సబలెంకాకు షాక్‌

ABN , First Publish Date - 2022-01-25T08:57:39+05:30 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది.

సబలెంకాకు   షాక్‌

హలెప్‌ ఇంటికి

క్వార్టర్స్‌లో సిట్సిపాస్‌,స్వియటెక్‌, మెద్వెదెవ్‌ 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌


 మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. రెండోసీడ్‌ అరీనా సబలెంకాకు 36 ఏళ్ల ఎస్టోనియా క్రీడాకారిణి కియా కనేపి షాకిచ్చింది. అలాగే రెండు గ్రాండ్‌స్లామ్‌ల విజేత సిమోనా హలెప్‌ సైతం నాలుగో రౌండ్‌లో పరాజయం చవిచూసింది. గ్రీకు వీరుడు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ నాలుగో రౌండ్‌ గట్టెక్కేందుకు ఏకంగా ఐదు సెట్లపాటు పోరాడాల్సి వచ్చింది. పురుషుల్లో రెండోసీడ్‌ మెద్వెదెవ్‌, 9వ సీడ్‌ అగర్‌, మహిళల్లో ఏడోసీడ్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ స్వియటెక్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరారు.


కనేపి సంచలనం:

మార్గరెట్‌ కోర్ట్‌ ఎరీనాలో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ నాలుగో రౌండ్‌ పోరులో కియా కనేపి 5-7, 6-2, 7-6 (10)తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంకా (బెలార్‌స)పై సంచలన విజయం సాధించింది. తొలిసారి మెల్‌బోర్న్‌ పార్క్‌లో క్వార్టర్స్‌ చేరిన కనేపి ఏడోసీడ్‌ స్వియటెక్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. పోలెండ్‌కు చెందిన స్వియటెక్‌ 5-7, 6-3, 6-3 స్కోరుతో సొరానా కిర్‌స్టియా (రొమోనియా)ను ఓడించింది. ఇక ఫ్రాన్స్‌కు చెందిన అలైజ్‌ కార్నెట్‌, మాజీ నెంబర్‌వన్‌ హలె్‌పనకు షాకిచ్చింది. నాలుగో రౌండ్‌ పోరులో 32 ఏళ్ల కార్నెట్‌ 6-4, 3-6, 6-4తో 14వ సీడ్‌ హాలెప్‌ (రొమేనియా)ను చిత్తు చేసింది. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్‌లో ఆమె తొలిసారి క్వార్టర్స్‌ చేరింది. తదుపరి రౌండ్‌లో డానిలీ కొలిన్స్‌తో కార్నెట్‌ తలపడుతుంది. 27వ సీడ్‌ కొలిన్స్‌ (అమెరికా) 4-6, 6-4, 6-4తో 19వ సీడ్‌ ఎలిస్‌ మెర్టెన్స్‌ (బెల్జియం)పై గెలిచింది.


చెమటోడ్చిన సిట్సిపాస్‌:

అమెరికాకు చెందిన టేలర్‌ ఫ్రిట్జ్‌ నాలుగో సీడ్‌ సిట్సిపా్‌సను ఓడించినంత పని చేశాడు. రాడ్‌ లేవర్‌ ఎరీనాలో జరిగిన మ్యాచ్‌లో రెండు సెట్లు ఓడిన స్టెఫనోస్‌ పుంజుకొని 4-6, 6-4, 4-6, 6-3, 6-4తో టేలర్‌ను అధిగమించి ఊపిరిపీల్చుకున్నాడు. క్వార్టర్‌ఫైనల్లో 11వ సీడ్‌ జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ)ని స్టెఫనోస్‌ ఢీకొంటాడు. నాలుగో రౌండ్‌లో 7-6 (3), 6-3, 6-4తో అలెక్స్‌ డి మినౌర్‌ (ఆస్ట్రేలియా)పై సిన్నర్‌ సునాయాసంగా నెగ్గాడు. రెండోసీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-2, 7-6 (4), 6-7 (7), 7-5తో క్రెసి (అమెరికా)పై, తొమ్మిదోసీడ్‌ ఫెలిక్స్‌ అగర్‌ (కెనడా) 2-6, 7-6 (9), 6-2, 7-6 (4) స్కోరుతో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గి క్వార్టర్స్‌ చేరారు. 

Updated Date - 2022-01-25T08:57:39+05:30 IST