హతవిధీ

ABN , First Publish Date - 2022-08-19T06:07:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చెబుతున్న సచివాలయ వ్యవస్థ ప్రారంభమై మూడేళ్లు కావస్తున్నా గాడిన పడిన దాఖలాలు కనిపించడం లేదు.

హతవిధీ
సచివాలయ

విధుల కేటాయింపు లేకుండా వెట్టిచాకిరీ

సచివాలయ ఉద్యోగులపై పనిభారం

జాబ్‌ చార్ట్‌ లేకుండానే అన్ని రకాల పనులు

ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా సిబ్బంది 

పలు శాఖల ఉద్యోగులు సొంత శాఖకే పరిమితం 

శానిటరీ అసిస్టెంట్లకు పెద్ద మేస్త్రీలుగా మారుపేరు 

వెల్ఫేర్‌ అసిస్టెంట్లు సేల్స్‌ ప్రమోటర్లుగా.. 

ఆ విధంగా పిలుచుకుంటూ వాపోతున్న వైనం 

మూడేళ్లయినా సచివాలయ వ్యవస్థ గాడిన పడలేదు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్ధిష్టమైన జాబ్‌ చార్టు ప్రకటించలేదు. దీంతో ఎవరి విధులు ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సచివాలయ విధులు, సొంత శాఖల విధులు, అధికారుల ఒత్తిళ్లతో నలిగిపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరు పని ఒత్తిడితో ఉండగా.. మరికొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఖాళీగా కూర్చుంటున్నారు. గ్రామ కార్యదర్శి ఈవోపీఆర్డీ, ఎంపీడీవోల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. వార్డు శానిటరీ అసిస్టెంట్లు పారిశుధ్య కార్మికులకు పెద్దమేస్త్రీలుగా తమను చెప్పుకుంటున్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్లు సేల్స్‌ ప్రమోటర్లుగా, డిజిటల్‌ అసిస్టెంట్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరికి వారుగా తమను తాము తక్కువ చేసుకుని విధులు నిర్వర్తిస్తున్నామని వాపోతున్నారు. 

గుంటూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చెబుతున్న సచివాలయ వ్యవస్థ ప్రారంభమై మూడేళ్లు కావస్తున్నా గాడిన పడిన దాఖలాలు కనిపించడం లేదు. సిబ్బంది ఉద్యోగాలైతే క్రమబద్ధం అయ్యాయిగానీ వారి విధులు మాత్రం ఇప్పటికీ వారికి కేటాయించలేదు. తమకు జాబ్‌ చార్ట్‌ ప్రకారం విధులు కేటాయించకుండా అనధికారికంగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ విధులు, సొంత శాఖల విధులు, అధికారుల ఒత్తిళ్లతో నలిగిపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగాలు క్రమబద్దీకరణతో బాధ్యతల్లో మార్పు వస్తుందని మూడేళ్లుగా ఎదురు చూసిన వారు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.


వాపోతున్న ఉద్యోగులు

గుంటూరు జిల్లాలో 568, పల్నాడు జిల్లాలో 538, బాపట్ల జిల్లాలో 477 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 14,291 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటిలో మొత్తం 16 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. వీరికి ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్ధిష్టమైన జాబ్‌ చార్టు ప్రకటించలేదు. దీంతో ఎవరి విధులు ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మండల, జిల్లా అధికారుల సూచనల మేరుకు విధులు నిర్వహిస్తున్నారు. కొందరు ప్రకటిత సమయం కంటే 4,5 గంటలు అదనంగా చాకిరీ చేస్తుంటే, మరి కొందరికి ఎలాంటి పనీ లేకుండా ఖాళీగా కూర్చోవలసి వస్తోంది. గ్రామ కార్యదర్శికి పంచాయతీరాజ్‌ చట్టం, జీవో నెం.149 ప్రకారం కేటాయించాల్సిన విధులను కేటాయించకపోవడంతో వారు ఈవోపీఆర్డీ, ఎంపీడీవోల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. వారు ఏ పని చెబితే ఆ పని చేస్తున్నారు. విధులు, గౌరవం లేక, పనిభారం మోయలేని వారు తమను పెద్ద పాలేర్లుగా అభివర్ణించుకుంటున్నారు. వార్డు శానిటరీ అసిస్టెంట్లు పారిశుధ్య కార్మికులకు పెద్దమేస్త్రీలుగా తమను చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ పనిచేస్తున్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్లు సేల్స్‌ ప్రమోటర్లుగా, డిజిటల్‌ అసిస్టెంట్లు టేటా ఎంట్రీ ఆపరేటర్లుగా చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరికి వారుగా తమను తాము తక్కువ చేసుకుని విధులు నిర్వర్తిస్తున్నామని వాపోతున్నారు. మహిళా పోలీసులదైతే మరింత దారుణమైన పరిస్థితి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలని చేరిన మహిళలను హోమ్‌ శాఖ పరిధిలోకి తెచ్చి బందోబస్తులకు పంపిస్తున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఆయా సచివాలయాల పరిధిలో శవ పంచనామాలకు కూడా పంపుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో వారు చాలా ఆందోళనకు గురవుతున్నారు.


సొంత శాఖలకే పరిమితమైన కొందరు  

సచివాలయాల్లో ఉన్న పలు శాఖల ఉద్యోగులు వారి సొంత శాఖలకే  పరిమితమైపోతున్నారు. ఆయా శాఖల్లో అటెండర్‌, ఆఫీస్‌ సబార్టినేట్‌ తదితర పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నతాధికారులు  వారిని తమ పరిధిలోకి తీసుకుని పనిచేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీఆర్వోలు పూర్తిగా రెవెన్యూ శాఖ, ఏఎన్‌ఎంలు వైద్య ఆరోగ్య శాఖ, సర్వే అసిస్టెంట్లు సర్వే శాఖకు పరిమితమైపోయారు.  రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య స్పందన కార్యక్రమంలో ప్రతి ఒక ఉద్యోగి పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించినా వీరు మాత్రం హాజరు కావడంలేదు. సొంత శాఖల అండదండలు ఉండడంతో వారు ఇలా గైర్హాజరవుతున్నారు. నిర్థిష్టమైన విధులు  లేకపోవడంతో మరికొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఖాళీగా కూర్చుంటున్నారు.


Updated Date - 2022-08-19T06:07:40+05:30 IST