నిబంధనలు..బేఖాతరు!

ABN , First Publish Date - 2021-01-24T06:09:53+05:30 IST

మార్చి 31వ తేదీ లోపు గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంట ర్లు, ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.

నిబంధనలు..బేఖాతరు!

సాంకేతిక అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు 

మార్చి 31వ తేదీలోపు 100 శాతం పనులు పూర్తి కావాలని టార్గెట్‌

రేపటి రోజున కాగ్‌, విజిలెన్స్‌ వంటి సంస్థలు పట్టుకొంటే ఇబ్బందే


గుంటూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): మార్చి 31వ తేదీ లోపు గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంట ర్లు, ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ క్రమంలో  జిల్లాలో నిబంధనలు తుంగలోకి తొక్కు తున్నారు. ప్రభుత్వ శాఖలపరంగా ఎలాంటి నిర్మాణం జరగాలన్నా తొలుత పరిపాలన, ఆ తర్వాత సాంకేతిక అనుమతులు వచ్చిన తర్వాత నే చేపట్టాలి. అలాంటిది ప్రస్తుతం జరుగుతున్న వివిధ భవనాల పను లకు తగిన సాంకేతిక అనుమతులు తీసుకోకుండానే బిల్లులు చేస్తున్నా రు. ఇప్పుడున్న అధికారులు రేపటిరోజున బదిలీ అయి వెళ్లిపోతే తమ పరిస్థితి ఏమౌతుందోనని కిందిస్థాయి ఉద్యోగులు మథనపడు తున్నారు. అలానే కాగ్‌, విజిలెన్స్‌ వంటి సంస్థలు పట్టుకొంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన చెందుతున్నారు.

 జిల్లాలో 800 గ్రామ సచివాలయాల భవనాలకు ప్రభుత్వం రూ.304.15 కోట్లు మంజూరు చేసింది. అలానే 584 రైతుభరోసా కేంద్రా లకు రూ.127.31 కోట్లు, 641 హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లకు రూ.112.17 కోట్లు, 409 ప్రహరీగోడల నిర్మాణానికి రూ.34.93 కోట్లని మంజూరు చేసింది. వీటికి పరిపాలన అనుమతులు అయితే ప్రభుత్వం నుంచి వచ్చాయి. ఆయా పనులన్నింటికీ సంబంధిత సూపరింటెండింగ్‌ ఇంజ నీర్‌ సాంకేతిక అనుమతులు ఇవ్వాలి. అప్పుడే పనులు ప్రారంభించి పూర్తి చేయాలి. అయితే పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ జిల్లాలో జరుగుతున్న చాలా పనులకు ఇప్పటివరకు పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. మొత్తం 2,434 పనులకు గాను 2,312 పనులు గ్రౌండింగ్‌ అయ్యాయి. ఇంకా 122 పనులు గ్రౌండింగ్‌ కావాల్సి ఉన్నది. 124 గ్రామ/వార్డు సచివాలయాలు, మూడు రైతుభరోసా   కేంద్రాలు, 2 హెచ్‌డబ్ల్యూసీ కేంద్రాలు, 137 ప్రహరీ నిర్మాణాలు పూర్తి అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇంకా 2,046 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.74.14 కోట్లు ఖర్చు చేశారు. 

ఇదిలావుంటే మార్చి 31వ తేదీ ఆయా పనులు పూర్తి కావడానికి డెడ్‌ లైన్‌ పెట్టారు. సీఎం జగన్‌ వీటిపై తరచుగా సమీక్ష చేస్తుండ టంతో జిల్లా స్థాయి అధికారులు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి పెంచారు. ప్రతీ వారం రూ.20 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చే యాలని లక్ష్యం పెట్టారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) వారంలో ఒకసారి ఈ పనులపై సమీక్ష చేస్తుండటంతో పురోగతి చూపించుకొనేందుకు అధికా రులు నిబంధనలు పాటించడం లేదు. సాంకేతిక అనుమతులు లేకుండానే పనులు గ్రౌండింగ్‌ చేసి బిల్లులు పేమెంట్‌కు పెట్టేస్తున్నారు. ఈ నిబంధ నల ఉల్లంఘన చివరికి ఎవరికి చుట్టుకొంటుందోనని వివిధ ఇంజనీరింగ్‌ శాఖల్లో ఉద్యోగులు మథనపడుతున్నారు. 

Updated Date - 2021-01-24T06:09:53+05:30 IST