సచిన్ తొలి బంతిని ఎదుర్కోడు.. ఎందుకో తెలుసా..: గంగూలీ

ABN , First Publish Date - 2020-07-06T23:10:03+05:30 IST

ఏ మ్యాచ్‌లోనూ మొదటి బంతిని ఎదుర్కోడానికి సచిన్ ఇష్టపడడని భారత మాజీ కెప్టెన్ గంగూలీ..

సచిన్ తొలి బంతిని ఎదుర్కోడు.. ఎందుకో తెలుసా..: గంగూలీ

కలకత్తా: ఏ మ్యాచ్‌లోనూ మొదటి బంతిని ఎదుర్కోడానికి సచిన్ ఇష్టపడడని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ తెలిపారు. దీనికి సచిన్ ఎప్పుడూ రెండు కారణాలు చెప్పేవాడని, అందువల్ల తానే ఫేస్ బ్యాటింగ్‌కు దిగేవాడినని గంగూలీ చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంగూలీ భారత బెస్ట్ ఓపెనింగ్ జోడీలో ఒకడైన సచిన్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను, సచిన్‌తో కలిసి దాదాపు 126 మ్యాచ్‌లకు ఓపెనింగ్ చేశానని, అయితే ఏ మ్యాచ్‌లో కూడా తొలి బంతిని ఎదుర్కొనేందుకు సచిన్ ఆసక్తి కనబరిచేవాడు కాదని గంగూలీ పేర్కొన్నారు. ‘సచిన్ ఎప్పుడూ నాన్ స్ట్రైకర్‌గానే ఉండేవాడు. అందుకు సచిన్ రెండు కారణాలు చెప్పేవాడు. ఫామ్‌లో ఉంటే తోటి ఆటగాడికి అండగా ఉండేందుకు తొలి బంతిని ఆడే అవకాశం ఇస్తానని చెప్తాడు. ఒకవేళ ఫామ్ లేకపోతే తనపై ఒత్తిడి తగ్గించుకునేందుకు నాన్‌స్ట్రైకింగ్‌లో ఆడతానని అనేవాడు. అయితే కొన్ని సార్లు నేను సచిన్‌తో ట్రిక్‌ చేసేవాడిని. క్రీజ్ వరకు వచ్చి నాన్ స్ట్రైకర్ లైన్ వద్ద అగిపోయేవాడిని. అది గమనించకుండా సచిన్ ముందుకెళ్లేవాడు. దీంతో సచిన్ స్ట్రైకింగ్ చేస్తున్నాడని ప్రేక్షకులందరూ కేకకలు వేసేవారు. ఆ సమయంలో ఏం చేయలేక సచినే మొదటి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యేవాడు. అయితే కేవలం ఒకటి, రెండుసార్లు మాత్రమే ఆ ట్రిక్ సక్సెన్ అయ్యింది. నా ట్రిక్ కనిపెట్టిన సచిన్ తానే నా వెనగ్గా వచ్చి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఆగిపోవడం మొదలెట్టాడు. దీంతో మళ్లీ ట్రిక్ చేయలేకపోయా’ అంటూ గంగూలీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే భారత ఓపెనింగ్ జోడీల్లో సచిన్-గంగూలీ జోడీలా ఏ జోడీ కూడా సక్సెస్ అవ్వలేదంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరూ కాకుండా సచిన్-సెహ్వాగ్, గంగూలీ-సెహ్వాగ్ కూడా ఓపెనింగ్ చేసేందుకు ప్రయత్నించినా అంత ప్రభావం చూపలేదు. అందుకే ఇప్పటికీ సచిన్-గంగూలీదే బెస్ట్ ఓపెనింగ్‌ జోడీగా నిలిచిపోయింది.

Updated Date - 2020-07-06T23:10:03+05:30 IST