ఎస్‌.రాయవరం ఎంపీపీ రాజీనామా

ABN , First Publish Date - 2022-09-24T06:47:38+05:30 IST

మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్ష పదవికి బొలిశెట్టి శారదాకుమారి రాజీనామా చేశారు. వైసీపీకి చెందిన ఈమె శుక్రవారం ఎంపీడీవో ఎన్‌.వి.రామచంద్రమూర్తికి రాజీనామా పత్రాన్ని అందజేశారు.

ఎస్‌.రాయవరం ఎంపీపీ రాజీనామా
ఎంపీడీవో రామచంద్రమూర్తికి రాజీనామా పత్రం అందజేస్తున్న ఎంపీపీ శారదాకుమారి. పక్కన ఆమె భర్త గోవిందరావు

ఎంపీడీవోకు పత్రాన్ని అందజేసిన శారదాకుమారి

ఎమ్మెల్యే బాబూరావు తీరుతో మనస్తాపం చెందినట్టు ఆరోపణ


ఎస్‌.రాయవరం, సెప్టెంబర్‌ 23: మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ) అధ్యక్ష పదవికి  బొలిశెట్టి శారదాకుమారి రాజీనామా చేశారు. వైసీపీకి చెందిన ఈమె శుక్రవారం ఎంపీడీవో ఎన్‌.వి.రామచంద్రమూర్తికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. అంతకుముందు తన భర్త, ఎంపీసీటీ సభ్యుడు అయిన గోవిందరావుతో కలిసి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తీరుతో మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో తనకు ఎంపీపీగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. గత ఏడాది ఎన్నికల్లో మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకుగాను వైసీపీ 17 స్థానాల్లో విజయం సాధించడంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి రెండవసారి ఎంపీపీగా అవకాశం ఇచ్చారని చెప్పారు. కానీ ఎమ్మెల్యే బాబూరావు తమను చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీకి చెందిన సర్పంచులను, ఎంపీటీసీలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యేని ప్రశ్నించారు.

కాగా ఎంపీపీ శారదాకుమారి రాజీనామా పత్రాన్ని తనకు అందజేశారని, నిబంధనల ప్రకారం రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్‌ సీఈవోకు అందజేయాలని ఆమెను సూచించానని ఎంపీడీవో రామచంద్రమూర్తి చెప్పారు.


Updated Date - 2022-09-24T06:47:38+05:30 IST