విడిపోయే బంధాన్ని నిలబెడుతుంది

ABN , First Publish Date - 2021-04-19T05:30:00+05:30 IST

చిన్న చిన్న తగవులు భార్యాభర్తల బంధాన్ని బలి తీసుకొంటున్నాయి. కలకాలం కలిసి జీవించాల్సిన జంటలు ఎవరికి వారుగా ఒంటరైపోతున్నాయి. అనురాగబంధంలోని పరమార్థం తెలుసుకోలేక కలతలతో పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకొంటున్న అలాంటి ఆలుమగలను చూసి చలించారు పడకంటి సబిత. అక్షర జ్ఞానం లేకపోయినా... జీవితం విలువేమిటో తెలిసిన ఆమె...

విడిపోయే బంధాన్ని నిలబెడుతుంది

చిన్న చిన్న తగవులు భార్యాభర్తల బంధాన్ని బలి తీసుకొంటున్నాయి. కలకాలం కలిసి జీవించాల్సిన జంటలు ఎవరికి వారుగా ఒంటరైపోతున్నాయి. అనురాగబంధంలోని పరమార్థం తెలుసుకోలేక కలతలతో పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకొంటున్న అలాంటి ఆలుమగలను చూసి చలించారు పడకంటి సబిత. అక్షర జ్ఞానం లేకపోయినా... జీవితం విలువేమిటో తెలిసిన ఆమె... విడిపోదామనుకున్న ఎన్నో జంటలను ఒక్కటిగా నిలబెడుతున్నారు.


‘‘ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా సమాజంలో ఆడవారి పట్ల అసమానతలు అలానే ఉన్నాయి.  ఎన్నో ఆశలతో పుట్టిల్లు వదిలి మెట్టినింట అడుగుపెట్టిన ఆమెకు అక్కడ ఆశించిన స్థానం దక్కడంలేదు. బాధలన్నీ పంటి బిగువున భరించినా... ఒక్కోసారి చిన్న చిన్న కారణాలతో భర్తలు పండంటి కాపురాన్ని కూల్చేస్తున్నారు. స్త్రీ సహనాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లి... మూడుముళ్ల బంధాన్ని తెగే వరకూ లాగుతున్నారు. నా చుట్టూ నిత్యం ఇలాంటి ఘటనలెన్నో! అలాంటివి చూసినప్పుడల్లా నాలో తెలియని బాధ! అందుకే విడిపోతున్న జంటలకు సర్దిచెప్పి, వారి సంసారం తిరిగి సజావుగా సాగేలా నావంతు ప్రయత్నం చేయాలనుకున్నాను. 


తెలియగానే వాలిపోతా... 

జంటలను కలపాలన్న ఆలోచన వచ్చింది మొదలు కార్య క్షేత్రంలోకి దిగిపోయాను. మాది రంగారెడ్డి జిల్లా... యాచారం మండలం... తక్కళ్లపల్లి గ్రామం. నాకు అక్షరం ముక్క రాదు. నా పేరు మాత్రం రాయగలను. ఊళ్లో చిన్న కిరాణా షాపు ఉంది. మా ఆయన శంకరయ్య చూసుకొంటారు. పొదుపు సంఘంలో అలాగే మండల మహిళా సమాఖ్యల్లో సభ్యురాలిగా కొన్నేళ్లు సేవలందించాను. ఆ సమయంలో కొంతమంది భర్తలు అకారణంగా తమ భార్యలను వేధించడం ప్రత్యక్షంగా చూశాను. ఆ వేధింపులకు తట్టుకోలేక భర్త నుంచి విడిపోదామనుకున్న మహిళలకు, ఆమె అత్తింటివారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టాను. ఏ జంట గొడవ పడుతోందని తెలిసినా, ఆ ఇంటికి వెళతాను. ఇరు వైపుల వారి వాదనలు విన్న తరువాత... కొన్ని సలహాలు ఇస్తాను. చాలా సందర్భాల్లో నా కౌన్సెలింగ్‌వల్ల సమస్యలు పరిష్కారమయ్యాయి. 




అర్థం చేసుకోలేకపోతున్నారు...

ఇక్కడ అధిక శాతంమందికి ఇంటర్‌ పూర్తి కాగానే పెళ్లిళ్లు చేస్తున్నారు. దీనివల్ల వారిలో మానసిక పరిపక్వత రావడంలేదు. ఒకరి వేదన ఒకరు అర్థం చేసుకోలేక తగవులకు దిగుతున్నారు. ఎవరికి వారు ఇంట్లో తమ ఆధిపత్యమే నడవాలనే పట్టుదలకు పోతున్నారు. ఫలితంగా సహజీవనంలో సయోధ్య కుదరక విడిపోవాలనే నిర్ణయానికి వస్తున్నారు. ఇలా ఎన్నో బంధాలు మొగ్గలోనే తెగిపోతున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు కూడా ఎక్కువ కాలం నిలవడంలేదు. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే కనీసం డిగ్రీ అయినా పూర్తవ్వాలన్న నిబంధన ఒకటి తెస్తే వీటిని కొంతవరకైనా అరికట్టవచ్చన్నది నా అభిప్రాయం.


కౌన్సెలింగ్‌ ఇలా... 

మా చుట్టుపక్కల ఎక్కడైనా సరే భార్యాభర్తలు గొడవ పడితే నాకు సమాచారం తెలుస్తుంది. ఫిర్యాదు అందిన తరువాత ఆ గ్రామానికి చెందిన మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామ పెద్దలను అడిగి వివరాలు తెలుసుకొంటాను. ఆ తరువాత నేరుగా వారి వద్దకు వెళతాను. ఒకవేళ అమ్మాయి తప్పు ఉంటే... ముందుగా ఆమె తల్లితండ్రులతో మాట్లాడతాను. పద్ధతి మార్చుకోమని తమ కూతురికి అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత వారిదే కదా! అనంతరం అబ్బాయి, అతడి తల్లితండ్రులు, బంధువులకు వేర్వేరుగా కౌన్సెలింగ్‌ ఇస్తాను. ఇరు పక్షాలు చెప్పేది విని ముఖ్యమైన అంశాలు ఒకచోట రాసుకొంటాను. దాన్ని అనుసరించి అందరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కరిస్తాను. మళ్లీ అమ్మాయిని వేధించకుండా నిఘా పెడతాం. భర్త ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు వెయ్యికి పైగా జంటలకు కౌన్సెలింగ్‌ ఇచ్చాను. కొందరు మినహా దాదాపు అందరూ ఒక్కటిగా జీవిస్తున్నారు. 


అదే ఇంటికి అతిథిగా... 

నా సేవలు గుర్తించిన నాటి కలెక్టర్‌, డీఆర్డీఏ పీడీలు 2013లో నన్ను రంగారెడ్డి ‘జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ’ సభ్యురాలిగా నియమించారు. ఇక అక్కడి నుంచి దంపతుల మధ్య తగాదాలు తీర్చడం కోసమే నా సమయమంతా కేటాయిస్తున్నా. గతంలో విడిపోదామనుకుని నా మధ్యవర్తిత్వంతో మళ్లీ ఒక్కటిగా జీవిస్తున్న జంటలు వాళ్లకి సంతానం కలిగినా, పిల్లల పుట్టినరోజులైనా నన్ను పిలుస్తారు. అతిథిగా గౌరవిస్తారు. అలా ఆ కుటుంబాన్ని చూసినప్పుడు నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది.’’


- కాల్లె పెంటయ్య







చక్కదిద్దిన సంసారాలెన్నో... 

మా చుట్టుపక్కలే కాదు... అవసరమనుకొంటే జంటలను కలపడానికి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళుతుంటాను. గత నెలలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ తన భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. మా బంధువుల ద్వారా ఈ విషయం నాకు తెలిసింది. వెంటనే ఆ జంటను కలిశాను. ‘భార్యాభర్తలన్నాక చిన్న చిన్న తగవులు సాధారణమే. వాటిని పెద్దవి చేసుకొని, పోలీస్‌ స్టేషన్ల వరకు వెళ్లి, ఆ తరువాత కోర్టుల చుట్టూ తిరగడంవల్ల వచ్చేదేం ఉండదు. కోపతాపాలు వదిలి ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకొంటే, ఒకరి బాధను ఒకరు చెప్పుకొంటే సమస్యలు సమసిపోతాయ’ని వారికి అర్థమయ్యేలా చెప్పాను. ఇప్పుడు వారిది అన్యోన్య దాంపత్యం. దంపతులనే కాదు... కొన్ని సందర్భాల్లో వారి తల్లితండ్రులను కూడా పిలిచి మాట్లాడాల్సి వస్తుంది. చీటికీమాటికీ తిట్టుకొనేవారు... పెద్దల సమక్షంలో విడిపోవడానికి సిద్ధపడ్డవారు... ఇక కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చినవారు... క్షణికావేశంలో బంధాన్ని తెంచుకొనేవారు... ఇలాంటి జంటలనెన్నిటినో మనసు మార్చి మళ్లీ ఒక్కటి చేయగలిగాను. 



Updated Date - 2021-04-19T05:30:00+05:30 IST