సచివాలయాల సందర్శన

Jul 30 2021 @ 01:02AM
దొనకొండలో సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ

దొనకొండ, జూలై 29 : రాష్ట్రప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాల్లో అర్హులైన లబ్ధిదారుల వివరాలను ప్రతి గ్రామంలోని సచివాలయాల్లోని నోటీస్‌ బోర్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ ఆదేశించారు. మండలంలోని దొనకొండ, మల్లంపేట గ్రామాల్లోని సచివాలయాలను గురువారం ఆయన అకస్మిక తనిఖీ  చేశారు. సిబ్బంది హాజరుతో పాటు సచివాలయాల్లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు నాణ్యమైన సేవలు త్వరితగతిన అందించాలన్నారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ప్రభుత్వం విధించిన గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు. మండలంలోని గ్రామాల్లో కరోనా నియంత్రణ నిమిత్తం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎంతవరకు పూర్తి చేశారో..? అందుకు సంబందించిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో కరోనా మూడవ దశ వ్యాపించకుండా ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించేలా చైతన్యపర్చాలన్నారు. మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కే.జీ.ఎ్‌స.రాజుకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కే.వెంకటేశ్వర రావు, ఎంపీడీవో కే.జీఎస్‌.రాజు, పీఆర్‌ ఏఈ వెంకటేశ్వరరావు, వీఆర్‌వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కురిచేడు : కురిచేడులోని సచివాలయాన్ని జాయింట్‌ కలెక్టర్‌-2 చేతన్‌ గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జేసీ చేతన్‌ వచ్చీ రాగానే ఉద్యోగుల హాజరు పుస్తకం పరిశీలించి ఎవరెవరు విధుల్లో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.కార్యాలయం సిబ్బంది విధులను గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలను పరిశీలించారు. ఆయన వెంట తహసిల్దార్‌ నరసింహారావు ఉన్నారు. 

వెలిగండ్ల : సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని  మండల ప్రత్యేక అధికారి సిహెచ్‌ చంద్రఽశేఖరరావు అన్నారు. గురువారం మండలంలోని మొగుళ్ళూరు, రామగోపాలపురం, వెలిగండ్ల, గన్నవరం సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించే విధంగా చొరవ చూపాలన్నారు. విధి నిర్వహణలో నిర్లలక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పని సరిగా బయోమెట్రిక్‌ హజరు వేయాలన్నారు. అనంతరం వివిధశాఖల్లో పనులను పరిశీలించారు. 

లింగసముద్రం : సచివాలయంలో అన్ని రికార్డులు తప్పని సరిగా నిర్వహించాలని ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డి చెప్పారు. గురువారం ఆయన లింగసముద్రంలోని సచివాలయం-1ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. సచివాలయంలో ఏయే రికార్డులు నిర్వహించాలో ఆయన వివరించారు. ఉద్యోగులు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో రాసి వెళ్ళాలన్నారు. తప్పని సరిగా సమయపాలన పాటించాలన్నారు.జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులు సచివాలయాలను తనిఖీ చేసినప్పుడు ఖచ్చితంగా రికార్డులు తాజాగా ఉండాలన్నారు.అలాగే విధులకు సక్రమంగా హాజరు కానీ నలుగురు వలంటీర్లకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.

సీఎ్‌సపురం : సచివాలయ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో కట్టా శ్రీనువాసులు సూచించారు. మండలంలోని చింతపూడి, ఆర్కెపల్లి సచివాలయాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డులను పరిశీలించారు. ఉద్యోగులు సమయపాలన పాటించి నిరంతరం కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించాలని ఆయన తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.