింగప్రసాద్, ఇంకా కొందరు ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లకు ఆయన మిత్రుడయ్యారు. ఆయనకు ఏ సంస్థలోనూ ప్రాథమిక సభ్యత్వం ఉండేది కాదు, కాని వరంగల్‌లోని ప్రజాసంఘాలు, సాహితీ, సాంస్కృతిక సంస్థలు సభ్యత్వం లేని తమవాడిగా ఆయనను భావించేవారు.
1977లో స్థాపించిన ‘వరంగల్ ఫిలిం సొసైటీ’ ఆయన సహకారంతోనే ప్రారంభించి కొనసాగించాం. జయశంకర్‌గారు సికెఎమ్ కళాశాలకు ప్రిన్సిపల్‌గా వచ్చిన తర్వాత, ఆయన సలహా, సహకారంతోనే విద్యార్థుల సౌకర్యం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎక్స్టెన్షన్ కౌంటర్ ప్రారంభం అయింది. చాలాకాలం క్రితం ప్రొ. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు కాబడ్డ హేతువాద సంఘం ఆయన ఆలోచనే. వరంగల్ కలెక్టర్‌గా సమర్జిత్రే ఉన్న సమయంలో ఆయన భార్య నందితరే ఏర్పరచిన తెలంగాణలో మొదటి మహిళా సూపర్ బజార్ ఏర్పాటులో లక్ష్మణ్ కృషి ఉందని తెలిసి ఆశ్చర్యపడ్డాం.
1974లో శ్రీశ్రీ అధ్యక్షుడిగా ఏర్పడ్డ పౌరహక్కుల సంఘం కొద్ది కాలమే పనిచేసింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ మొదటి పౌరహక్కుల సంఘం యూనిట్ వరంగల్‌లోనే. దాని ఏర్పాటుకు లక్ష్మణ్ చాలా సహకారం అందించాడు. డా. రామనాధం మరణం తర్వాత, తిరిగి ఏర్పడ్డ పౌరహక్కుల సంఘం యూనిట్ నిర్బంధ పరిస్థితులలో లక్ష్మణ్ నిర్మించుకుంటున్న నూతన గృహంలో నేను బాలగోపాల్ కూర్చుండి ఏర్పాటు చేసుకోగలిగాం. రెండవసారి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్‌లో పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన రైతు కూలీల బహిరంగ సభ జరిగింది. ఆ సందర్భంగా ‘డాక్టర్ల క్యాంపు’ నుంచి నీటి వసతి ఏర్పాటు, ఇంకా చాలా విషయాల్లో వరంగల్‌లోని మిత్రులు సహాయ సహకారాలు అందించారు. ఆ వ్యక్తుల్లో లక్ష్మణ్ ఒకడు. ఆ రోజుల్లో వృత్తిపరంగా నిబద్ధత కలిగిన ప్రముఖ వైద్యుడు అయిన డాక్టర్ ధర్మారావు స్నేహంతో లక్ష్మణ్ గాంధీ అసుప్రతి అభివృద్ధికోసం కృషి చేసాడు.
లక్ష్మణ్ గారు చాలా కాలం సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉన్న ఇస్కస్ (ఇండో–సోవియట్ కల్చరల్ సొసైటీ)కు కార్యదర్శిగా ఉండి చాలా కార్యక్రమాలు నిర్వహించగలిగాడు. ఆ సంస్థ తరఫున రెండుసార్లు రష్యాకు వెళ్లి అంతర్జాతీయ కార్మిక సమావేశాల్లో కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమాల్లోనే మేము కార్మిక నాయకులైన కెఎల్ మహేంద్ర, రాజ్‌బహద్దూర్ గౌర్‌ను వరంగల్‌లో వినగలిగాం. వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా లక్ష్మణ్ నుండి సహాయసహకారాలు అందుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్లానింగ్ కమీషన్, వైస్ ఛైర్మన్‌గా ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్ వరంగల్ వామపక్ష విద్యార్థి సంఘంలో చురుకైన కార్యకర్త. లక్ష్మణ్ తనకు గురువు అని, అన్ని వేళలా సంస్థను, తనను ప్రోత్సహించేవాడని ఆయన చెప్పుకుంటాడు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం నడుస్తున్న రోజులలో లక్ష్మణ్ సేఠ్ చాలా ఆందోళనతో ఉండేవాడు. తెలంగాణ ఏర్పడుతుందా అంటూ ఫోన్ చేసి అడిగేవాడు. జయశంకర్, కాళోజీలతో కూడా ఈ విషయం అడిగేవాడట. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత ఫోన్ చేసి కాళోజీ, జయశంకర్, బియ్యాల జనార్దన్‌రావులు ఉంటే ఎంత సంతోషించేవారో అని బాధపడ్డాడు. నెలరోజుల క్రితం ఫోన్ చేసి నిన్ను చూడాలనిపిస్తుందని అంటే ఒక బ్యాంక్ మిత్రుడితో కలిసి వెళ్లాను. చాలా విషయాలు మాట్లాడి, వరంగల్‌లో ఇంత పరిచయం ఉన్న నేను డాక్టర్ రామనాధంకు రాబోయే ముప్పును ఊహించి కాపాడుకోలేకపోయాను అని బాధను వ్యక్తం చేసాడు. మా మిత్రబృందం తరఫున వరంగల్ ప్రజలు, ప్రజాసంఘాల తరఫున ‘బ్యాంకు లక్ష్మణ్ సేఠ్’కు జోహార్లు.
ఎస్. జీవన్‌కుమార్
మానవ హక్కుల వేదిక