సాగు నీరందే దారేదీ?

ABN , First Publish Date - 2022-08-19T06:12:53+05:30 IST

పాడేరు మండలంలో వంతాడపల్లి పంచాయతీ కేంద్రానికి సమీపంలోని చిలకలమామిడి మినీ రిజర్వాయర్‌ చాలా ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు.

సాగు నీరందే దారేదీ?
అభివృద్ధికి నోచుకోని చిలకలమామిడి మినీరిజర్వాయర్‌

- అభివృద్ధికి నోచుకోని చిలకలమామిడి మినీ రిజర్వాయర్‌ 

- పుష్కలంగా నీరు... పొలాలకు అందని తీరు 


పాడేరు మండలంలో వంతాడపల్లి పంచాయతీ కేంద్రానికి సమీపంలోని చిలకలమామిడి మినీ రిజర్వాయర్‌ చాలా ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో రిజర్వాయర్‌ పరిధిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ సమీపం పంట పొలాలకు సాగునీరు అందని దుస్థితి చాలా కాలంగా కొనసాగుతున్నది. 


                       (ఆంధ్రజ్యోతి- పాడేరు) 

మండలంలో వంతాడపల్లి, తుంపాడ, కిండంగి, పాడేరు గ్రామాలకు చెందిన సుమారుగా 150 ఎకరాల్లో పంట భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చాలా కాలం క్రితం వంతాడపల్లికి సమీపంలో వున్న చిలకలమామిడి గెడ్డపై మినీ రిజర్వాయర్‌ను నిర్మించారు. దీంతో దాని ఆధారంగా ఆ పంట పొలాలకు ఏడాది పొడవునా సాగునీరు అందేది. దీంతో మినీ రిజర్వాయర్‌ ఆయకట్టు కింద వరి, చెరకు, రాగులు తదితర పంటలను గిరిజన రైతులు సాగు చేసేవారు. అలాగే సాగునీరు అందుబాటులో ఉండడంతో ఖరీఫ్‌, రబీ సీజన్లో సైతం వరి పంటను పండించే వారు. క్రమంగా మినీ రిజర్వాయర్‌ మరమ్మతులకు గురికావడంతో అందులో నీరు నిల్వ ఉండకపోవడం, దానికి అనుబంధంగా ఉన్న చానల్‌లు పాడైపోవడం వంటి కారణాల వల్ల పంట పొలాలకు సరిగ్గా సాగునీరు అందని దుస్థితి ఏర్పడింది. 

కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు

చిలకలమామిడి గెడ్డపై నిర్మించిన మినీ రిజర్వాయర్‌కు అవసరమైన మరమ్మతులు చేపట్టి అభివృద్ధి చేయాలని చాలా ఏళ్లుగా చేస్తున్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనిపరిస్థితి ఏర్పడింది. దీంతో మినీ రిజర్వాయర్‌ ఏ విధంగానూ అభివృద్ధికి నోచుకోవడం లేదు. మినీ రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టి తమకు సాగునీటి సదుపాయం కల్పించాలని గతంలో ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజన రైతులు ఎంపీ, ఎమ్మెల్యేలకు అనేక సార్లు వినతిపత్రాలను సమర్పించారు. గిరిజన రైతుల అభ్యర్థన మేరకు దానిని అభివృద్ధి చేసేందుకు పలు మార్లు అధికారులు ప్రభుత్వానికి పలు మార్లు ప్రతిపాదనలు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చిలకలమామిడిగెడ్డపై వున్న మినీ రిజర్వాయర్‌ అభివృద్ధికి కృషి చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-19T06:12:53+05:30 IST