శ్రీశాంత్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై

ABN , First Publish Date - 2022-03-10T01:52:25+05:30 IST

టీమిండియా క్రికెటర్ ఎస్.శ్రీశాంత్ బుధవారం కీలక ప్రకటన చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి..

శ్రీశాంత్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ ఎస్.శ్రీశాంత్ బుధవారం కీలక ప్రకటన చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ట్విట్టర్ ద్వారా శ్రీశాంత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2005 నుంచి 2011 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు ఆడాడు. అలాగే, 10 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్ సభ్యుడు కూడా. 


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2013 వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. ఆ తర్వాత స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుని క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఈ నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించడంతో 2020లో తిరిగి క్రికెట్‌ ఆడతానని ప్రకటించాడు. అయితే, జాతీయ జట్టులో మాత్రం చోటు సంపాదించుకోలేకపోయాడు.


తన కుటుంబం, తన సహచరులు, దేశ ప్రజలకు, ముఖ్యంగా క్రికెట్‌ను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని శ్రీశాంత్ తన రిటైర్మెంట్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు భారమైన హృదయంతో చెబుతున్నానని శ్రీశాంత్ పేర్కొన్నాడు.  

Updated Date - 2022-03-10T01:52:25+05:30 IST