గాంధీ ఆలోచనే మోదీ ప్రభుత్వ సిద్ధాంతం: ఉప రాష్ట్రపతి

ABN , First Publish Date - 2022-09-25T00:19:43+05:30 IST

నరేంద్ర మోదీ సిద్ధాంతమైన 'సబ్ కా సాథ్, సబ్‌ కా విశ్వాస్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్' అనేది గాంధేయ ఆలోచన..

గాంధీ ఆలోచనే మోదీ ప్రభుత్వ సిద్ధాంతం: ఉప రాష్ట్రపతి

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సిద్ధాంతమైన 'సబ్ కా సాథ్, సబ్‌ కా విశ్వాస్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్' అనేది గాంధేయ ఆలోచన (Gandhian thought) అని, రాజకీయాలకు అతీతమని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankar) అన్నారు. తాము నమ్మిన సిద్ధాంతమే సరైనదనే ఆలోచన కొన్ని వర్గాల్లో ఉందని, ఇది చాలా ప్రమాదకరమని, మహాత్మాగాంధీ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని ఆలకించే వారని చెప్పారు. శనివారంనాడిక్కడ జరిగిన హరిజన్ సేవక్ సంఘ్ 90వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, చట్టం ముందు అందరూ సమానులేనని, చరిత్ర, అధికారంతో సంబంధం లేకుండా చట్టానికి అందరూ కట్టుబడి ఉండాలని ఉద్బోధించారు.


గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల కరోనా క్లిష్ట కాలంలో ఏ దేశం కూడా ఊహించని విధంగా 90 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహారధాన్యాల పంపిణీ జరిగిందని అన్నారు. ప్రభుత్వం అందరికీ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతో  ''మహాత్మాగాంధీ ఆత్మ సంతృప్తి చెందింది'' అని ధన్‌ఖర్ చెప్పారు. గాంధేయ సిద్ధాంతానికి అనుగుణంగానే 18 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత వంటగ్యాస్ ఇచ్చిందని, ఒకప్పుడు బ్యాంకుల్లోకి అడుగుపెట్టడానికి బయపడే వారి ఇంటిముంగిటికే ఆ సౌకర్యం తీసుకువచ్చారని చెప్పారు. బాపూజీ బోధనలు ఇప్పటికీ అనుసరణీయమని అన్నారు. మహాత్మాగాంధీ బోధించిన మానవత్వం అన్నింటింకనే గొప్పదని, ప్రపంచం ఇవాళ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని, పేదరికం, వాతావరణ మార్పులు, యుద్ధాలు వంటి అన్ని సమస్యలకూ పరిష్కారం గాంధేయ సిద్ధాంతాలేనని ఆయన సూచించారు. గాంధీజీ స్వరాజ్ ఐడియా ముఖ్య ఉద్దేశం సమాజంలోని చిట్టచివరి వ్యక్తి వరకూ ఉద్ధరణ జరగడమేనని అన్నారు. ఆహార భద్రత, వ్యాక్సినేషన్, యూనివర్శిల్ బ్యాంకింక్ వంటి ఆలోచనన్నీ గాంధీ స్ఫూర్తితోనే ప్రభుత్వం చేపట్టిందని ఉప రాష్ట్రపతి చెప్పారు. సోషల్ డెమోక్రసీ అనే పునాది లేకుంటే పొలిటికల్ డెమోక్రసీ మనుగడ సాగించలేదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన చివరి ప్రసంగంలో చెప్పిన మాటలను ధన్‌ఖర్ గుర్తుచేశారు. అంబేడ్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.

Updated Date - 2022-09-25T00:19:43+05:30 IST